'ఏపీ అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహించారు'
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండా బిల్లులు ఆమోదించుకోవడం సరికాదని పీసీసీ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో మీడియాతో బుధవారం ఆయన మాట్లాడారు. అసెంబ్లీని అధికార పార్టీ ఏకపక్షంగా నిర్వహించిందన్నారు. ప్రైవేట్ వర్సిటీల బిల్లు, రాజధాని భూములను 99 ఏళ్ల పాటు ప్రైవేట్ సంస్థలకు లీజుకిచ్చే బిల్లులను గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తిరస్కరించాలని కోరారు. తన వారికి లాభం చేకూర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రెండు బిల్లులను తెచ్చారని విమర్శించారు.
రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేలా చంద్రబాబు సర్కార్ వ్యవహరిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. ఎథిక్స్ కమిటీకి రిఫర్ చేయకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాను సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. విశాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై విడుదల చేసిన జీవో నం.97ను రద్దు చేయాలని పీసీసీ చీఫ్ రఘువీరా డిమాండ్ చేశారు.