‘చెత్త’ నిర్ణయం
-
స్టోర్‌రూంలో పుష్‌కాట్స్, డస్ట్‌బిన్స్
-
వాడకుండానే మూలకు..
-
రూ.35 లక్షలు వృథా
-
నాలుగు నెలలకే చిలుముపట్టిన కొత్త రిక్షాలు
-
రామగుండం బల్దియాలో ప్రజాధనం దుర్వినియోగం
కోల్‌సిటీ : రామగుండం నగరపాలక సంస్థలో ప్రజాధనం వృథా చేస్తున్నారు. పాలకులు, అధికారులు అనాలోచిత నిర్ణయంతో ఏకంగా బల్దియాకు రూ.35లక్షల నష్టం కలిగింది. చెత్త సేకరించడానికి ఉపయోగపడే తోపుడు బండ్లు కొనుగోలు చేసి మూడేళ్లు గడిచినా వాడకుండా మూలన పడేశారు. మళ్లీ నాలుగు నెలల క్రితం ట్రైసైకిళ్లు కొన్నా వాటిది అదే పరిస్థితి. ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ తుప్పుబట్టిపోతున్నాయి. వాటిని వాడకుండానే మళ్లీ కొత్తగా కొనేందుకు పాలకవర్గం నిర్ణయం తీసుకుంది. కనీసం వాటిని వినియోగించేందుకు కార్మికులను తీసుకోకపోవడం విమర్శలకు దారితీసింది. పాలకులు, అధికారులు తీసుకునే చెత్త నిర్ణయాలతో బల్దియా పేరు అభాసుపాలువుతున్నారు.
మూడున్నరేళ్ల క్రితం 12వ ఆర్థిక సంఘానికి చెందిన రూ.25 లక్షల నిధులతో 90 పుష్‌కాట్(చెత్తను సేకరించడానికి ఉపయోగపడే తోపుడు బండ్లు),1,250 డస్ట్‌బీన్స్‌ను టెండర్ల ద్వారా అధికారులు కొనుగోలుచేశారు. సంవత్సరాల తరబడి ఒక్క పుష్‌కాట్స్ బండిని కూడా ఉపయోగించకుండానే గదుల్లో మూలకు పడేశారు. వీటి కొనుగోలుపై అభ్యంతరాలు వ్యక్తంచేస్తూ గతంలో కొందరు మాజీ కౌన్సిలర్లు విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, స్పెషల్ ఆఫీసర్‌కు ఫిర్యాదుచేశారు. అయినా స్పందన లేదు. ఇప్పటికే చాలావరకు పుష్‌కాట్స్, ప్లాస్టిక్ డబ్బాలు మాయమయ్యాయని ఆరోపణలున్నాయి. పుష్‌కాట్స్, డస్ట్‌బీన్స్ ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుండానే... ప్రస్తుత పాలకర్గం 12వ ఆర్థిక సంఘానికి చెందిన మరో రూ.10 లక్షల నిధులతో నాలుగునెలల క్రితం 56 ట్రైసైకిళ్లను కొనుగోలు చేసింది. మరో వంద ట్రైసైకిళ్లు, ఇంటింటికీ రంగు డబ్బాలు కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కొత్త ట్రైసైకిళ్లలో నాణ్యతెంత?
రూ.10 లక్షలతో కొనుగోలు చేసిన 56 ట్రైసైకిళ్లను అధికారులు నిర్లక్ష్యంగా చెట్ల కిందపడేశారు. ఎండకు ఎండుతూ... వానలకు తడుస్తూ ప్రస్తుతం రిక్షాలన్నీ తుప్పుబట్టి పాడవుతున్నాయి. నాసిరకం విడిభాగాలతో ట్రైసైకిళ్లను తయారుచేశారని ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా పారిశుధ్యం మెరుగుకు ఉపయోగంలేకుండానే రూ.35 లక్షల ప్రజాధనం వృథా అయింది. అయితే ఈ ఆరోపణలపై మాత్రం పాలకవర్గం నోరు మొదపడంలేదు.
కొలిక్కిరాని రిక్షా కార్మికుల ఎంపిక
ఇంటింటా చెత్త సేకరించి రీసైక్లింగ్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రస్తుత పాలకవర్గం 12వ ఆర్థిక సంవత్సరం మిగులు నిధులు రూ.10 లక్షలతో 56 ట్రైసైకిళ్లను కొనుగోలు చేసింది. ఒక్కో రిక్షాపై ఇద్దరు కార్మికులను పనిలోకి తీసుకుంటామని చెప్పి ఇటీవల రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చారు. అయినా ఎవరూ ముందుకు రాలేదు. గతంలో పనిచేసిన ర్యాగ్‌పిక్కర్ల(రిక్షా కార్మికులు)ను పనిలోకి తీసుకోవాలని, వారిని పారిశుధ్య కార్మికులుగా గుర్తించి కార్పొరేషన్ తరఫున వేతనాలు ఇవ్వాలని చాలాకాలంగా కార్మిక సంఘాల నాయకులు, ర్యాగ్‌పిక్కర్లు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై కొలిక్కి రాలేదు.
వినియోగంలోకి తెస్తాం..
–డి.జాన్‌శ్యాంసన్, కమిషనర్
ఇంటింటా చెత్త సేకరించడానికి 56 ట్రైసైకిళ్లు కొనుగోలు చేశాం. వీటిపై కార్మికులను తీసుకునేందుకు రెండుసార్లు నోటిఫికేషన్ ఇచ్చాం. ఎవరూ ముందుకు రావడంలేదు. మున్సిపల్ కార్పొరేషనే జీతాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇది సాధ్యంకాదు. మరోసారి నోటిఫికేషన్ ఇస్తాం. రాకుంటే మేమే 50 డివిజన్లలో ఉన్న కార్మికులతో అవసరమున్నచోట ట్రైసైకిళ్లతోపాటు పుష్‌కాట్స్ ఏర్పాటుచేస్తాం.
20 రోజుల్లో డివిజన్లలోకి రిక్షాలు
– కొంకటి లక్ష్మీనారాయణ, రామగుండం నగర మేయర్
రిక్షాలపైన పనిచేయడానికి నోటిఫికేషన్ పిలిస్తే కార్మికులు ముందుకురాలేదు. ట్రైసైకిళ్ల వినియోగంపై దృష్టి సారించాం. 20 రోజుల్లో రిక్షాలను వినియోగంలోకి తీసుకువస్తాం. అవసరమైతే పుష్‌కాట్స్ కూడా పారిశుధ్యం కోసం వినియోగిస్తాం.