హుజూరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం లక్ష ఉద్యోగాలు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని ఆర్థిక, పౌర సరఫరాల శాఖల మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ హైస్కూల్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్‌మేళాను ఆయన ప్రారంభించారు. సింగరేణి, ట్రాన్స్‌కో, జెన్‌కో తదితర సంస్థల్లో 27 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
మిగిలిన ఉద్యోగాలను ఏడాదిలోగా భర్తీ చేస్తామన్నారు. పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ యువతలో ప్రతిభా నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నాయని, కంపెనీల ప్రతినిధులు ఎక్కువ మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకోవాలని కోరారు. జాబ్‌మేళాకు మూడువేల మంది అభ్యర్థులు హాజరుకాగా.. 24 ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు.