మండుతున్న ఎండలు.. ఊరూరా జ్వరాలు
కొవ్వూరు : జిల్లాలో మూడు రోజులుగా ఎండలు ప్రతాపం చూపిస్తున్నాయి. సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికితోడు ఉక్కపోత పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. మరో మూడు, నాలుగు రోజులపాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
జిల్లాలో గడచిన 15 రోజులుగా 32 నుంచి 33 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా, ఇటీవల క్రమంగా పెరుగుతున్నాయి. జిల్లాలో సగటు ఉష్ణోగ్రతలు గురువారం 37 డిగ్రీలు నమోదు కాగా, శుక్రవారం 38 డిగ్రీలకు చేరింది. శుక్రవారం ఏలూరు నగరంలో 40 డిగ్రీలు దాటింది. నరసాపురంలో మూడు రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీలుగా నమోదవుతోంది.
విజృంభిస్తున్న జ్వరాలు
వాతావరణంలో మార్పుల కారణంగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రులతోపాటు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోనూ రోజుకు సగటున 2,200 జ్వరపీడిత కేసులు నమోదవుతున్నాయి. ఇందులో 400 వరకు టైఫాయిడ్ కేసులు ఉంటున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకునే వారితో కలుపుకుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం రోజుకు సగటున 100 టైఫాయిడ్, 2 వేలకు పైగా వైరల్ జ్వరాల కేసులు నమోదవుతున్నాయని డీసీహెచ్‌ఎస్ కె.శంకర్రావు తెలిపారు.
అప్రమత్తంగా ఉన్నాం
ప్రస్తుతం జ్వరాలు విజృంభించే అవకాశం ఉన్నదృష్ట్యా వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశాం. ఏదైనా గ్రామంలో ఐదారు జ్వరం కేసులు నమోదైతే వెంటనే సర్వే చేయిస్తున్నాం. రక్త నమూనాలు సేకరిస్తున్నాం. ఎక్కడైనా జ్వరాలు అధికంగా ఉంటే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలో నెలకు 6, 7 మలేరియా కేసులు నమోదవుతున్నాయి.
-కె.కోటీశ్వరి, డీఎంహెచ్‌వో