ఊరట కరువు
ఊరట కరువు
Published Tue, Sep 20 2016 12:12 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
ఆకాశంలో రబీ విత్తన ధర
– వర్షాభావంతో నష్టాల్లో అన్నదాత
– కిలో శనగ ధర రూ.98.66
– సబ్సిడీ 40 శాతమే..
– కిలోకు చెల్లించాల్సిన మొత్తం రూ.59.20
– మార్కెట్‌లో తక్కువ ధరకే లభ్యం
– 24 నుంచి విత్తన పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ పంట కళ్లెదుటే కరిగిపోయింది. కరువు కోరల్లో చిక్కుకున్న రైతు పట్ల ప్రభుత్వానికి కనీస సానుభూతి కరువైంది. సీజన్‌లో వర్షాభావం కారణంగా 2,66,428 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ యంత్రాంగమే అంచనా వేసింది. చాలా వరకు ఈ భూముల్లో రబీ పంటల సాగుకు అన్నదాత సిద్ధమవుతున్నాడు. తాజా పరిస్థితుల నేపథ్యంలో కరువు రైతుకు ఊరటనిచ్చేలా రబీ సీజన్‌కు అవసరమైన శనగ విత్తనాల ధర నిర్ణయించాల్సి ఉంది. అయితే వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేలా ధర నిర్ణయించడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదితో పోలిస్తే కిలో శనగ విత్తనాలపై ఏకంగా రూ.34.16 పెంచి రైతుల నడ్డి విరిచింది. గత ఏడాదితో పోలిస్తే ఈ అదనపు భారం రూ.15.88 కోట్లు. మార్కెట్ రేటును మించి ధర పెంచి.. కంటి తుడుపుగా 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. ధర లు ఖారారు కావడంతో విత్తనాలను కూడా వెంటనే పొజిషన్ చేస్తున్నట్లు జేడీఏ ఉమామహేశ్వరమ్మ విలేకరులకు తెలిపారు. ఈ నెల 24 నుంచి బయోమెట్రిక్ సిస్టమ్ ద్వారా విత్తనాలు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
శనగ ధరలు ఇలా..
రబీలో శనగ సాగు ప్రధానమైంది. జిల్లాలో ఈసారి 2 లక్షలకు పైగా హెక్టార్లలో సాగు చేసే అవకాశం ఉంది. ఈ సారి జిల్లాకు 98వేల క్వింటాళ్లు సబ్సిడీపై పంపిణీ చేసేందుకు అలాట్‌మెంట్ ఇచ్చింది. వీటిని అయిల్‌ఫెడ్, ఎపీ సీడ్స్, మార్క్‌ఫెడ్ సరఫరా చేస్తాయి. గత ఏడాది కిలో విత్తనం ధర రూ.64.50 ప్రకటించి.. రూ.21.50(33.33 శాతం) సబ్సిడీ ఇచ్చింది. ఈ లెక్కన రైతు కిలో విత్తనాలకు రూ.43 చెల్లించాలి. కమీషన్ మత్తులో పడిన ఉన్నతాధికారులు వ్యాపారులు సంక్షేమం లక్ష్యంగా ఈ సారి కిలో పూర్తి ధర రూ.98.66లుగా నిర్ణయించింది. మార్కెట్‌లో క్వింటా ధర రూ.8వేల వరకు ఉండగా.. ప్రభుత్వం క్వింటా ధర రూ.10వేలుగా ప్రకటించడం గమనార్హం. సబ్సిడీ కూడా 40 శాతం ప్రకటించడంతో.. రైతులు కిలోకు రూ.59.20 చెల్లించాల్సి వస్తోంది.
Advertisement