amadaguru
-
ఆటో, బైక్ ఢీ.. ఆరుగురికి గాయాలు
అమడగూరు: గాజులపల్లి ఆదర్శ పాఠశాల సమీపాన కదిరి ప్రధానరహదారిపై జరిగిన ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సోమవారం ఓడీ చెరువు నుంచి అమడగూరుకు ప్రయాణికులతో వస్తున్న ఆటో, అమడగూరు నుంచి కదిరి వైపు వెళుతున్న ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఆటోలో ప్రయాణిస్తున్న అమడగూరుకు చెందిన నంజుండప్ప, హుసేన్, కర్ణాటక సాంకుపల్లికి చెందిన నారాయణస్వామిలకు కాళ్లు విరగ్గా.. పేరంవాండ్లపల్లికి చెందిన నరసింహులు, అమడగూరుకు చెందిన రాములమ్మ, ద్విచక్ర వాహనదారుడు మలక రాజారెడ్డిలకు తీవ్ర గాయాలయ్యాయి. కస్సముద్రంకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి, గుండువారిపల్లికి చెందిన గంగులప్ప స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రభుత్వాస్పత్రి సిబ్బంది ఏఎన్ఎంలు, హెల్త్ సూపర్వైజర్లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమచికిత్స చేశారు. గంట అనంతరం 108, ప్రైవేట్ వాహనాలలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
గోల్మాల్!
క్రీడా సామగ్రి కొనుగోలు అక్రమాలు కంపెనీ పేరుమార్చి రూ. లక్షల్లో స్వాహా జిల్లా వ్యాప్తంగా 3,703 ప్రభుత్వ పాఠశాలలకు పంపిణీ.. అమడగూరు: విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని అభివృద్ధి పరిచేందుకు అవసరమైన క్రీడా సామగ్రి కొనుగోలులో భారీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. ఈ ఏడాది విద్యాసంవత్సరం ఆరంభం కాగానే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని రకాల 3,703 (2,647 ప్రాథమిక, 587 ప్రాథమికోన్నత, 469 ఉన్నత) ప్రభుత్వ పాఠశాలలకు ఓ ప్రైవేట్ కంపెనీ ద్వారా క్రీడా సామగ్రిని సమకూర్చారు. అయితే ఈ మొత్తం తంతులో సుమారు రూ. కోటి వరకూ అక్రమాలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి ఇండెంట్లో కేటాయించిన కంపెనీ ఉత్పత్తులు కాకుండా మరో కంపెనీ ఉత్పత్తులను సరఫరా చేయడం ద్వారా అధికారులు అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. క్రీడా సామగ్రి పంపిణీ బాధ్యతను తీసుకున్న నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్.. నాణ్యత లేని క్రీడా పరికరాలను పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఎనిమిది రకాల క్రీడా సామగ్రి కిట్‌ను ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలలకు వ్యాట్ ధరతో కలిపి రూ 4,968, ప్రాథమిక పాఠశాలకు రూ 5,003 ధరతో పంపిణీ చేస్తున్నారు. అయితే బయటి మార్కెట్లో ఇవే ఎనిమిది రకాల ఆట వస్తువులు తక్కువ ధరకు లభ్యమవుతున్నాయి. బాల్‌బాడ్మింటన్ నెట్లు ఇచ్చారు కానీ బాల్స్, బ్యాట్లు ఇవ్వలేదు. నాణ్యత లేని ఈ పరికరాలను ఆయా పాఠశాలల పీఈటీలు తిరస్కరిస్తుంటే వాటిని బలవంతంగా పాఠశాలలకు ఎమ్మార్సీ సిబ్బంది చేరవేస్తున్నారు. ఎస్ఎస్ఏ పీఓ ఎమన్నారంటే.. పాఠశాలలకు నాసిరకం క్రీడా సామగ్రిని పంపిణీ చేస్తుండటంపై ఎస్ఎస్ఏ పీఓ సుబ్రహ్మణ్యంను వివరణ కోరగా.. తాను