కూర కోసం వేస్తే నారే మిగిలింది
-
భయ పెట్టిన కల్తీ ఆర్పీ బయో వరి వంగడం
-
తాజాగా గోంగూరకూ కల్తీ దెబ్బ
-
విత్తనాల కల్తీతో తారుమారైన పంట
-
గోంగూర విత్తన ధర రూ.100, నార గోంగూర విత్తన ధర రూ.30
-
తక్కువ ధర విత్తనం అంటగట్టిన వైనంl
-
నష్టాల్లో రైతులు
సాక్షి, రాజమహేంద్రవరం/మధురపూడి :
విత్తనాల కల్తీ జాడ్యం అన్ని పంటలకూ విస్తరిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసిన ఆర్పీ బయో 226 వరి వంగడం వేసిన జిల్లా రైతులు నిండా నష్టాల్లో మునిగిపోయిన విషయం మరవకముందే తాజాగా ఆకుకూరల సాగు చేస్తున్న రైతులను నకిలీ చీడ భయపెడుతోంది. జిల్లాలో రాజమహేంద్రవరం, పెద్దాపురం, రంపచోడవరం, అమలాపురం, కాకినాడ, రామచంద్రపురం రెవెన్యూ డివిజన్లలోని గ్రామాల్లో వందల ఎకరాల్లో గోంగూర సాగు చేస్తున్నారు. నకి లీ విత్తనాల వల్ల పంటలో నాణ్యమైన గోంగూర బదులు కొండ గోంగూర మొలిచింది. ఇది నారకు తప్ప తినడానికి పనికి రాదు. దీంతో రైతులు నష్టాలపాలవుతున్నారు.
గోంగూరకూ కల్తీ కాటు :
ఆకు కూరగా ఉపయోగించే గోంగూర విత్తనాలు మార్కెట్లో కిలో రూ.100కు లభిస్తున్నాయి. అదే నార ఉత్పత్తి చేసే కొండ గోంగూర విత్తనాలు రూ.30 దొరుకుతున్నాయి. రెండూ ఒకే రకంగా ఉండడంతో రైతులను సులభంగా బురిడీ కొట్టించారు. ఈ విత్తనాలను కోరుకొండ మండలం నిడిగట్ల, గుమ్ములూరు, శ్రీరంగపట్నం, బుచ్చెంపేట, దోసకాయలపల్లి, మధురపూడి రైతులు ఎక్కువగా ఉపయోగించారు. పంట ఎదిగిన తర్వాత విత్తనాల్లో కల్తీ జరిగిందని గుర్తించారు. సాధారణ గోంగూర ఆకు సైజు చిన్నదిగా ఉంటుంది. కొండ గోంగూర ఆకులు పెద్దవిగా ఉంటాయి. పంట ఎదిగిన తర్వాతే ఈ విషయం బయటపడడంతో రైతులు లబోదిబోమంటున్నారు.
ప్రభుత్వం ఆదుకోవాలి
కల్తీ విత్తనాలతో చాలా నష్టపోతున్నాం. పెట్టుబడులు కూడా రావడం లేదు. మార్కెట్లో కల్తీ విత్తనాలను ప్రభుత్వం అరికట్టాలి. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చేటట్లు చూడాలి.
– కొత్తపల్లి వెంకట్రావు,
గోంగూర రైతు, నిడిగట్ల గ్రామం
రైతులకు బీమా కల్పించాలి
గోంగూర పంటకు బీమాను కల్పించాలి. తుఫాను, వర్షాలతో పంట దెబ్బతింది. పెట్టిన పెట్టుబడి కూడా రావడం లేదు. మరోవైపు కల్తీ విత్తనాల బెడదతో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం.
– దోసపాటి కాశీవిశ్వనా«ద్,
గోంగూర రైతు, మధురపూడి