రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ
సాక్షి, పెద్దపల్లి : కరీంనగర్ టీఆర్‌ఎస్ పార్టీలో కలకలం రేగింది. రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఆయన ప్రకటించారు. పార్టీలో క్రమశిక్షణ కొరవడిందని పేర్కొన్నారు. పార్టీలో ఎంతో మందిని ప్రోత్సహించానని, ఇపుడు వారే తనకు నష్టం చేసేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. ఏం నిర్ణయం తీసుకున్నా.. సింగరేణి కార్మికులకు ముందుగా చెప్పడం ఆనవాయితీ అని సోమవారం జరిగిన కార్మికుల గేట్ మీటింగ్ లో ఆయన స్పష్టం చేశారు.
కారణమిదేనా?
రామగుండం మేయర్ కొంకటి లక్ష్మీనారాయణపై ప్రవేశపెట్టిన అవిశ్వాసం టీఆర్‌ఎస్‌లో ప్రకంపనలకు దారితీసింది. మేయర్ లక్ష్మీనారాయణపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై హైకమాండ్ మండిపడింది. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్ చేసి అవిశ్వాసం నిలిపివేయాలని ఆదేశించారు. ఈ క్రమంలో రామగుండం పరిస్థితిని వివరించడానికి ఎమ్మెల్యే ప్రయత్నించినా కేటీఆర్ వినిపించుకోలేదని విశ్వసనీయంగా తెలిసింది. ‘ అవిశ్వాసం ఆపేస్తారా.. అవిశ్వాసం లేకుండా ఆర్డినెన్స్ తీసుకురమ్మంటారా ’ అని ఘాటుగా వ్యాఖ్యానించినట్టు ప్రచారం జరుగుతోంది.
అధిష్టానం ఆదేశం మేరకు రంగంలోకి దిగిన ఎమ్మెల్యే నోటీసు ఇచ్చిన కార్పేటర్లను బుజ్జిగించే ప్రయత్నం చేశారు. అవిశ్వాసంపై వెనక్కి తగ్గేది లేదని కార్పొరేటర్లు తేల్చిచెప్పారు. ఓ వైపు అధిష్టానం అవిశ్వాస తీర్మానం పట్ల సీరియస్‌గా ఉండటం.. మరో వైపు కార్పోరేటర్లు తన మాట వినకపోవడంతో ఎమ్మెల్యే మనస్థాపానికి గురైనట్టు తెలిసింది. దీంతో తాను రాజకీయల నుంచి తప్పుకుంటున్నానని ఎమ్మెల్యే ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment