
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో ఆయనో కీచకుడు. అభాగ్యులు, ఆసరాలేని మహిళలను లక్ష్యంగా చేసుకుని తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. జిల్లాలో గత నాలుగేళ్లుగా అతని కబంధ హస్తాల్లో చిక్కుకుని ఎందరో దివ్యాంగ మహిళలు, యువతులు నలిగిపోయారు. తల్లిదండ్రులు లేని అభాగ్యులను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతుంటాడు. ఉన్నత చదువులు అభ్యసించిన వారికి సంక్షేమ పథకాలను ఎరగా వేసి లోబర్చుకుంటాడు. తన మాట వినకపోతే అసభ్య పదజాలంతో విరుచుకుపడి భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఎదుటి వారిని భయపెట్టి తన కార్యాన్ని చక్క బెట్టుకుంటుంటాడు.
దర్యాప్తుల పేరుతో ఇళ్లలో చొరబడి..
ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చే విషయంలో ఇతను ప్రత్యేక దర్యాప్తులు చేపడుతుంటాడు. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు, వసతి గృహాల వద్దకు రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుంటాడు. ఇంటి బయట కూర్చొని మాట్లాడుదాం అంటూ దరఖాస్తుదారులు అంటున్న వినకుండా బలవంతంగా లోపలకు చొరబడి మాటలతో వారిని మాయ చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇతని వ్యవహారం పలుమార్లు వివాదస్పదమైంది. అయితే తనకు సహకరించకపోతే సంక్షేమ పథకాల లబ్ధి చేకూరకుండా చేస్తానంటూ బెదిరించి పలువురిని లోబర్చుకున్నట్లు సమాచారం. వికలాంగుల సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్న ఈయన సమాజపరంగా పెద్ద నటుడు. సందర్భానుసారంగా రంగులు మారుస్తూ.. దివ్యాంగులకు సేవ చేయడానికే తాను ఉన్నట్లు నటిస్తుంటాడు.
జిల్లా కేంద్రంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో వారే తన సర్వస్వంగా పెద్ద బిల్డప్ చూపిస్తూ మంత్రులను, ఉన్నతాధికారులను సైతం బురిడి కొట్టిస్తుంటాడు. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న అతను.. కార్యాలయ వేళలు ముగిసిన తర్వాతే అందరికీ అందుబాటులోకి వస్తాడు. సాధారణంగా కార్యాలయం వేళలు సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తాయి. ఈయన మాత్రం ఆరు గంటల తర్వాత కార్యాలయానికి చేరుకుంటాడు. ఇదే విషయాన్ని లబ్ధిదారు మహిళలకు తెలిపి.. కార్యాలయం వద్దకు రమ్మని ముందుగానే ఆదేశిస్తాడు. సమయం కాకపోయినా.. గత్యంతరం లేని స్థితిలో వారు అతను చెప్పినట్లు కార్యాలయానికి వెళ్లక తప్పడం లేదు.
రహస్య వివాహం
జిల్లాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థినిని మాయమాటలతో లోబర్చుకుని ఆ అధికారి రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఆమెను కార్యాలయంలోని ఓ ఉద్యోగి, వికలాంగుల సంఘం నాయకులే ఒప్పించినట్లు సమాచారం. ఈ విషయం బయటికి రాకుండా నగర శివారులోని ఓ ప్రాంతంలో ఆమెతో రహస్యంగా కాపురం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆధారం లేని ఆమెకు బ్యాక్‌లాగ్ పోస్టు ఇప్పిస్తానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్నట్లు పలువురు పేర్కొంటున్నారు.
ఇతర జిల్లాల్లోను ఇదే తంతు
గతంలో చిత్తూరు జిల్లాలో విధులు పనిచేసిన సమయంలోనూ అతను ఓ దివ్యాంగురాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమె సోదరులు, ఇతరు దివ్యాంగులు కలిసి తగిన శాస్తి చేశారు. గతంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలోనూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. అదే తంతును ఇక్కడ కొనసాగిస్తూ నాలుగేళ్లుగా టీడీపీ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోయాడు. వికలాంగ సంక్షేమ సంఘాలకు చెందిన కొందరు నాయకులను మచ్చిక చేసుకుని తన కార్యకలాపాలను ఇక్కడ కూడా విస్తరించినట్లు సమాచారం.