పల్లె... నిజాయితీ నిరూపించుకో
నల్లమాడ : గ్యాంగ్‌స్టర్ మధుతో మంత్రి పల్లె రఘునాథరెడ్డి దోస్తీ వాస్తవమేనని, మంత్రి మాటలే ఈ విషయాన్ని రుజువు చేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. నల్లసింగయ్యగారిపల్లిలోని ఇంట్లో శుక్రవారం ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలసి విలేకరులతో మాట్లాడారు. బుక్కపట్నం మండలం యర్లంపల్లికి చెందిన గ్యాంగ్‌స్టర్ మధుతో పరిచయాలు ఉన్నాయని, 2014 ఎన్నికల్లో తన విజయానికి మధు సహకరించాడని, తాను బెంగుళూరుకు వెళ్లినప్పుడు ఫోన్ చేస్తుంటాడని మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెల్లడించడం వారిరువురిసంబంధాలను తేటతెల్లం చేస్తున్నాయన్నారు.
బెంగళూరు స్థావరంగా గ్యాంగ్‌స్టర్ మధు కొన్నేళ్లుగా సాగిస్తున్న దందాలు, సెటిల్‌మెంట్లలో పల్లె ర ఘునాథరెడ్డి సూత్రధారి అనే విషయం స్పష్టంగా అవగతమవుతోందన్నారు. మధును అడ్డం పెట్టుకొనే పల్లె జిల్లాలో రూ.వేల కోట్లు విలువ చేసే భూములను కారుచౌకగా కొట్టేసినట్లు బలమైన ఆరోపణలు ఉన్నాయన్నారు. ఈ విషయంపై విచారణకు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేయాలంటూ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వయంగా కోరి, నిజాయితీ నిరూపించుకోవాలని శ్రీధర్‌రెడ్డి సూచించారు. లేనిపక్షంలో గ్యాంగ్‌స్టర్ మధుతో మంత్రి పల్లె సంబంధాలపై విచారణ చేయించాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో రిట్ దాఖలు చేస్తామన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి డీఎస్ కేశవరెడ్డి, సంయుక్త కార్యదర్శి లోచర్ల విజయభాస్కర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి దుద్దుకుంట సుధాకర్‌రెడ్డి, పార్టీ నేతలు సుధాకర్‌రెడ్డి, చెన్నకృష్ణారెడ్డి, వెంకటప్పనాయుడు, ఎంపీపీ ఉంట్ల బ్రహ్మానందరెడ్డి, శ్రీనివాసులయాదవ్, విజయమ్మ, సుకన్యా శ్రీనివాసరెడ్డి, కోఆప్షన్ సభ్యులు మాబూఖాన్, కుళ్లాయిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.