నూతనంగా బాధ్యతలు స్వీకరించానని, ఏఎంఓను వివరణ అడగమన్నారు. ఇదే విషయంపై ఏఎంఓ చెన్నకృష్ణారెడ్డిని వివరణ కోరగా.. క్రీడా సామగ్రి పరికరాల ఎంపిక జిల్లా అధికారుల చేతుల్లో లేదని, ఈ పరికరాలన్నీ రాష్ట్ర కార్యాలయం నుంచే వచ్చాయని, అక్కడే టెండర్లు పిలిచి, పంపిణీదారుని ఖరారు చేశారని తెలిపారు. రాష్ట్ర కార్యాలయం నుంచి అందిన క్రీడా సామగ్రిని మాత్రమే తాము పాఠశాలలకు చేరవేస్తున్నామని స్పష్టం చేశారు. కిట్‌లోని క్రీడాపరికరాల వివరాలు, వాటి ధరలు ఇలా క్రీడా పరికరం సంఖ్య పంపిణీ ధర మార్కెట్ ధర టెన్నీకాయిట్ రింగ్స్ 5 రూ.485.70 రూ.260 బాల్ బ్యాడ్మింటన్ నెట్ 1 రూ.271.43 రూ.200 స్కిప్పింగ్ రోప్స్ 9 రూ.437.13 రూ.270 కోన్స్ 6 రూ.408.60 రూ.408 వాలీబాల్ 1 రూ.914.29 రూ.300 వాలీబాల్ నెట్ 1 రూ.695.24 రూ.400 హూప్స్ 5 రూ.542.85 రూ.300 క్యారమ్‌బోర్డ్ 1 రూ.976.19 రూ.580 మొత్తం (వ్యాట్ ధర అదనం) రూ.4,731.43 రూ.2,718 -
సింహవాహనంపై చౌడేశ్వరీ అమ్మవారు
అమడగూరు (పుట్టపర్తి) : మండలంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరీ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అంగరంగ వైభవంగా సింహవాహన ఉత్సవాన్ని నిర్వహించారు. ఉత్సవ కార్యక్రమాన్ని ఎప్పటి లాగానే కొత్తపల్లికి చెందిన పొట్టా శివశంకర్‌రెడ్డి కుటుంబీకులు ఆర్భాటంగా నిర్వహించారు. శివశంకర్‌రెడ్డి రథసారథిగా చౌడేశ్వరమ్మను పూలపల్లకిలో పురవీధుల్లో ఊరేగించారు. ఆలయం నుంచి ఊరేగిస్తూ గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి వద్దకు తీసుకెళ్లి భక్తుల దర్శనార్థం కొలువుదీర్చారు. ధగ ధగ మెరిసే నగలతో, పట్టు వస్త్రాలతో అభయమిస్తున్నట్లు కనిపిస్తున్న చౌడేశ్వరిని దర్శించుకుని భక్తులు పునీతులయ్యారు. అలాగే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చెక్కల భజనలు, విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ చలపతి బందోబస్తు నిర్వహించారు. మంగళవారం హంసవాహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో పార్వతమ్మ, రాఘవరెడ్డి, అనూష, నిర్మలమ్మ, సుగుణమ్మ, అరుణమ్మ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. -
కనుల పండువగా చౌడేశ్వరీ జ్యోతి
అమడగూరు(పుట్టపర్తి) : చల్లని తల్లి చౌడేశ్వరమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా అంటూ అనేక మంది భక్తులు శనివారం అమ్మవారిని వేడుకున్నారు. గత ఐదు రోజులుగా మండలంలో నిర్వహిస్తున్న చౌడేశ్వరమ్మ ఉత్సవాల్లో భాగంగా శనివారం శ్రీ జ్యోతి ఉత్సవాన్ని కొత్తపల్లికి చెందిన మాజీ జెడ్పీటీసీ పొట్టా పురుషోత్తమరెడ్డి కుటుంబీకులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు తరలివచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. జ్యోతి ఉత్సవంలో ఎప్పటిలాగానే పొట్టా పురుషోత్తమరెడ్డి రథసారథిగా అమ్మవారిని ఆలయం నుంచి గ్రామ నడిబొడ్డున ఉన్న ఉట్టి దగ్గర వరకూ తీసుకెళ్లి భక్తుల సౌకర్యార్థం కొలువుదీర్చారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం కొబ్బరికాయలను సమర్పించారు. ఊరేగింపులో చౌడేశ్వరీ అమ్మవారు దేదీప్యమానంగా కాంతులను విరజిమ్ముతున్నట్లు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులంతా జై చౌడేశ్వరీ మాతా అంటూ హోరెత్తించారు. అనంతరం కోలాటాలు, భజనలు, హరికథల వంటి సాంస్కతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఈ ఏడాది ప్రత్యేకంగా ఆలయ ప్రాంగణంలో చండీయాగం నిర్వహింపజేశారు. ఉత్సవ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ శివరాముడు, ఎస్ఐలు చలపతి, సత్యనారాయణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అశ్వవాహనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఉమాదేవి, జయదేవరెడ్డి, మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు. -
భక్తుల కొంగు బంగారం చౌడేశ్వరీదేవి
సందర్భం : రేపటి నుంచి అమ్మవారి ఉత్సవాలు భక్తుల కొంగుబంగారంగా అమడగూరులోని చౌడేశ్వరీదేవి విరాజిల్లుతోంది. ప్రతి ఏటా ఛైత్ర మాసంలో ఈ ఆలయంలో చౌడేశ్వరీ అమ్మవారి ఉత్సవాలను ఎనిమిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు, కేరళ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. - అమడగూరు (పుట్టపర్తి) క్రీస్తు పూర్వం 800 సంవత్సరాల క్రితం అమరావతి పట్టణంగా పిలువబడే ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న శ్రీరంగరాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆలయ చరిత్ర చెబుతోంది. శిథిలావస్థకు చేరుకున్న ఈ ఆలయాన్ని కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన ఎమ్మెల్యే సోదరులు కిష్టప్ప, శ్రీనివాసులు తమ బంధువులతో కలిసి రూ. కోటి వెచ్చించి, మూడు గోపురాలతో జీర్ణోద్ధరణ గావించారు. ఆలయం పేరిట ఓ కల్యాణమంటపాన్ని కూడా ఇక్కడ నిర్మించారు. ఇటీవల మరో రూ. 10 లక్షలు వెచ్చించి ఆలయం చుట్టూ రేకుల షెడ్ వేశారు. అమ్మవారి ఉత్సవాలు ఇలా.. ప్రతి ఏటా ఛైత్రమాసంలో ఉగాది సందర్భంగా అమ్మవారిని 16 గ్రామాల్లో ఊరేగింపునకు తీసుకెళ్తారు. తర్వాత వచ్చే పున్నమితో సంప్రదాయబద్ధంగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగానే అమ్మవారి ఉత్సవాలు ఈ ఏడాది ఏప్రిల్ 11న ప్రారంభం కానున్నాయి. 11న కొత్తపల్లి దొనకొండ వెంకటరమణ కుటుంబీకులు కుంభకూడు, 12న శీతిరెడ్డిపల్లి గ్రామ ప్రజలచే ఉయ్యాలసేవ, 13న చీకిరేవులపల్లి, రెడ్డివారిపల్లికి చెందిన పెద్దక్క, రాజు కుటుంబీకులచే సూర్యప్రభ, 14న అమడగూరుకు చెందిన బ్రాహ్మణ, శెట్టిబలిజ సంఘం వారిచే చంద్రప్రభ, 15న కొత్తపల్లికి చెందిన పొట్టా కుటుంబీకులచే శ్రీజ్యోతి, 16న రెడ్డివారిపల్లికి చెందిన లక్ష్మీనారాయణరెడ్డి కుటుంబీకులచే అశ్వ వాహన, 17 న కొత్తపల్లికి చెందిన పొట్టా శివశంకర్‌రెడ్డి కుటుంబీకులచే సింహ వాహన, 18న గాజులపల్లికి చెందిన సుబ్బరాయప్ప కుటుంబీకులచే హంస వాహన సేవలు ఉంటాయి. కాగా ఈ ఉత్సవాల్లో 15న జరిగే శ్రీజ్యోతి ఉత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. -
అమడగూరులో కలకలం
- పట్టపగలు వ్యక్తిపై వేటకొడవలితో దాడి చేసి హత్యాయత్నం - భయభ్రాంతులకు గురైన జనం - మెరుగైన వైద్యం కోసం బాధితుడిని బెంగళూరుకు తరలింపు అమడగూరు : ఆదివారం.. అందునా వారపు సంత.. ఆ ప్రాంతమంతా జనసంచారంతో నిండిపోయింది. అంతలోనే ఓ వ్యక్తిపై వేటకొడవలితో విచక్షణారహితంగా దాడి చేయడం.. బాధితుడితో పాటు జనాలు తేరుకునేలోగానే నిందితుడు అక్కడి నుంచి మాయం కావడం..అంతా క్షణాల్లో జరిగిపోయింది. ఊహించని ఈ ఘటనతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటన అమడగూరులో వెలుగు చూసింది. ఎలా జరిగిందంటే.. మండలంలోని గంగిరెడ్డిపల్లికి చెందిన డేగాని మారపరెడ్డి ఇంటికి కావాల్సిన సరుకుల కోసం అమడగూరుకు వచ్చారు. అక్కడి ఓ కిరాణా కొట్టులో సరుకులు కొనుగోలు చేసిన అనంతరం ఇంటికి బయలుదేరే ప్రయత్నంలో బైక్‌ను స్టార్ట్ చేస్తుండగా.. వెనుక వైపు నుంచి వచ్చిన అదే మండలం కొత్తపల్లికి చెందిన వేమనారి వేట కొడవలితో మారపరెడ్డి తలపై మూడుసార్లు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఆ తరువాత ఎవరికీ చిక్కకుండా పారిపోయాడు. చొరవ చూపిన జనం తీవ్ర రక్తగాయాలతో కుప్పకూలిన మారపరెడ్డిని స్థానికులు ప్రథమ చికిత్స అనంతరం కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే తీవ్ర రక్తస్రావం జరిగి, తలపై రెండు లోతైన గాయాలు కావడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగుళూరు సెంట్‌జాన్స్ ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు కుటుంబ సభ్యులు, బంధువులు తెలిపారు. కాగా హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చలపతి తెలిపారు. అదుపులో నిందితుడు..? మారపరెడ్డిపై వేట కొడవలితో హత్యాయత్నం చేసిన వేమనారి పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. దాడి చేసిన వెంటనే నిందితుడు దేవగుడి చెరువు మీదుగా వెళ్లి కొత్తగా నిర్మిస్తున్న సాయిబాబా ఆలయ సమీపంలో దాక్కొని ఉండటంతో అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
పెచ్చులూడి ముగ్గురికి గాయాలు
అమడగూరు : మండల కేంద్రంలోని స్త్రీ శక్తి కార్యాలయంలో పెచ్చులు (సీలింగ్) ఊడి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. సోమవారం ఐకేపీ కార్యాయలంలో ఆకులవారిపల్లి శ్రీలక్ష్మీ ఏహెచ్‌జీ డాక్యుమెంటేషన్ పై సమావేశం నిర్వహించారు. సమావేశం నిర్వహిస్తున్నప్పుడే పెచ్చులూడిపడి కింద కూర్చున్న ఆకులవారిపల్లికి చెందిన మల్లికార్జున నాయుడుతోపాటు శివయ్య, ఈశ్వరమ్మ దంపతులపై పడింది. దీంతో వారందరికీ గాయాలయ్యాయి. చికిత్సల నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. కాగా స్త్రీ శక్తి భవనం నిర్మించి రెండేళ్లు కూడా గడవకనే ఇలా పెచ్చులూడి పడిపోవడంపై పలువిమర్శలు వ్యక్తమవుతున్నాయి. నాణ్యత లేని పనులకు ఉన్నతాధికారులు సైతం ఎలా బిల్లులు చేశారని మండల వ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు చొరవ చూపితే జరిగిన అక్రమాలన్నీ బయటకు వస్తాయని మండల వాసులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
సొమ్ము కోసం వచ్చి సృహ తప్పాడు!
