ఈ..ఫార్స్!
- ఈ-పాప్ విధానంలో లోపాలు
- కొనసాగుతున్న అక్రమాలు
- పక్కదారి పడుతున్న సరుకులు
- పేదలకు అందని రేషన్
- కొందరు డీలర్ల చేతివాటం
- అరికట్టలేకపోతున్న ప్రభుత్వం
జిల్లాలో రేషన్ కార్డులు: 10.76 లక్షలు
జనవరి నెలలో కొత్తగా వచ్చినవి : 87 వేలు
డిసెంబర్, జనవరి నెలల్లో రేషన్ పంపిణీ : 90 శాతం
గతంలో 80 శాతం ప్రజాపంపిణీ ఉండేది
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజా పంపిణీలో అక్రమాలను అరికట్టేందుకు ప్రవేశపెట్టిన ఈ- పాస్ విధానం అపహాస్యమవుతోంది. పేదలందరికీ రేషన్ అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త విధానం కొందరు డీలర్లకు కాసుల పంట పండిస్తోంది. జిల్లాలో అక్రమాలకు పాల్పడుతూ 149 మంది డీలర్లు సస్పెండ్ అయ్యారంటే కుంభకోణం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత మంది డీలర్లు సస్పెండ్ అయినా ఈ-పాస్ తీరులో మార్పు రాలేదు. ఇప్పటికీ అక్రమాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సెప్టెంబరు, అక్టోబరు నెలలతో పోలిస్తే డిసెంబరు, జనవరి నెలల్లో 3000 కార్డులకు పైగా ఎక్కువగా సరుకులు పంపిణీ కావడం విమర్శలకు తావిచ్చింది.
ఈ–పాస్ మిషన్‌లను బైపాస్ చేసి రేషన్ సరుకులను కొల్లగొట్టిన వ్యవహారం అక్టోబర్ నెలలో వెలుగు చూసింది. ఇప్పటికీ ఈ వ్యవహారం నడుస్తోంది. అదెలాగంటే.. రెండేళ్ల క్రితం ఆధార్ నంబర్లతో రేషన్ కార్డులను అనుసంధానం చేశారు. ఈ బాధ్యతను పౌరసరఫరాల శాఖ అధికారులు డీలర్లకు అప్పగించారు. డీలర్లు ఈ కార్యక్రమంలో అడ్డుగోలుగా వ్యవహరించారు. ఆధార్ కార్డు దొరికితే చాలు తమ దగ్గర ఉన్న కార్డులకు లింకప్ చేసుకున్నారు. ఆధార్ కార్డు నంబర్ల కోసం జిరాక్స్ సెంటర్ల నిర్వాహకులతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇటీవల కొత్త ఎత్తుగడలు వేశారు.
ఎన్‌ఐసీ ప్రధాన సర్వర్ నుంచే అధార్ లింకప్‌ను తమ వద్ద ఉన్న రేషన్ కార్డులతో లింకప్ చేసుకున్నారు. ఆన్‌లైన్‌లో వివరాలు చూసుకున్న కొందరు ప్రజలు.. తమ రేషన్ కార్డుకు వేరొకరి ఆధార్ కార్డు లింకప్ కావడంతో తప్పులను సరిచేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రేషన్ అందకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి ఫిర్యాదులు ప్రస్తుతం డీఎస్‌ఓ, ఎఎస్‌ఓ, తహసీల్దారు కార్యాలయాల్లో వేలాదిగా ఉన్నాయి.
కర్నూలులో వారిదే హవా..
ఈ పాస్ కుంభకోణంలో ఇటీవల కర్నూలులో నూరు మంది డీలర్ల సస్పెండ్ అయ్యారు. వారి స్థానంలో ఇన్‌చార్జీలను నియమించారు. అయితే చాల వరకు సస్పెండ్ అయిన డీలర్లే సరుకులు పంపిణీ చేస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి.
అక్రమాలు ఇవీ..
-
కర్నూలుకు చెందిన కళావతికి వైఏపీ 1382065ఎ0141 నంబరు రేషన్ కార్డు ఉంది. ఆధార్ నెంబరు 534513319754. ఆరు నెలల క్రితం వరకు ఎలాంటి సమస్య లేదు. ఇపుడు అనంతపురం జిల్లా గుంతకల్‌కు చెందిన డబ్ల్యూఏపీ 1286026ఎ0199 రేషన్ కార్డుకు కళావతి ఆధార్ నెంబరు లింకప్ అయింది.
-
పత్తికొండ ప్రాంతానికి చెందిన కురువ హనుమన్న రేషన్ కార్డు నెంబరు డబ్ల్యూఏపీ 135103600049. ఆధార్ నెంబరు 852236000236. ఇటీవలి వరకు ఇక్కడే కార్డు ఉంది. కాని ఉన్నట్టుండి విశాఖపట్టణం జిల్లాకు చెందిన కార్డుకు ఈ ఆధార్ కార్డు అనుసంధానం అయింది.
-
బోయ అనంతయ్యకు పత్తికొండలో రేషన్ కార్డు ఉంది. కార్డు నంబరు డబ్ల్యూఏపీ 135102200162. ఆధార్ నంబరు 296480428799. ఇపుడు ఈ ఆధార్ కార్డు నెల్లూరు జిల్లాకు రేషన్ కార్డుకు అనుసంధానం అయింది.