Handicap Welfare Department
-
ప్రభుత్వ కార్యాలయంలో..‘ఛీ’ కటి పడ్డాక
అనంతపురం సప్తగిరి సర్కిల్: జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో ఆయనో కీచకుడు. అభాగ్యులు, ఆసరాలేని మహిళలను లక్ష్యంగా చేసుకుని తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడు. జిల్లాలో గత నాలుగేళ్లుగా అతని కబంధ హస్తాల్లో చిక్కుకుని ఎందరో దివ్యాంగ మహిళలు, యువతులు నలిగిపోయారు. తల్లిదండ్రులు లేని అభాగ్యులను లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతుంటాడు. ఉన్నత చదువులు అభ్యసించిన వారికి సంక్షేమ పథకాలను ఎరగా వేసి లోబర్చుకుంటాడు. తన మాట వినకపోతే అసభ్య పదజాలంతో విరుచుకుపడి భయభ్రాంతులకు గురి చేస్తుంటాడు. ఎదుటి వారిని భయపెట్టి తన కార్యాన్ని చక్క బెట్టుకుంటుంటాడు. దర్యాప్తుల పేరుతో ఇళ్లలో చొరబడి.. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల లబ్ధి చేకూర్చే విషయంలో ఇతను ప్రత్యేక దర్యాప్తులు చేపడుతుంటాడు. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు, వసతి గృహాల వద్దకు రాత్రి సమయంలో ఒంటరిగా వెళుతుంటాడు. ఇంటి బయట కూర్చొని మాట్లాడుదాం అంటూ దరఖాస్తుదారులు అంటున్న వినకుండా బలవంతంగా లోపలకు చొరబడి మాటలతో వారిని మాయ చేసే ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇతని వ్యవహారం పలుమార్లు వివాదస్పదమైంది. అయితే తనకు సహకరించకపోతే సంక్షేమ పథకాల లబ్ధి చేకూరకుండా చేస్తానంటూ బెదిరించి పలువురిని లోబర్చుకున్నట్లు సమాచారం. వికలాంగుల సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా వ్యవహరిస్తున్న ఈయన సమాజపరంగా పెద్ద నటుడు. సందర్భానుసారంగా రంగులు మారుస్తూ.. దివ్యాంగులకు సేవ చేయడానికే తాను ఉన్నట్లు నటిస్తుంటాడు. జిల్లా కేంద్రంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో వారే తన సర్వస్వంగా పెద్ద బిల్డప్ చూపిస్తూ మంత్రులను, ఉన్నతాధికారులను సైతం బురిడి కొట్టిస్తుంటాడు. జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న అతను.. కార్యాలయ వేళలు ముగిసిన తర్వాతే అందరికీ అందుబాటులోకి వస్తాడు. సాధారణంగా కార్యాలయం వేళలు సాయంత్రం 5.30 గంటలకు ముగుస్తాయి. ఈయన మాత్రం ఆరు గంటల తర్వాత కార్యాలయానికి చేరుకుంటాడు. ఇదే విషయాన్ని లబ్ధిదారు మహిళలకు తెలిపి.. కార్యాలయం వద్దకు రమ్మని ముందుగానే ఆదేశిస్తాడు. సమయం కాకపోయినా.. గత్యంతరం లేని స్థితిలో వారు అతను చెప్పినట్లు కార్యాలయానికి వెళ్లక తప్పడం లేదు. రహస్య వివాహం జిల్లాలోని ఓ ప్రముఖ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసిస్తున్న ఓ విద్యార్థినిని మాయమాటలతో లోబర్చుకుని ఆ అధికారి రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయంలో ఆమెను కార్యాలయంలోని ఓ ఉద్యోగి, వికలాంగుల సంఘం నాయకులే ఒప్పించినట్లు సమాచారం. ఈ విషయం బయటికి రాకుండా నగర శివారులోని ఓ ప్రాంతంలో ఆమెతో రహస్యంగా కాపురం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆధారం లేని ఆమెకు బ్యాక్లాగ్ పోస్టు ఇప్పిస్తానంటూ నమ్మించి పెళ్లి చేసుకున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. ఇతర జిల్లాల్లోను ఇదే తంతు గతంలో చిత్తూరు జిల్లాలో విధులు పనిచేసిన సమయంలోనూ అతను ఓ దివ్యాంగురాలితో అసభ్యంగా ప్రవర్తించినందుకు ఆమె సోదరులు, ఇతరు దివ్యాంగులు కలిసి తగిన శాస్తి చేశారు. గతంలో తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలోనూ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలున్నాయి. అదే తంతును ఇక్కడ కొనసాగిస్తూ నాలుగేళ్లుగా టీడీపీ నాయకుల అండ చూసుకుని రెచ్చిపోయాడు. వికలాంగ సంక్షేమ సంఘాలకు చెందిన కొందరు నాయకులను మచ్చిక చేసుకుని తన కార్యకలాపాలను ఇక్కడ కూడా విస్తరించినట్లు సమాచారం. -
వీరికి 'రాజా ది గ్రేట్' ఫ్రీ.. ప్రీమియర్ షో
సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమ శాఖ వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఆ శాఖ పరిధిలోని సదనాలు, వసతిగృహాల్లో ఉంటున్న దివ్యాంగులకు ఇటీవల విడుదలైన ‘రాజా ది గ్రేట్’ తెలుగు సినిమా ప్రీమియర్ షో ఏర్పాటు చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35ఎంఎం సినిమాహాలులో ఆదివారం ఉదయం 11 గంటలకు సినిమాను ప్రదర్శించనున్నారు. దివ్యాంగుడి నేపథ్యంతో సాగే ఈ సినిమాలో హీరో విజయం సాధించిన తీరును వివరించేందుకు షోను ఏర్పాటు చేసినట్లు దివ్యాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ బి.శైలజ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రీమియర్ షో అనంతరం హీరో రవితేజతో దివ్యాంగ పిల్లల ముఖాముఖి కార్యక్రమం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం
సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని 19 ప్రభుత్వ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న 36 బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి గత మార్చి 14న వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అంధులు, బధిరులు, శారీరక వికలాంగుల కోటాలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, టైపిస్టు కమ్ స్టెనో, లైబ్రేరియన్ గ్రేడ్-3, ఆఫీస్ సబార్డినేట్, పబ్లిక్ హెల్త్ వర్కర్, వాచ్మెన్ కేటగిరిల పోస్టులు వీటిలో ఉన్నాయి. గడువు మార్చి 31తో ముగిసిపోగా మొత్తం 1,407 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికారులు ఏకంగా ఏడు నెలలకు పైగా సమయాన్ని తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి ఎంపిక కమిటీ(డీఎస్సీ) ఈ పోస్టుల నియామకాలు జరపాల్సి ఉంది. ఈ కమిటీలో జేసీ, వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా ఏడీ, ఏజేసీ, డీఆర్వో, ఉపాధి కల్పన శాఖ జిల్లా అధికారి సభ్యులుగా ఉన్నారు. పోస్టును బట్టి ఇంటర్మీడియేట్, ఏడో తరగతి, ఐదో తరగతుల్లో సాధించిన మార్కులు, ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ తదితర అర్హతల ఆధారంగా మెరిట్ జాబితాలు తయారు చేయాల్సి ఉండగా..అధికారులు తాత్సారం చేశారు. నోటిఫికేషన్ విడుదలైన మూడు నెలల తర్వాత, జూన్ 28న ప్రొవిజనల్ జాబితాలను విడుదల చేశారు. సవరించిన ప్రొవిజనల్ జాబితాతో పాటు ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున మెరిట్ జాబితా విడుదలకు మరో నాలుగు నెలలు పట్టాయి. గత నెల 22న అధికారులు హడావుడిగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేశారు. సవరించిన జాబితాలో కొందరు అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. ఎంపిక చేసిన అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వైకల్యాన్ని ధ్రువీకరించిన తర్వాతే చివరి ఎంపిక జాబితా విడుదల చేయడానికి వీలు కలగనుంది. ఉస్మానియా, ఈఎన్టీ ఆస్పత్రులకు అభ్యర్థులను పంపించి అక్కడ వైద్య పరీక్షలు జరిపించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగిసి చివరి జాబితా ప్రకటించే సరికి ఇంకొన్ని నెలల సమయం పట్టనుంది. అధికారులు తాత్సారం చేయడం వల్లే తీవ్ర జాప్యం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. ఆ పోస్టులకు అభ్యర్థులు లేరు వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల కింద ప్రకటించిన కొన్ని కేటగిరిల పోస్టులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అంధులు(మహిళ) కేటగిరిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 3, టైపిస్టు కమ్ స్టెనో పోస్టుతో పాటు బధిరుల(జనరల్) కేటగిరీలో లైబ్రేరియన్ పోస్టు ఒకటి ఉండగా.. ఈ పోస్టులకు దరఖాస్తులు రాలేదు. దీంతో వీటి కేటగిరీని మార్చి ఇతర కేటగిరిల అభ్యర్థులతో భర్తీ చేయడానికి మరో ప్రకటన జారీ చేయాల్సి ఉంది. సిబ్బంది లేకే జాప్యం సిబ్బంది కొరత వల్లే ఆలస్యం జరిగింది. నియామకాల విషయంలో మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. మార్గదర్శకాలపై స్పష్టత కోసం ప్రభుత్వానికి లేఖ రాయడం..అక్కడి నుంచి స్పందన వచ్చే వరకు కొంత సమయం పట్టింది. ఇతర కారణాలేవీ లేవు. - లక్ష్మణాచారి, ఏడీ, వికలాంగ సంక్షేమ శాఖ