దసరా నుంచే పాలన
-
అవసరం మేరకు సంక్షేమ కార్యాలయాలు
-
అధికారులతో సీఎస్ రాజీవ్‌శర్మ
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్ : నూతన జిల్లాలతోపాటు కొత్తగా ఏర్పడే రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా దసరా నుంచే పనులు ప్రారంభించేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. అవసరాన్ని బట్టి సంక్షేమ శాఖల డివిజన్ కార్యాలయాలనూ ఏర్పాటు చేయాలన్నారు. శుక్రవారం ఆయన హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నూతన డివిజన్ కేంద్రాల్లో ఆర్డీవో, సబ్ డివిజనల్ పోలీస్ అధికారి, సబ్ ట్రెజరీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని కార్యాలయాలకు అధికారులను నియమించి దసరా రోజు ప్రారంభం కావాడానికి సిద్ధం చేయాలన్నారు.
కొత్తగా ఏర్పాటయ్యే ప్రతి మండలంలో మండల రెవెన్యూ అధికారి, ఓఎస్‌డీ, అభివృద్ధి అధికారులు, మండల విద్యాధికారి, వ్యవసాయ అధికారి, సబ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కార్యాలయాలను ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని సూచించారు. నూతనంగా ఏర్పాటుకు ప్రతిపాదించిన మండలాల విస్తీర్ణం, జనాభా, ఆ ప్రాంతం, ప్రత్యేక లక్షణాలను ప్రభుత్వానికి తెలపాలన్నారు. అనంతరం కలెక్టర్ ఎం.జగన్మోహన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతన జిల్లాలోని, డివిజన్లు, మండలాలలో కార్యాలయాల ఏర్పాటుతోపాటు అధికారులు, సిబ్బందిని నియమిస్తామని తెలిపారు.
జిల్లాలో నూతన మండలాల ప్రతిపాదనలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో సంజీవరెడ్డి, సీపీవో కేశవరావు, డీఎంహెచ్‌వో జలపతినాయక్, కలెక్టరేట్ ఏవో అరవింద్ కుమార్, పర్యవేక్షకులు సుశీల, సంజయ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు.