సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని 19 ప్రభుత్వ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న 36 బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి గత మార్చి 14న వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా కార్యాలయం ప్రకటన జారీ చేసింది. అంధులు, బధిరులు, శారీరక వికలాంగుల కోటాలో జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, టైపిస్టు కమ్ స్టెనో, లైబ్రేరియన్ గ్రేడ్-3, ఆఫీస్ సబార్డినేట్, పబ్లిక్ హెల్త్ వర్కర్, వాచ్‌మెన్ కేటగిరిల పోస్టులు వీటిలో ఉన్నాయి. గడువు మార్చి 31తో ముగిసిపోగా మొత్తం 1,407 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తులను పరిశీలించి అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేసేందుకు అధికారులు ఏకంగా ఏడు నెలలకు పైగా సమయాన్ని తీసుకున్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా జిల్లా స్థాయి ఎంపిక కమిటీ(డీఎస్‌సీ) ఈ పోస్టుల నియామకాలు జరపాల్సి ఉంది. ఈ కమిటీలో జేసీ, వికలాంగుల సంక్షేమ శాఖ జిల్లా ఏడీ, ఏజేసీ, డీఆర్వో, ఉపాధి కల్పన శాఖ జిల్లా అధికారి సభ్యులుగా ఉన్నారు.
పోస్టును బట్టి ఇంటర్మీడియేట్, ఏడో తరగతి, ఐదో తరగతుల్లో సాధించిన మార్కులు, ఎంప్లాయ్‌మెంట్ సీనియారిటీ తదితర అర్హతల ఆధారంగా మెరిట్ జాబితాలు తయారు చేయాల్సి ఉండగా..అధికారులు తాత్సారం చేశారు. నోటిఫికేషన్ విడుదలైన మూడు నెలల తర్వాత, జూన్ 28న ప్రొవిజనల్ జాబితాలను విడుదల చేశారు. సవరించిన ప్రొవిజనల్ జాబితాతో పాటు ఒక్కో పోస్టుకు ఇద్దరు అభ్యర్థుల చొప్పున మెరిట్ జాబితా విడుదలకు మరో నాలుగు నెలలు పట్టాయి. గత నెల 22న అధికారులు హడావుడిగా 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితాను విడుదల చేశారు. సవరించిన జాబితాలో కొందరు అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోలేదని సమాచారం. ఎంపిక చేసిన అభ్యర్థులకు రాష్ట్ర స్థాయి మెడికల్ బోర్డు ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వైకల్యాన్ని ధ్రువీకరించిన తర్వాతే చివరి ఎంపిక జాబితా విడుదల చేయడానికి వీలు కలగనుంది. ఉస్మానియా, ఈఎన్‌టీ ఆస్పత్రులకు అభ్యర్థులను పంపించి అక్కడ వైద్య పరీక్షలు జరిపించాల్సి ఉంది. ఈ ప్రక్రియ ముగిసి చివరి జాబితా ప్రకటించే సరికి ఇంకొన్ని నెలల సమయం పట్టనుంది. అధికారులు తాత్సారం చేయడం వల్లే తీవ్ర జాప్యం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి.
ఆ పోస్టులకు అభ్యర్థులు లేరు
వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల కింద ప్రకటించిన కొన్ని కేటగిరిల పోస్టులకు ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. అంధులు(మహిళ) కేటగిరిలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 3, టైపిస్టు కమ్ స్టెనో పోస్టుతో పాటు బధిరుల(జనరల్) కేటగిరీలో లైబ్రేరియన్ పోస్టు ఒకటి ఉండగా.. ఈ పోస్టులకు దరఖాస్తులు రాలేదు. దీంతో వీటి కేటగిరీని మార్చి ఇతర కేటగిరిల అభ్యర్థులతో భర్తీ చేయడానికి మరో ప్రకటన జారీ చేయాల్సి ఉంది.
సిబ్బంది లేకే జాప్యం
సిబ్బంది కొరత వల్లే ఆలస్యం జరిగింది. నియామకాల విషయంలో మాపై ఎలాంటి ఒత్తిళ్లు లేవు. మార్గదర్శకాలపై స్పష్టత కోసం ప్రభుత్వానికి లేఖ రాయడం..అక్కడి నుంచి స్పందన వచ్చే వరకు కొంత సమయం పట్టింది. ఇతర కారణాలేవీ లేవు.
- లక్ష్మణాచారి, ఏడీ, వికలాంగ సంక్షేమ శాఖ
వికలాంగుల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యం
Published Thu, Nov 7 2013 12:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:20 AM
Advertisement
Advertisement