ఎఫ్ఎంసీజీల ‘వరుణ’ యాగం! | Even as Patanjali makes waves, FMCG stocks shine | Sakshi
Sakshi News home page

ఎఫ్ఎంసీజీల ‘వరుణ’ యాగం!

Published Thu, May 5 2016 2:04 AM | Last Updated on Tue, Oct 2 2018 8:16 PM

ఎఫ్ఎంసీజీల ‘వరుణ’ యాగం! - Sakshi

ఎఫ్ఎంసీజీల ‘వరుణ’ యాగం!

ఈ ఏడాది సాధారణ వర్షపాతం అంచనాలపై ఆశలు...
గ్రామీణ డిమాండ్‌తో అమ్మకాలు పెంచుకునే ప్రణాళికలు

 రెండేళ్లుగా సరిగ్గా వర్షాలు కురవక కొన్ని రాష్ట్రాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న తరుణంలో వరుణుడి కరుణ కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్న వైనం ఒకవైపు. కార్పొరేట్లు కూడా ఇప్పుడు వర్షాల కోసమే వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కరువు కారణంగా అమ్మకాలు తగ్గి.. తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్న ఎఫ్‌ఎఫ్‌సీజీ కంపెనీలు(సబ్బులు, పేస్టులు, బిస్కెట్లుతదితర వేగంగా అమ్ముడయ్యే వినియోగ ఉత్పత్తుల తయారీదార్లు) వర్షాలపై చాలా ఆశలు పెట్టుకున్నాయి.

ఈసారి సాధారణ వర్షపాతం(రుతుపవనాలు) నమోదవుతుందని భారీ అంచనాలు నెలకొన్న నేపథ్యంలో రెండేళ్లుగా నిద్రాణంగా ఉన్న గ్రామీణ డిమాండ్ తమ అమ్మకాల వృద్ధిని పెంచుతుందని భావిస్తున్నాయి. అంతా చెబుతున్నట్లు వరుణుడు గనుక కరుణిస్తే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో తమ అమ్మకాలు పుంజుకోవడం ఖాయమనేది మారికో, డాబర్, గోద్రెజ్ కన్సూమర్ వంటి ఎఫ్‌ఎఫ్‌సీజీ కంపెనీల అభిప్రాయం.

 అమ్మకాలపై కరువు కాటు...
వరుసగా రెండేళ్లు కరువు పరిస్థితుల కారణంగా గ్రామీణ భారతంలో ప్రజల కొనుగోలు  శక్తి పడిపోయి.. తమ గ్రామీణ అమ్మకాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడిందని గోద్రెజ్ కన్సూమర్ ప్రొడక్ట్స్(జీసీపీఎల్) బిజినెస్ హెడ్(భారత్, సార్క్ దేశాలు) సునీల్ కటారియా పేర్కొన్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు తీవ్ర కరువును ఎదుర్కొంటున్నాయి. కొన్నిచోట్ల గుక్కెడు నీటికి కూడా కటకటలాడుతున్న పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. గతేడాది వర్షాలు అరకొరగానే కురవడంతో తమ పల్లె ప్రాంతాల్లో వృద్ధి తీవ్రంగా మందగించిందని.. ఇది అక్కడ డిమాండ్‌ను కూడా పడిపోయేలా చేసిందని డాబర్ ఇండియా సీఎఫ్‌ఓ లలిత్ మాలిక్ చెప్పారు.

రెండేళ్లుగా వరుస కరువును ఎదుర్కొన్న కొన్ని రాష్ట్రాల్లో స్వల్పకాలానికి గ్రామీణ వినియోగం పెద్దగా పుంజుకొనే అవకాశం లేదని మారికో ఎండీ, సీఈఓ సౌగత గుప్తా వ్యాఖ్యానించారు. కరువుతో పాటు పంటలకు ధరలు కూడా తగ్గడంతో 2011-14 మధ్య మొత్తం గ్రామీణ డిమాండ్ తీవ్రంగా తగ్గిందని కటారియా చెబుతున్నారు. తమ మొత్తం అమ్మకాల్లో 30 శాతం వాటా గ్రామీణ మార్కెట్‌దే కావడంతో ఈ ఏడాది వర్షాలు సరిగ్గా కురుస్తాయన్న అంచనాలు నిజమవ్వాలని ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు కోరుకుంటున్నాయి. భారత వాతావరణ శాఖ ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసిన విషయం విదితమే.

 డిమాండ్ ఉంది, కానీ...
జూన్-సెప్టెంబర్ కాలంలో సాధారణ రుతుపవనాలు వస్తే గనుక.. ద్వితీయార్థంలో వినియోగదారుల సెంటిమెంట్ పుంజుకోవడంతోపాటు తమ అమ్మకాల్లో కూడా ఇది ప్రతిబింబిస్తుందని కటారియా అభిప్రాయపడ్డారు. మరోపక్క, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టడానికి ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో తీసుకున్న చర్యలు కూడా ఈ ఏడాది రానున్న రోజుల్లో ఎఫ్‌ఎంసీజీ అమ్మకాలను పెంచనుందని ఆయన పేర్కొన్నారు. ‘వాస్తవానికి గ్రామీణ భారతంలో డిమాండ్ నిద్రాణ స్థితిలో ఉంది. చేతిలో తగినంతగా సొమ్ము లేకపోవడంతో ప్రజలు తమ కొనుగోళ్లను వాయిదావేసుకుంటూ వస్తున్నారు. అయితే, కొనాలన్న ఆకాంక్ష మాత్రం పోలేదు.

అందుకే ఈ సారి వర్షాలు సరిగ్గా కురవడం చాలా కీలకం కానుంది. రుతుపవనాలు బాగుంటే డిమాండ్ ఒక్కసారిగా ఎగబాకి, అమ్మకాలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది’ అని కటారియా విశ్లేషించారు. ఈ అంచనాల నేపథ్యంలో గ్రామీణ భారత్‌లో తమ పంపిణీ పరిధిని కూడా భారీగా పెంచే పనిలో డాబర్ ఉంది. ప్రస్తుతం 14,000 గ్రామాలకు కంపెనీ పంపిణీ నెట్‌వర్క్ ఉండగా, దీన్ని 45,000 గ్రామాలకు చేర్చే ప్రక్రియ కొనసాగుతున్నట్లు డాబర్ సీఎఫ్‌ఓ మాలిక్ పేర్కొన్నారు. సవాళ్లు నెలకొన్నప్పటికీ, తాము కూడా వినూత్న ఉత్పత్తులతో గ్రామీణ మార్కెట్లో వాటా పెంచుకోవడంపై దృష్టిసారిస్తూనే ఉన్నామని కటారియా వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement