
సాక్షి, హైదరాబాద్: ‘అసలు రాందాస్ అథవాలే ఎవరు? ఆయన మమ్మల్ని బీజేపీలోకి ఆహ్వానించడమేంటి? దాన్ని పచ్చ చానల్స్ హంగామా చేయడమేంటి? చూస్తుంటే.. ఇదంతా సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ పథకం ప్రకారం ఆడిన డ్రామాలా అన్పించడం లేదా?’ అని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. రోజా ఏమన్నారంటే.. ‘తండ్రీకొడుకులు కేంద్ర మంత్రి అథవాలేతో మ్యాచ్‌ఫిక్సింగ్ చేసుకుని, ఆయనతో ప్రెస్‌మీట్ పెట్టించి ప్రకటన ఇప్పించారు... ఆయన అలా ప్రకటన చేయడం ఆలస్యం నారా లోకేశ్ ఇది కుట్రంటూ ట్వీట్ చేసేశారు.. ఆ మరుక్షణమే సీఎం చంద్రబాబు విలేకరుల సమావేశం పెట్టారు. నిజంగా ఇదంతా కుట్ర కాదా? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లడానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నమే ఇది. బీజేపీ కాదుకదా.. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండానే వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామని వైఎస్ జగన్ ప్రతి సభలోనూ పదేపదే చెబుతున్నారు’ అని రోజా గుర్తు చేశారు. అధికారం కోసం వైఎస్ జగన్ ఏ పార్టీతోనూ ఇప్పటివరకూ జత కట్టలేదని, పొత్తు పెట్టుకుని అధికారం చేజిక్కించుకోవాలని ఆరాటపడలేదని తెలిపారు.
దమ్ముంటే కెమెరా ముందుకు రా పప్పూ
చంద్రబాబు తన 1500 రోజుల దరిద్రపు పాలనపై ప్రజలు చర్చించుకోకుండా పక్కదారి పట్టించేందుకు డ్రామాకు తెరతీశారని రోజా అన్నారు. జగన్ బీజేపీలోకొస్తే బాగుంటుందని అథవాలే చేసిన ప్రకటన ఇందులో భాగమేనన్నారు. వెంటనే నిప్పు (చంద్రబాబు) ప్రెస్‌మీట్ పెట్టేశాడని, నిమిషాల్లోనే పప్పు (లోకేశ్) ఇది కుట్రంటూ ట్వీట్లు చేశాడని మండిపడ్డారు. లోకేశ్‌కు ధైర్యం ఉంటే తమ పార్టీ ఏం కుట్ర చేసిందో కెమెరాల ముందుకొచ్చి చెప్పాలన్నారు.
జనంలోకి వెళ్లలేక.. బురదజల్లుతారా?
మంచి చేసి ప్రజల మెప్పు పొందాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎప్పుడూ లేదని, ఎదుటివారిపై బురదజల్లి, తన పచ్చమీడియాలో ప్రచారం చేసుకుని లబ్ధి పొందడమే ఆయనకు తెలిసిన విద్యని రోజా ధ్వజమెత్తారు. 1999, 2004, 2014 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీతో కలిసే చంద్రబాబు ఎన్నికలకెళ్లారని గుర్తుచేశారు. ఒంటరిగా ఏనాడూ ఎన్నికల్లో పోటీ చేసిన చరిత్ర చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తికి జగన్ గురించి మాట్లాడే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు.
మేలు జరిగిందెవరికి?
చంద్రబాబు పాలనలో ఆయనకు, ఆయన కుమారుడికి, ఆయన మీడియా సంస్థలకు తప్ప ఇంకెవరికీ ప్రయోజనం కలగలేదని రోజా అన్నారు. ప్రజల సంపదను దోచుకోవడమే కాకుండా, టీటీడీ ఆస్తులూ కాజేసేందుకు పథకాలు వేశారని ఆమె మండిపడ్డారు. ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాల్లో 99 శాతం అమలు చేసినట్టు చెప్పుకుంటున్నారని, అదే నిజమైతే 2014 ఎన్నికల మేనిఫెస్టోను టీడీపీ వెబ్‌సైట్ నుంచి ఎందుకు తీసేశారో చెప్పాలన్నారు.
కరవుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు
కరవుకు బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబని, ఆయన ఎప్పుడొచ్చినా రైతుల జీవితాలు కరవుతో అల్లాడిపోతున్నాయని విమర్శించారు. గతంలో చంద్రబాబు 3,178 రోజులు పరిపాలించాడని, ఆ పాలన దరిద్రంగా ఉండబట్టే ప్రజలు పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. ఎస్సీ ఎస్టీ మహిళలపై అత్యాచారాలు, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కడంలో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా చేయడమే చంద్రబాబు సాధించిన ఘనతని నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు ధైర్యం ఉంటే పోలవరం అవినీతి, టీటీడీ అక్రమాలు, రాజధానిలో రైతుల భూములు దోచుకోవడం, ఓటుకు కోట్లు కేసుపై సీబీఐ విచారణ వేయించుకోవాలని సవాల్ చేశారు. గోదావరి పుష్కరాల్లో చనిపోయినవారికి ఇప్పటికీ న్యాయం చేయని పాలన బాబుదని ధ్వజమెత్తారు. పాఠశాలలకు సెలవైనా వనం– మనం పేరుతో పిల్లలను తీసుకెళ్లి పొట్టనబెట్టుకున్నారని మండిపడ్డారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు అరాచకాలపై విచారణ జరుపుతామని, నష్టపోయినవారికి న్యాయం చేస్తామని చెప్పారు.