జంట హత్యల కేసు దర్యాప్తు ముమ్మరం
జంట హత్యల కేసు దర్యాప్తు ముమ్మరం
Published Fri, Mar 3 2017 11:47 PM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM
కీలకంగా మారిన సీసీ కెమెరా పుటేజీ
హత్యకు పాల్పడింది ఒక్కరే
కాకినాడ క్రైం (కాకినాడ సిటీ): కాకినాడ రామారావుపేటలో ఈ నెల 2 అర్ధరాత్రి జరిగిన జంట హత్యల కేసును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హత్య జరిగిన తీరుతెన్నులపై దళిత సంఘాలు పలు అనుమానాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్న తరుణంలో ప్రాధాన్యం సంతరించుకుంది. హత్యకేసును సత్వరంగా ఓ కొలిక్కి తీసుకు రావాలని జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాశ్ డీఎస్పీని ఆదేశించినట్టు తెలిసింది. హత్యకు పాల్పడ్డ కాకినాడ జగన్నాథపురానికి చెందిన నిందితుడు అడ్లబోయిన అశోక్‌కుమార్ పోలీసుల అదుపులోనే ఉండటంతో అతడిని విచారించే పనిలో ఉన్నారు. అతడు పని చేస్తున్న సుబ్బయ్య హాటల్ యాజమానికి ఫిర్యాదు చేస్తున్నాడనే కక్షతోనే బడుగు బాల గంగాధరతిలక్ (బాలా)ను అతడికి వత్తాసు పలుకుతున్న జగడం రామస్వామిలను పథకం ప్రకారం కేటరింగ్ వ్యాన్ డ్రైవర్ అశోక్‌కుమార్ ఒక్కడే హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. హత్య జరిగిన రామారావుపేటలో సంఘటన ప్రదేశం సమీపాన ఉన్న సుబ్బయ్య హోటల్, అపోలో ఫార్మసీ దుకాణాలకు ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి, వాటి పుటేసీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు పుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకు ఒక పుటేజీలో కీలక సమాచారం లభించినట్టు తెలిసింది. జంట హత్యలకు పాల్పడింది అశోక్‌కుమార్ ఒక్కడేననే నిర్ధారణకు వచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది. హత్యకు పాల్పడిన అశోక్‌కుమార్, ప్రేరేపించిన హోటల్ యాజమాన్యం వైఖరిపై జిల్లాలోని దళిత సంఘాలు పలు అనుమానాలు, ఆరోపణలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన సుబ్బయ్య హోటల్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు.ఈ కేసు విషయమై కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ ఉమర్ తెలిపారు.
ఇంకా మార్చురీ వద్దే మృతదేహాలు
హత్యకు గురైన బడుగు బాలగంగాధరతిలక్ (బాలా), జగడం రామస్వామిలకు గురువారం కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు రోజులవుతున్నా, మృతదేహాలను అక్కడ నుంచి తీసుకెళ్లేందుకు బాధిత కుటుంబ సభ్యులు, దళిత సంఘాలు నిరాకరించడంతో ఆందోళన నెలకొంది. బాధితులకు న్యాయం చేయాలని, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, హోటల్ యాజమాన్యాన్ని అరెస్ట్ చేయాలని, నష్టపరిహారంగా ఒక్కొక్కరికి రూ. 25 లక్షలు ఇవ్వాలని, లేకుంటే మృతదేహాలను తీసుకెళ్లే ప్రశక్తేలేదని భీష్మించడంతో పరిస్థితి ఉత్కంఠగా మారింది. విచారణలో దోషులుగా తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని మృతదేహాలను తీసుకెళ్లాలని పోలీసులు కోరుతున్నా బాధితులు నిరాకరించారు. వీరికి దళిత సంఘాలు సంఘీభావం తెలపడంతో సమస్య మరింత జఠిలంగా మారింది. మార్చురీ వద్ద పరిస్థితిని కాకినాడ డీఎస్పీ ఎస్.వెంకటేశ్వరరావు, టూటౌన్, త్రీ, వన్‌టౌన్ సీఐలు ఉమర్, దుర్గారావు, ఏఎస్ రావు సమీక్షిస్తున్నారు.
Advertisement
Advertisement