అమడగూరు : మండలంలోని చినిగానిపల్లికి చెందిన గండారెడ్డి వెంకటరెడ్డి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద సోమవారం సొమ్మసిల్లి పడిపోయాడు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన పలువురు మాట్లాడుతూ నగదు కోసం ఉదయం నుంచి బ్యాంకు వద్దే కాచుకుని కూర్చున్నామన్నారు. సాయంత్రం వరకూ తిండి, నీరు లేక పోవడంతో బీపీ తగ్గిపోయి ఆయన సృహ తప్పిపడి పోయినట్లు తెలిపారు. వెంటనే అతడిని 108 వాహనంలో కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. కాగా నగదు కోసం ఫీల్డ్ ఆఫీసర్ ఉదయం నుంచి కదిరి బ్యాంకులో వేచి చూసి, డబ్బులివ్వక పోవడంతో వెనక్కి వచ్చినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. -
విలేకరిపై దాడి
అమడగూరు : ఓ పత్రికలో పనిచేస్తున్న రెడ్డివారిపల్లికి చెందిన విలేకరి వెంకటస్వామిపై అదే గ్రామానికి చెందిన పలువురు గురువారం రాత్రి దాడికి పాల్పడినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు. శుక్రవారం వారు మాట్లాడుతూ గతంలో జరిగిన కొన్ని పరిణామాల వలన గ్రామానికి చెందిన ఆరుగురు ఉన్నఫలంగా దాడికి పాల్పడి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు. దాడిలో గాయపడిన వెంకటస్వామికి ప్రస్తుతం కదిరి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతడిని తోటి విలేకరులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ శేషురెడ్డి, ఇతర నాయకులు పరామర్శించారు. -
శివన్న పంటా పోయింది!
అమడగూరు : స్వయాన సీఎం చంద్రబాటు రక్షకతడులను ప్రారంభించిన రైతు శివన్న పొలంలోనే వేరుశనగ పంట ఎత్తిపోయింది. చెట్టుకు ఒకట్రెండు కాయలు కూడా లేకపోవడంతో రైతు ఆవేదన చెందుతున్నాడు. తొమ్మిది ఎకరాల పంట పూర్తిగా పోయిందని, పెట్టుబడి కోసం చేసిన రూ.లక్ష అప్పు ఎలా తీర్చాలోనని వాపోతున్నాడు. అమడగూరు మండలం గుండువారిపల్లికి చెందిన రైతు శివన్న పొలంలో ఆగస్టు 28న సీఎం చంద్రబాబు రెయిన్గన్లతో రక్షకతడులు ప్రారంభించారు. ఇక తన పంట పండినట్టేనని రైతు ఆశపడ్డాడు. పంటను శనివారం ట్రాక్టరుతో దున్నించేశాడు. దిగుబడి ఏమాత్రమూ లేదు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఎద్దుల శ్రీధర్‌రెడ్డి, మండల కన్వీనర్ శేషూరెడ్డి తదితరులు రైతును పరామర్శించారు. ఈ సందర్భంగా అతను గోడు వెళ్లబోసుకున్నాడు. ‘టీడీపీ నాయకులు వచ్చి నీ పొలానికి సీఎం చంద్రబాబు వస్తున్నారు.. రక్షకతడుల ద్వారా పంటను కాపాడతారని చెప్పారు. సీఎం వచ్చిన రోజు కాసేపు రెయిన్గన్లు బిగించారు. ఆయన వెళ్లగానే అదే రోజు సాయంత్రం ఫారంపాండ్లోని కవరు, రెయిన్గన్లు అన్నీ తీసుకెళ్లిపోయారు. పంటంతా ఎండిపోయింద’ని వాపోయాడు. సీఎం వచ్చి రెయిన్గన్లను ప్రారంభించిన పంట పొలమే పూర్తిగా ఎండిపోతే..ఇక మిగిలిన రైతుల పరిస్థితి ఏంటని వైఎస్సార్సీపీ నాయకులు ప్రభుత్వంపై మండిపడ్డారు. రక్షక తడుల పేరుతో కోట్ల రూపాయలను కొల్లగొట్టారే కానీ రైతులకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శశికళ, నాయకులు సుధాకర్‌రాజు, రషీద్, మోహన్‌రెడ్డి, రమణారెడ్డి, అంజినప్ప, రామప్ప తదితరులు పాల్గొన్నారు. -
కరువు, చంద్రబాబు అవిభక్త కవలలు
పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అమడగూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు, కరువు అవిభక్త కవల పిల్లలని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. సోమవారం ఆయన అమడగూరు మండలంలో కరువుతో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్రను నిర్వహించారు. కొట్టువారిపల్లి నుంచి దారికి ఇరువైపులా పొలాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆగస్టు 28 న సీఎం చంద్రబాబు రెయిన్గన్లు ప్రారంభించిన పొలంలో సంబంధిత రైతు శివన్నతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ సీఎం రెయిన్గన్లు ప్రారంభించిన పొలంలోని వేరుశనగ పంట ఎండిపోతుంటే ఇక మిగతా రైతుల పరిస్థితి ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆయన పాదయాత్రతో అమడగూరు బస్టాండుకు చేరుకుని బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నాగరాజారెడ్డి, డీసీసీ అధ్యక్షడు కోటా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కరువు మండలాలను ప్రకటించాలి .. పెనుకొండ: జిల్లాలోని అన్ని మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. అమడగూరులో పాదయాత్ర ముగించుకున్న ఆయన పెనుకొండలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కరువు మండలాలను ప్రకటించక పోవడంపై ఆయన సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు. ఎకరాకు రూ.40,000 పరిహారం ప్రకటించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
సీఎం హామీ నీటి మూటే..!
ఈ ఫొటోలో ఉన్నది గత నెల 28న సీఎం చంద్రబాబు రెయిన్గన్లు ప్రారంభించిన వేరుశనగ పొలం. స్వయానా ఆయనే రెయిన్‌గన్ ప్రారంభించి ‘పంట పండేంత వరకూ నీటిని సరఫరా చేస్తాం’ అని బాధిత రైతు శివన్నకు హామీ ఇచ్చారు. అయితే ఆ హామీ బుట్టదాఖలైంది. కాగా ఈ పొలం అమడగూరు నుంచి కదిరికి వెళ్లే ప్రధాన ర హదారి పక్కనే ఉండటంతో అటుగా వెళ్లే ప్రయాణికులంతా ఎండిన పొలాన్ని చూస్తూ సీఎం రెయిన్గన్లు ప్రారంభించి పంటే ఎండిపోతుంటే మరి మిగతా రైతుల పరిస్థితి ఏంటని చర్చించుకుంటున్నారు. -
చింత పూల చెట్టు
అమడగూరు : అవును మీరు చదివింది నిజమే.. అమడగూరు మండలం మలకవారిపల్లిలో రామాలయం పక్కనున్న వృక్షాన్ని చూసిన వారికి ఇది చింతచెట్టా లేక పూలచెట్టా అని అనుమానం కలగక మానదు. ఎందుకంటే చింతచెట్టు ఎంత ఎత్తు ఉంటే అంతే ఎత్తు వరకూ కింద నుంచి పైదాకా పూలచెట్టులో ఎర్రటి డబ్బారేకుల పూలు అందంగా కనపడతాయి. దీంతో చూసేవారు తప్పకుండా చెట్టు మొదలును పరిశీలించి తమ సందేహాన్ని తీర్చుకోవాల్సిందే. గ్రామస్తుల కథనం ప్రకారం ఈ చెట్లు దాదాపు 26 సంవత్సరాలుగా ఇలానే ఉన్నాయి.