బాలల హక్కుల పరిరక్షణకు కృషి
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
Published Sat, Nov 19 2016 10:44 PM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
– జేసీ–2 రామస్వామి
– ఘనంగా బాలల హక్కుల వారోత్సవాలు
కర్నూలు(అర్బన్): బాలల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సి ఉందని జిల్లా జాయింట్ కలెక్టర్–2 రామస్వామి అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బాలల హక్కుల వారోత్సవాల్లో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి. ఐసీడీఎస్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ శారద అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జేసీ–2 రామస్వామి మాట్లాడుతూ.. బాల బాలికలు విద్య, ఆరోగ్యం, ఆహార విషయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లాలో సమగ్ర బాలల సంరక్షణ కేంద్రాలు పని చేస్తున్నాయని, అప్పుడే పుట్టిన చిన్నారి నుంచి వయో వృద్ధుల వరకు అన్ని రకాల సేవా కార్యక్రమాలను చేపడుతున్నామని ఐసీడీఎస్ ఆర్‌జేడీ శారద చెప్పారు. చెడు అలవాట్లకు లోనుకాకుండా యోగా కేంద్రాలకు వెళ్లి ఏకాగ్రతను పెంచుకోవాలని సీనియర్ న్యాయవాది నాగలక్ష్మిదేవి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపాలని డిప్యూటీ డీఈఓ తాహెరా సుల్తానా అన్నారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎంపీపీ ఈశ్వరమ్మ, సర్పంచును సన్మానించారు. వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. బాలికా సంరక్షణ పథకం కింద మంజూరైన ఇన్సూరెన్స్ బాండ్లను 40 మంది ఆడపిల్లల తల్లిదండ్రులకు జేసీ–2 అందించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ ఏపీడీ అరుణ, 1098 పీడీ మోహన్‌రావు, జిల్లాలోని ఐసీడీఎస్ సీడీపీఓ, సూపర్‌వైజర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement