ఈఈలే జిల్లా అధికారులు
-
భూపాలపల్లికి ములుగు పీఆర్, ఐబీ, ఆర్‌అండ్‌బీ డివిజన్లు
-
వరంగల్‌కు ఏటూరునాగారం స్పెషల్ ఎంఐ డివిజన్
వరంగల్ : నూతన జిల్లాల ఇంజనీరింగ్ శాఖలకు ఆయా విభాగాల ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్(ఈఈ)లే జిల్లా స్థాయి అధికారులుగా వ్యవహరించనున్నారు. రహదారులు–భవనాలు, (ఆర్‌అండ్‌బీ), పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా, మిషన్ భగీరథ డివిజన్ కార్యాలయాలు కొత్త జిల్లాల్లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. జిల్లా కేంద్రం లో పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఆర్‌డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ, నీటి పారుదల శాఖ ఎస్‌ఈ కార్యాలయాలు ఉన్నాయి. కొత్తగా ఎస్‌ఈ కార్యాలయాల ఏర్పాటు లేకపోవడంతో ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ అధికారులే జిల్లా ఉన్నతాధికారులు కానున్నారు.
పీఆర్ ఇంజనీరింగ్
జిల్లాలో మహబూబాబాద్, ములుగు, వరంగల్ పీఆర్‌ఐ డివిజన్లతోపాటు వరంగల్‌లో మరో పీఐ యూ డివిజన్లు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ములుగు పీఆర్ డివిజన్ కార్యాలయాన్ని భూపాలపల్లికి తరలించనున్నారు. వరంగల్‌లో ఉన్న రెండు డివిజన్లు ఒక్కో జిల్లాలో పనులు పర్యవేక్షించనున్నాయి. కేంద్ర ప్రభుత్వ పథకాలు పర్యవేక్షించే పీఐయూ డివిజన్ జిల్లాల ఏర్పాటులో పీఆర్‌ఐగా మారనుంది. భవిష్యత్తులో ఎస్‌ఈ పరిధి కేంద్ర ప్రభు త్వ పథకాల పర్యవేక్షణకు మరో డివిజన్ ఏర్పడే అవకాశాలు ఉంటాయని అధికార వర్గాలు తెలిపాయి.
నీటి పారుదల శాఖ
జిల్లాలో చిన్ననీటి పారుదల విభాగంలో వరంగల్, మహబూబాబాద్, ములుగు, ఏటూరునాగారంలో స్పెషల్ ఎంఐ డివిజన్లు ఉన్నాయి. ఇప్పటికే మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు డివిజన్ కార్యాలయాలు ఉన్నాయి. ములుగు డివిజన్ కార్యాలయాన్ని భూపాలపల్లికి, ఏటూరునాగారం స్పెషల్ ఎంఐ డివిజన్ జిల్లా కేంద్రానికి తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేశా రు. గిరిజన ప్రాంతాల్లో పనుల పర్యవేక్షణకు ఏర్పడిన స్పెషల్ ఎంఐ డివిజన్ మాయం కానుంది. దీంతో నాలుగు జిల్లాల్లో అభివృద్ధి పనులను ఐటీడీఏ పర్యవేక్షించే పరిస్థితులు నెలకొన్నాయి.
గ్రామీణ నీటి సరఫరా విభాగం
జిల్లాలో గ్రామీణ నీటి సరఫరా విభాగం పరిధిలో వరంగల్, హన్మకొండ డివిజన్లు జిల్లా పరిషత్ కార్యాలయంలోనే విధులు నిర్వర్తిస్తున్నాయి. కొత్త జిల్లాల్లో రెండు కొత్త డివిజన్లను మహబూబాబాద్, భూపాలపల్లిలో ఏర్పాటు చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఆర్‌డబ్ల్యూఎస్ విభాగం పరిధిలో పనుల పర్యవేక్షణకు గాను ప్రతి నియోజకవర్గానికి ఒక్కొక్కటి చొప్పున 10 సబ్ డివిజన్లు ప్రస్తుతం ఉన్నాయి. వీటిని 7 సబ్ డివిజన్లకు కుదించనున్నారు. వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్, ములుగు, మంథని డివిజన్లు ఉండగా కొత్తగా హన్మకొండ, భూపాలపల్లి రెండు రెవెన్యూ డివిజన్‌లు ఏర్పాటయ్యాయి. ఈ ఏడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో ఒక్కో సబ్ డివిజన్‌ను ఏర్పాటు చేసి ఆర్‌డబ్ల్యూఎస్ పనులు పర్యవేక్షించేలా అధికారులు ప్రతిపాదించారు.
రహదారులు.. భవనాల శాఖ
రహదారులు–భవనాల శాఖలో వరంగల్, ములుగు, మహబూబాబాద్ ఇంజనీరింగ్ డివిజన్లు ఉన్నాయి. ఇందులో వరంగల్, మహబూబాబాద్ జిల్లాలో డివిజన్ కార్యాలయాలు ఉండగా ములుగు డివిజన్ కార్యాలయాన్ని భూపాలపల్లి జిల్లా కేంద్రానికి తరలించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న మరో జిల్లాపై స్పష్టత వస్తే రూరల్(కాకతీయ) జిల్లాలో మరో డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ కార్యాలయాలు దసరా నుంచి పనిచేసేలా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియను ఆయా శాఖల ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు.
మార్పులు లేని మిషన్ భగీరథ
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ‘మిషన్ భగీరథ’ను అమలులోకి తెచ్చింది. మిషన్ భగీరథ ఎస్‌ఈ కార్యాలయం పరిధిలో పరకాల, మహబూబాబాద్, వరంగల్, జనగామ డివిజన్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. మిషన్ భగీరథ ప్రాముఖ్యాన్ని పరిగణలోకి తీసుకొని ఈ డివిజన్లు ప్రస్తుతం యథావిధిగా కొనసాగించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.