‘బయో’త్పాతం
-
రైతులను నిండాముంచిన ఆర్పీ బయో –226 నకిలీ విత్తనం
-
ఆలస్యంగా విచారణ చేపట్టిన అధికారులు
-
వందలాది ఎకరాల్లో దెబ్బతిన్న వరి పంట
పెద్దాపురం :
రైతన్నకు బాసటగా నిలుస్తామన్న ప్రభుత్వం నట్టేట ముంచింది. ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చిన ఆర్పీ బయో–226 వరి విత్తనమే వారి పాలిట శాపమైంది. రూ.లక్షలు ఖర్చు చేసి సాగు చేస్తున్న పంట ఎదుగుదల లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నా పట్టించుకోని ప్రభుత్వ, అధికార యంత్రాంగంపై పెద్దాపురం మండలం గోరింట రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్దాపురం మండల పరిధిలో సుమారు 8 వేల హెక్టార్లలో వరి పండిస్తున్నారు. గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన ఇదే రకం వరి వంగడం వల్ల మండలంలోని జె.తిమ్మాపురం, వడ్లమూరు, చినబ్రహ్మదేవం గ్రామాలో వందల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినా అధికారులు ఆలస్యంగా స్పందించారు. మళ్లీ అదే పరిస్థితి గోరింటలో ఆలస్యంగా వెలుగుచూసింది. అధికార యంత్రాంగం గోరింట పొలాలను పరిశీలించి రైతులు విత్తనాన్ని కొనుగోలు చేసిన దివిలి లక్ష్మి ఏజెన్సీస్ నుంచి స్టాక్ వివరాలు, విత్తన సరఫరాపై ఆరా తీశారు. ప్రధానంగా ఆర్పీ బయో 226 విత్తనంలో కేళీ సమస్య ఏర్పడడంతో ఎకరాకు రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది.ఈ విత్తనాన్ని మండలంలో సుమారు 220 ఎకరాల్లో సాగు చేయడంతో సుమారు 150 మంది రైతులు నష్ట పోతున్నారు.
ఏజెన్సీ, దళారుల చేతిలో అమాయక రైతులు
ప్రభుత్వం సబ్సిడీపై సరఫరా చేసిన విత్తనం ఎరువుల ఏజెన్సీలు, దళారులకు వరంలా మారింది. చాలా ఏజెన్సీలు రైతుల పేరిట సబ్సిడీపై విత్తనాన్ని కొనుగోలు చేసి ఒక్కో బస్తా రూ.1050కు విక్రయించి లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదే సమస్యపై గతంలో రైతులు డీలర్లు, అధికారులను నిలదీస్తే సెటిల్‌మెంట్‌లతో తప్పించుకున్న వైనాలున్నాయి. కానీ దివిలి లక్ష్మి ఏజెన్సీస్ డీలర్ పోలారావుపై శుక్రవారం రైతుమండిపడ్డారు. డీలర్ అధికారుల దృష్టికి తీసుకువెళితే ఈ విత్తనాన్ని విక్రయించవవద్దని చెప్పినా విక్రయించడంపై అధికారులు నిలదీశారు. అధికారులు రైతులతో మాట్లాడారు. జరిగిన దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిహారం చెల్లించేలా చర్యలు తీసుకుంటామనడంతో రైతులు ఆందోళన విరమించారు.