టీడీపీని వీడితే మైనార్టీలపై కేసులా?
–మంత్రి పల్లెకు మేకప్‌పై ఉన్న శ్రద్ధ ప్రజల సమస్యలపై లేదు
–వైఎస్సార్‌సీపీ పుట్టపర్తి సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి
కొత్తచెరువు : టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరిన ముస్లిం మైనార్టీలపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయించడం అన్యాయమని వైఎస్సార్ సీపీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి నివాసంలో ఆయన విలేకరులతో మాట్లడారు.
మంత్రి పల్లెకు మేకప్‌పై ఉన్న శ్రద్ధ నియోజకవర్గ ప్రజలపై లేదని మండిపడ్డారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, రెండున్నర సంవత్సరం మంత్రిగా ఉన్న పల్లె మైనార్టీలకు చేసింది ఏమీలేదని, దీన్ని గుర్తించి దొన్నికోటకు చెందిన ముతవల్లి మహమ్మద్ రసూల్, మరో 50 కుటుంబాలు పార్టీలో చేరితే వారిపై అక్రమ కేసులు, పోలీసులతో వేధింపులు దిగిడం మంత్రి పల్లె నీచ రాజకీయాలకు నిదర్శనమన్నారు. ఇలాంటి వాటికి భయపడేది లేదని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, మండల కన్వీనర్ నారేపల్లి జగన్‌మోహన్‌రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు రెడ్డప్పరెడ్డి, లోచర్ల రాజారెడ్డి, సర్పంచ్ సంజీవరెడ్డి, నాయకులు వలీ, రసూల్, రామసుబ్బరెడ్డి, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.