బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్
బాన్సువాడ టౌన్(బాన్సువాడ): రాష్ట్రంలో వేలాది మంది జీవితాలను నాశనం చేస్తోన్న డ్రగ్స్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అల్జాపూర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన బాన్సువాడలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. డ్రగ్స్ కేసులో అనేక కార్పొరేట్ కళాశాలల యాజమాన్యాలు కలిసి ఉన్నారనే ఆరోపణలు రాగా, వాటన్నిటిని ప్రభుత్వం పట్టించుకోకుండా, కేసును పక్కదారిన పడేవిధంగా చేస్తోందన్నారు.
సినిమా పరిశ్రమలోని ప్రముఖుల పేర్లు వెల్లడించాలని డిమాండ్ చేశారు. యువతను తప్పుదోవ పట్టిస్తున్న ఈ డ్రగ్స్ వ్యవహారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, దీన్ని అరికట్టడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. నయీం వద్ద లభించిన వందలాది కోట్ల రూపాయలను మాయం చేశారని, ఈ డబ్బులను వెంటనే కోర్టులో జమ చేయాలని డిమాండ్ చేశారు.
ఇసుక మాఫియాలో కేసీఆర్ కుటుంబం హస్తముందని, ప్రతీ ఒక్క క్వారీ నుంచి వీరికి డబ్బులు అందుతున్నాయని అన్నారు. సమావేశంలో నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి శివకుమార్, మండలాధ్యక్షుడు శంకర్‌గౌడ్, నాయకులు లక్ష్మీనారాయణ, సాయిలు, లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.