పాలకుల పట్ల అప్రమత్తంగా ఉండండి
- రాష్ట్ర ప్రజలకు పీసీసీ చీఫ్ రఘువీరా హెచ్చరిక
మడకశిర : హేవిళంబి నామ సంవత్సరంలో రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా లేకుంటే పాలకుల చేతిలో మోసపోవడం ఖాయమని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి హెచ్చరించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఉగాది పండుగ సందర్భంగా బుధవారం మడకశిరలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద లౌకికవాద పరిరక్షణ, ప్రజలకు మంచి జరగాలని ఆకాంక్షిస్తూ ఉదయం 11.20 నుంచి 12 గంటల వరకు మౌనదీక్ష చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడి రైతుల ఆత్యహత్యలు పెరుగుతున్నా, నివారణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలూ చేపట్టలేదని మండిపడ్డారు. ఎన్డీఏ ప్రభుత్వ విధానాలతో లౌకికవాదానికి ముప్పు ఏర్పడిందన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లు అభద్రతాభావంతో జీవనం సాగిస్తున్నారని, హిందువులకు కూడా మనశ్శాంతి లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. లౌకికవాదాన్ని పరిరక్షించుకోవాలని కోరారు. మౌనదీక్షలో మాజీ ఎమ్మెల్యే సుధాకర్, నెల్లూరు జిల్లా ఆత్మకూరు కాంగ్రెస్ ఇన్‌చార్జ్ చేవూరు శ్రీధర్‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సురంగలనాగరాజు, మండల కన్వీనర్ మంజునాథ్, పట్టణ కన్వీనర్ నాగేంద్ర, మాజీ మండల కన్వీనర్ ఆశ్వర్థనారాయణ, జిల్లా మైనార్టీసెల్ అధ్యక్షుడు జియాఉద్దీన్ తదితరులు పాల్గొన్నారు.