
సమస్యల పరిష్కారం కోసం కృషి
ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ
గోదావరిఖని : కాంట్రాక్టు కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయనున్నట్టు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెలిపారు. స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయంలో సింగరేణి కాంట్రాక్టు క్యాజువల్ వర్కర్స్ యూనియన్ సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల జీవన ప్రమాణాలు పెరగాలని, ఇందుకోసం ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో సమావేశమైన సందర్భంలో రాష్ట్రంలో మూడు ఈఎస్‌ఐ ఆసుపత్రుల ఏర్పాటుకు సమ్మతించగా...అందులో ఒకటి రామగుండం ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు మంత్రి అనుమతిచ్చారన్నారు. అయితే ఇందుకోసం ఐదు ఎకరాల స్థలాన్ని అప్పగిస్తే రెండేళ్లలో ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అనువైన స్థలం కోసం పరిశీలన చేస్తున్నామని వివరించారు. కాంట్రాక్టు కార్మికులందరికి ఈఎస్‌ఐ, ప్రావిడెంట్ ఫండ్ వర్తింపచేయాలని, ప్రమాద బీమా రావాలని సూచించారు. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి మాట్లాడుతూ కాంట్రాక్టు కార్మికులందరు సంఘటితమై కలిసి పోరాటం చేస్తే హక్కులు సాధించుకోవచ్చన్నారు.
కాంట్రాక్టు కార్మిక సంఘాలు ఏ రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నా సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలు చేయాలని పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికులకు అలవెన్స్ లు చెల్లించే విషయాన్ని ఎంపీ, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. టీబీజీకేఎస్ నాయకులు ఎన్ .రామయ్య వై.సారంగపాణి, నూనె కొమురయ్య, ఆరెల్లి పోశం, పూర్మ సత్యనారాయణ, గుడి రమేష్‌రెడ్డి, లక్కాకుల లక్ష్మన్, కాంట్రాక్టు కార్మిక సంఘం నాయకులు కందుకూరి రాజరత్నం, ఎండీ కరీం, ఎర్రగొల్ల కొమురయ్య, విజయ్‌కుమార్, సాహెబ్‌హుస్సేన్, బొమ్మ అంజయ్య, పోలుదాసరి నారాయణ, గుంపుల ఓదెలు, పిల్లి రమేష్ పాల్గొన్నారు. అంతకుముందు కాంట్రాక్టు కార్మికులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సంఘం నాయకులు ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు.