డీఎస్పీల బదిలీలు షురూ! | dsps transfers starts | Sakshi
Sakshi News home page

డీఎస్పీల బదిలీలు షురూ!

Published Fri, Jun 23 2017 10:31 PM | Last Updated on Fri, May 25 2018 5:52 PM

డీఎస్పీల బదిలీలు షురూ! - Sakshi

డీఎస్పీల బదిలీలు షురూ!

– కర్నూలుకు యుగంధర్‌ బాబు... 
– నంద్యాలకు రామకృష్ణ...
– ఆళ్లగడ్డకు గోపాలకృష్ణ... 
– ఆత్మకూరుకు రాఘవరెడ్డి పేర్లను సిఫారసు చేసిన ‘నేతలు’
 
కర్నూలు : పోలీసు శాఖలో సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారుల బదిలీలకు రంగం సిద్ధమయ్యింది. మూడు రోజుల క్రితం భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని విశాఖపట్నం మినహా మిగతా 12 జిల్లాలకు ప్రభుత్వం నూతన ఎస్పీలను నియమించింది. ఈ బదిలీల్లో భాగంగా కర్నూలు ఎస్పీ ఆకే రవికృష్ణకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. తదుపరి పోస్టింగుల నిమిత్తం డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేసుకోవాలని బదిలీ ఉత్తర్వులో పేర్కొనడంతో ఆయన గురువారం రాత్రి నూతన రాజధాని అమరావతి(విజయవాడ)కి తరలివెళ్లారు. విజయవాడ ట్రాఫిక్‌ లేదా ఒంగోలు పోలీసు శిక్షణా కేంద్రానికి ఆయనను నియమించే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. 
 
ఐదుగురు డీఎస్పీలకు స్థాన చలనం... 
జిల్లాలో ఆరు పోలీస్‌ సబ్‌ డివిజన్లు ఉన్నాయి. డోన్‌ మినహా మిగిలిన ఐదు సబ్‌ డివిజన్‌ పోలీసు అధికారులకు స్థాన చలనం కలిగే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. రెండేళ్లు సర్వీసు పూర్తయిన డీఎస్పీలు బదిలీకి అర్హులు. కర్నూలు డీఎస్పీగా రమణమూర్తి దాదాపు 30 నెలలకు పైగా పనిచేశారు. ఆయన స్థానంలో 1991 బ్యాచ్‌కు చెందిన యుగంధర్‌ బాబు పేరు ఖరారైనట్లు సమాచారం. ఈయన ప్రస్తుతం కర్నూలు సీఐడీ విభాగంలో పనిచేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌రెడ్డి..యుగంధర్‌ బాబు పేరును సిఫారసు చేసినట్లు చర్చ జరుగుతోంది. యుగంధర్‌ బాబు తండ్రి రంగయ్య నాయుడు పోలీసు శాఖలో డీఎస్పీ హోదాలో పదవీ విరమణ పొందారు. సీఐగా జిల్లాలో పనిచేసేటప్పుడు మాజీ మంత్రి ఎస్‌.వి.సుబ్బారెడ్డి కుటుంబంతో సన్నిహిత సంబంధం ఉండేది. ఈ నేపథ్యంలో ఆయనను కర్నూలు డీఎస్పీగా నియమించాలని ఎస్‌.వి.మోహన్‌రెడ్డి సిఫారసు చేసినట్లు చర్చ జరుగుతోంది.
 
ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తుండగా రమణమూర్తినే మరికొంత కాలం కొనసాగించాలనే నిర్ణయంలో కేఈ ఉన్నట్లు కూడా చర్చ జరుగుతోంది. నంద్యాల డీఎస్పీగా హరినాథ్‌ రెడ్డి రెండున్నరేళ్లకు పైగా పనిచేశారు. కాల పరిమితి పూర్తి కావడంతో ఆయన స్థానంలో విజయవాడ రైల్వే విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న రామకృష్ణను నియమించాలని రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్‌ సిఫారసు చేసినట్లు సమాచారం. ఈయన గతంలో కర్నూలు డీఎస్పీగా పనిచేశారు. టి.జి.వెంకటేష్‌ మంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్‌ నిబంధనలకు విరుద్ధంగా ఆయన ఇంటికి వెళ్లాడన్న కారణంపై అప్పట్లో రామకృష్ణపై బదిలీ వేటు పడింది. దీంతో టీజీ ఆశీస్సులు రామకృష్ణకు ఉన్నట్లు అధికారుల్లో చర్చ జరుగుతోంది.
 
