'తమ్ముళ్ల'కు డ్వాక్రా మహిళల ఝలక్
యలమంచిలి: విశాఖపట్నం జిల్లాలో తెలుగు తమ్ముళ్లకు డ్వాక్రా మహిళలు భారీ ఝలక్ ఇచ్చారు. ఈ నెల 10 వ తేదీన టీడీపీ తలపెట్టిన జనచైతన్య యాత్ర గురించి ప్రచారం చేయడానికి యలమంచిలి మండలం కట్టుపాలెం గ్రామంలో తెలుగుదేశం నాయకులు కరపత్రాలతో ప్రజల్లోకి వెళ్లారు. దీంతో డ్వాక్రా మహిళలు ఎన్నికల హామీలను నెరవేర్చడం లేదని వారిని నిలదీశారు.
అంతేకాకుండా కరపత్రాల్లో తాము చేయని పనులను కూడా చేసినట్లుగా ప్రచారం నిర్వహించడంతో డ్వాక్రా మహిళలు వారిపై కోపోద్రిక్తులయ్యారు. ఎన్నికలకు ముందు పూర్తిగా రుణమాఫీ చేస్తామన్నారని అయితే ఇప్పటికీ గ్రామంలో డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ కాలేదని..మహిళలు తమ రుణాలను మాఫీ చేయాలని నిలదీయడంతో ఏం చేయాలో తోచక తెలుగు తమ్ముళ్లు బిక్కమొహం వేశారు. ఊర్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని, దోమలు ఎక్కువగా ఉన్నాయని ఏవీ సరిగా లేకపోయినా అన్నీ చేసినట్లు ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలను స్థానికులు నిలదీశారు. దీంతో తెలుగు తమ్ముళ్లు సందిగ్థంలో పడ్డారు.