సాక్షి, హైదరాబాద్: అధికార తెలుగుదేశం పార్టీకి ఓటమి భయం పట్టుకోవడం వల్లే ముందస్తు ఎన్నికలు వద్దని ప్రెస్‌మీట్లు పెట్టడంతో పాటుగా ట్వీట్లు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్.కె.రోజా ధ్వజమెత్తారు. ఆమె గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పం పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోవడమే కాక, ఆయన వెంట జనం ప్రభంజనంలాగా నడుస్తుండటంతో టీడీపీ నేతలకు కంటి మీద కునుకు కరవైందన్నారు. ఫ్లెక్స్ సంస్థపై వచ్చిన వార్తను ప్రస్తావిస్తూ... లోకేశ్ చేసిన ట్వీట్లు చూస్తే ఆయనకున్న పప్పు అనే బిరుదును సార్థకం చేసుకున్నట్లుందన్నారు.
ఈ సంస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా రాయితీలు ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఏదో తమ ఘనతగా లోకేశ్ చెప్పుకుంటున్నారని ఆమె విమర్శించారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు రాష్ట్రంలో పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ చెప్పుకుంటున్నారని, రూ. 20 లక్షల కోట్లు పెట్టుబడులుగా వచ్చినట్లు ప్రకటించారన్నారు. అయితే నాలుగేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.16,933 కోట్లు మాత్రమేనన్నారు. లోకేశ్‌ను తొలుత పప్పు ఏదో అనుకున్నామని, ఇపుడాయన తెలివితేటలు చూస్తూంటే గన్నేరు పప్పు అనే విషయం చంద్రబాబుకు కూడా అర్థమై పోయిందన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కనకదుర్గమ్మకు ముక్కుపుడక ఇవ్వడానికి విజయవాడ వస్తే మంత్రి దేవినేని ఉమా ఆయనకు వంగి వంగి నమస్కారాలు పెట్టి సేవలందించారన్నారు. దేవినేని ప్రొటోకాల్ మంత్రిగా వ్యవహరించలేదని ఓటుకు కోట్లు కేసులో ఇరుకున్న తమ నేత చంద్రబాబుపై కేసులు రాకుండా కాళ్లు పట్టుకున్నట్లుగా ఉందని ఆమె వ్యాఖ్యానించారు.
టీడీపీ నేత కళా వెంకటరావు జగన్‌కు లేఖ పేరుతో ఏవో పిచ్చి ప్రశ్నలు వేశారన్నారు. లక్ష కోట్లు అని పాతపాటే పాడారని, నాలుగేళ్లుగా కేంద్రంతో జత కట్టిన టీడీపీ వారు లక్ష కోట్లకు ఆధారాలు ఎందుకు తీసుకురాలేదో? చెప్పాలన్నారు. తన లక్ష కోట్ల ఆస్తిని చూపిస్తే అందులో పది శాతం ఇస్తే మిగతాది మీకే రాసిస్తానని జగన్ అసెంబ్లీలోనే సవాలు విసిరితే ముందుకు రాని టీడీపీ వారు ఇంకా అదే విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. కళా కనుక చర్చకు వస్తే ఆయన అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామని, లేకుంటే ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని రోజా ప్రశ్నించారు. రైతుల రుణాలను మాఫీ చేస్తానని మోసం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఏరువాక అంటూ బయలుదేరారని, అయితే రైతులు ఆయనపై పోరువాకకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. 2014–16లో మహిళలపై అత్యాచారాల్లో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంటే ఇపుడు అది నాలుగో స్థానానికి చేరిందని ఇదీ చంద్రబాబు సాధించిన ఘనత అని ఎద్దేవా చేశారు. ఈరోజు సెక్స్ రాకెట్ అమరావతి నుంచి చికాగో వరకూ తీసుకు వెళ్లి తెలుగు వారి గౌరవాన్ని గంగలో కలిపారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎం రమేష్ దీక్ష చేస్తున్నది ఏ ప్రభుత్వంపైన
నాలుగేళ్లు బీజేపీ ప్రభుత్వంతో అంటకాగిన టీడీపీకి ఇపుడే స్టీలు ఫాక్టరీ ఇప్పుడే గుర్తుకు వచ్చిందా అని రోజా ప్రశ్నించారు. అసలు ఎంపీ సీఎం రమేష్ ఎవరి ప్రభుత్వంపై దీక్ష చేస్తున్నారని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు గత తొమ్మిదేళ్ల పాలనలో ఏనాడూ స్టీల్‌ప్లాంట్ గుర్తుకు రాలేదని దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తన పాలనలో స్టీల్ ఫ్యాక్టరీకి ఉపక్రమిస్తే నానా యాగీ చేసింది చంద్రబాబేనని ఆమె దుయ్య బట్టారు. తమ పార్టీ ఎంపీ అవినాశ్‌రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి 8 సార్లు పార్లమెంటులో మాట్లాడితే ఒక్క టీడీపీ ఎంపీ కూడా పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో మంతెన, వీరమాచినేని డైటింగ్ గురించి చర్చ జరుగుతోందని ఇపుడు సీఎం రమేష్, బిటెక్ రవి దీక్ష చూశాక వారి డైటింగ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
టీడీపీకి ఓటమి భయం
Published Fri, Jun 29 2018 4:28 AM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment