– జిల్లాలో సాధారణ స్థాయి కంటే తక్కువగా వర్షపాతం నమోదు
– 36 మండలాలను మాత్రమే కరువు కింద ప్రకటించిన ప్రభుత్వం
– పనులు లేక వలసబాటన పల్లె జనం
– పొంచివున్న తాగునీటి కష్టాలు
– నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
కర్నూలు సిటీ: వానదేవుడు కన్నెర్ర జేయడంతో జిల్లాలో కరువు కోరలు చాస్తోంది. వరుణడు చినుకు రాల్చకపోవడంతో వేసిన విత్తనం దిగుబడిని ఇవ్వక.. చేద్దామంటే పనులు లేకపోవడంతో కడుపునింపుకోవడానికి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో తాగునీటి సమస్య కూడా పొంచివుంది. ఇప్పటికే పల్లె జనం సగం పట్నాలకు వలస వెళ్లారు. ఇలాంటి సమయంలో గురువారం జెడ్పీ సర్వసభ్య సమావేశం కానుంది. సభ దృష్టికి కొన్ని సమస్యలను తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం..
అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం
సాధారణ స్థాయి కంటే వర్షపాతం తక్కువగా నమోదు కావడంతో జిల్లా కరువు బారిన పడింది. తాగు, సాగు నీటికీ తీవ్ర ఇబ్బందులు పడాల్సిన దుస్థితి నెలకొంది. అధికారుల నిర్లక్ష్యం, అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అలసత్వం వల్ల 54 మండలాల్లో పంటలు పండకపోయినా 38 మండలాల్లో మాత్రమే కరువు నెలకొందని నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. వారు మరో రెండు మండలాలను తీసేసి 36 మండలాల్లోనే కరువు ఉందని ప్రకటించారు. ప్రకటించిన మండలాలకైనా పరిహారంఅందిచారా అంటే అదీలేదు. ఇక అధికార పార్టీ నేతలు ఏ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల తుంగభద్ర జలాల్లో జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగింది. గతేడాది దిగువ కాలువ కింద1.2 టీఎంసీలు, ఈ ఏడాది కేసీ, దిగువ కాలువ వాటాలో నుంచి 2 టీఎంసీల నీటిని కోల్పోయే ప్రమాదం ఉంది.
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్ అధ్యక్షత జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం ఽగురువారం నిర్వహించనున్నారు. సమావేశానికి డిప్యూటీ సీఎం కె.యి కృష్ణమూర్తి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఉదయం 10.30 గంటలకు జెడ్పీ ఆవరణంలో కొత్తగా నిర్మించిన జిల్లా వనరుల కేంద్రం ప్రారంభించనున్నారు.
తీవ్రం కానున్న తాగునీటి సమస్య
అధికారులకు ముందుచూపు లేకపోవడంతో తాగునీటి సమస్య రోజు రోజుకు ముదురుతోంది. జిల్లాలో 889 గ్రామ పంచాయతీలు, 1503 గ్రామాలు, 40.53 లక్షల జనాభా ఉంది. వీరి తాగునీటి అవసరాలు తీర్చేందుకు 56 సమగ్ర రక్షిత తాగు నీటి పథకాలు, 2835 ప్రజా తాగునీటి పథకాలు, 12239 చేతి పంపులు ఉన్నా పనిచేసేది మాత్రం 43 రక్షిత తాగు నీటి పథకాలు మాత్రమే. అయినా అధికారులు ముందు జాగ్రతచర్యలు తీసుకోవడంలో శ్రద్ధ కనబరచడంలేదనే విమర్శలున్నాయి.
36వేల ఎకరాల వరి పంట ప్రశ్నార్థకం
దిగువ కాలువ కింద ఉన్న 26 వేల ఎకరాలకు సాగు నీరు సక్రమంగా అందక చివరి దశలో ఉన్న పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. దీంతో పాటు కేసీ కాలువ కింద 0కి.మీ నుంచి 63 కి.మీ వరకు ఉన్న సుమారు 10 వేల ఎకరాల్లో వరి పంటలకు నీరు అందడం లేదు. ఇక శ్రీశైలంలో నీరు ఉన్నా కూడా ఎస్‌ఆర్‌బీసీ కాల్వ విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో పంటలకు నీరు అందక బనగానపల్లె నియోజకవర్గంలో శనగ పైరు ఎండిపోతోంది. పంటను కాపాడుకునేందుకు ట్యాంకర్ల ద్వారా నీటి తడులు పెట్టుకుంటున్నారు. హంద్రీనీవా కింద పందికోన రిజర్వాయర్ పరిధిలోని పంట కాల్వలు పూర్తి కాకపోవడంతో కళ్ల ముందే కాల్వలో నీరు పోతున్నా పొలాన్ని తడుపుకోలేని పరిస్థితి.
రైతుల ఖాతాకు చేరని ఇన్‌పుట్ సబ్సిడీ
ఏడాదికిపైగా ఇన్‌పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూశాక ఇటీవలే 2015 ఖరీఫ్ సీజన్‌లోని పంటలకు సంబంధించిన ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం మంజూరు చేసింది. 40 మండలాలకు చెందిన 3,18,167 మంది రైతులకు 2,23,659.79 హెక్టార్లలో రూ.277.57 కోట్లుల మంజూరు అయ్యాయి. అయినా రైతన్నల ఖాతాలకు చేరలేదు. ఇక 2014కు చెందిన ఇన్‌పుట్ సబ్సిడీ సంగతి అతీగతీ లేదు.