విద్యాలయాల్లో మళ్లీ ఎన్నికల సందడి
విద్యాలయాల్లో మళ్లీ ఎన్నికల సందడి
Published Thu, Jul 28 2016 11:41 PM | Last Updated on Tue, Aug 14 2018 5:56 PM
ఆలేరు : ప్రభుత్వ పాఠశాలల నిర్వహణలో తల్లిదండ్రులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం ఇదివరకే నిర్ణయించింది. దీంట్లోభాగంగా పాఠశాలల యాజమాన్య కమిటీలను ఏర్పాటు చేసింది. అయితే రెండు సంవత్సరాలుగా నూతన పాఠశాల యాజమాన్య కమిటీలను నియమించలేదు. పాత సంఘాలే కొనసాగాయి. అయితే నూతన యాజమాన్య కమిటీల ఎన్నుకునేందుకు ప్రభత్వం నిర్ణయించింది. దీంతో ఆగస్టు 1 నుంచి 10 వరకు కమిటీల ఎన్నికలు జరిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే విద్యాహక్కు చట్టంలో భాగంగా ప్రైవేట్ పాఠశాలల్లో మినహా అన్ని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్ పాఠశాలల్లో విద్యాయాజమాన్య కమిటీలు ఏర్పాటు కానున్నాయి.
కమిటీల ఎంపిక విధానం ఇలా..
– పాఠశాల యాజమాన్య కమిటీలకు ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది.
– పోటీకి నిలబడే వ్యక్తుల పిల్లలు ఆ పాఠశాలల విద్యార్థులై ఉండాలి.
– ప్రాథమిక పాఠశాలల్లో 30 మందితో మాత్రమే కమిటీ ఉండాలి.
– ప్రాథమికోన్నత పాఠశాలల్లో (1 నుంచి 7వ తరగతి వరకు) 42 మందితో ఉండాలి.
– ఉన్నత పాఠశాలల్లో 30 మంది సభ్యులుండాలి.
– పాఠశాలల్లో 30 మంది విద్యార్థులకంటే తక్కువ ఉంటే ప్రతి ఒక్కరి తల్లి లేడా తండ్రి కమిటీలో సభ్యులే అవుతారు.
– పాఠశాల మొత్తం విద్యార్థుల సంఖ్యలో 50 శాతం మంది తల్లిదండ్రులు హాజరైన పక్షంలోనే ఎన్నికలు నిర్వహించాలి.
– ఈ కమిటీలకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కన్వీనర్‌గా ఉంటారు.
ఇవీ.. బాధ్యతలు..
పాఠశాలల్లో పిల్లలను చేర్పించడం, మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరు, ప్రభుత్వ నిధుల వినియోగం, ఉపాధ్యాయుల గైర్హాజరు తదితర అంశాలను యాజమాన్య కమిటీలు పర్యవేక్షించాలి. పాఠశాలల అభివృద్ధికి పాటుపడాలి.
పేరుకే కమిటీలు..
విద్యాహక్కు చట్టం అమలులోకి వచ్చి ఆరేళ్లు పూర్తయ్యింది. నేటికీ పాఠశాలల్లో మౌలిక సదుపాయల కొరత వేధిస్తూనే ఉంది. పాఠశాలల్లో ప్రధాన సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు ప్రణాళికలను తయారు చేయడం, ప్రభుత్వానికి పంపడం, విద్యార్థులను మెరుగైన సదుపాయల కల్పన ప్రధాన లక్ష్యం. కాని కమిటీల పాత్ర నామమాత్రంగా మారింది. తల్లిదండ్రుల్లో అవగాహన లోపం వల్ల మొక్కుబడిగా సమావేశాలు జరుగుతున్నాయి.
Advertisement
Advertisement