ఆళ్లగడ్డ డీఎస్పీగా ఈశ్వర్‌రెడ్డి చేరి ఏడాదిన్నర కూడా కాలేదు. ఆయనకు ఇంకా ఆరు మాసాలు గడువు ఉన్నప్పటికీ పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఆయన స్థానంలో మరొకరిని నియమించాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. ఏపీఎస్పీ కర్నూలు రెండో పటాలంలో పనిచేస్తున్న 1989 బ్యాచ్‌కు చెందిన గోపాలకృష్ణను నియమించాలని అఖిలప్రియ ఆ శాఖ ఉన్నతాధికారులకు సూచించినట్లు సమాచారం. అలాగే ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ స్థానంలో 1989వ బ్యాచ్‌కు చెందిన రాఘవరెడ్డి పేరు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం. ఈయన గతంలో చిత్తూరు జిల్లాలో ఎక్కువ కాలం పనిచేశారు. ఎమ్మిగనూరు సీఐగా కూడా పనిచేశారు.
 
మదనపల్లి డీఎస్పీగా పనిచేస్తూ రెండేళ్ల క్రితం బదిలీపై కర్నూలు సీఐడీకి వచ్చారు. ఆదోని డీఎస్పీగా కొల్లి శ్రీనివాసులు నియమితులై ఏడాదిన్నర పూర్తయ్యింది. ఇంకా ఆయనకు సమయమున్నప్పటికీ స్థానిక తెలుగుదేశం నాయకులు ఆయన బదిలీకి పట్టుబట్టినట్లు సమాచారం. స్థానిక నాయకుడి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని డీఎస్పీగా నియమించుకునేందుకు ప్రభుత్వ స్థాయిలో తీవ్రంగా ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. ఆదోని సబ్‌ డివిజన్‌లో అధికార పార్టీ నాయకుని సామాజిక వర్గానికి చెందిన కొంతమంది సీఐలు ప్రస్తుత డీఎస్పీకి వ్యతిరేకంగా పోలీసు శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేసినట్లు చర్చ జరుగుతోంది. దీంతో స్థానిక నాయకుడు కూడా సీఐల సూచనల మేరకు తన సామాజిక వర్గానికి చెందిన  డీఎస్పీని నియమించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. 
 
విజిలెన్స్‌ విభాగానికి తీవ్ర పోటీ... 
కర్నూలు విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగంలో డీఎస్పీ పోస్టుకు తీవ్ర పోటీ నెలకొంది. రెండు నెలల క్రితం విల్సన్‌ బాబు పదవీ విరమణ పొందడంతో పోస్టు ఖాళీగా ఉంది. ఇందుకోసం గతంలో కర్నూలు ఏసీబీ డీఎస్పీగా పనిచేసిన మహబూబ్‌ బాషా, కర్నూలు పోలీస్‌ శిక్షణా కేంద్రంలో వైస్‌ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డీఎస్పీ రాజశేఖర్‌ రాజు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రమణమూర్తి బదిలీ తప్పనిసరి అయితే ఆయన కూడా విజిలెన్స్‌ విభాగానికి వచ్చే అవకాశమున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ కార్యాలయంలో ఎస్‌ఐ పోస్టు కూడా రెండు మాసాలుగా ఖాళీగా ఉంది. సుబ్బరాయుడు పదోన్నతిపై ఇంటెలిజెన్స్‌ విభాగానికి బదిలీ కావడంతో ఆయన స్థానంలో నంద్యాల మూడోవ పట్టణంలో ఎస్‌ఐగా పనిచేస్తున్న 2009 బ్యాచ్‌కు చెందిన జయన్నను నియమించినట్లు సమాచారం. నంద్యాల ఉప ఎన్నిక, వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డీఎస్పీల బదిలీ  ప్రక్రియ సాగవచ్చని ఆ శాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.
 
కర్నూలు రేంజ్‌ డీఐజీ రమణకుమార్‌ కూడా విధుల్లో చేరి రెండేళ్లు పూర్తయింది. మలి విడత చేపట్టనున్న ఐపీఎస్‌ బదిలీల్లో ఈయనకు కూడా స్థాన చలనం కలగనున్నట్లు సమాచారం. అయితే మరో రెండు మాసాల్లో ఆయనకు పదోన్నతి కల్పించాల్సి ఉన్నందున అప్పటివరకు కొనసాగించవచ్చునన్న చర్చ కూడా జరుగుతోంది. ప్రస్తుతం కర్నూలు ఓఎస్‌డీగా పనిచేస్తున్న రవిప్రకాష్‌ కూడా విశాఖపట్టణానికి బదిలీపై వెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన భార్య అక్కడ లెక్చరర్‌గా పనిచేస్తున్నందున స్పౌజ్‌ కేసు కింద తనను బదిలీ చేయాలని దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ప్రసుత్తం ఈయన సెలవులో ఉన్నారు. బదిలీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement