టీడీపీ కనుసన్నల్లో ఉప ఎన్నికలు
► అధికారుల మౌనం..అడ్డు చెప్పని పోలీసులు
► ఇదే అదునుగా రెచ్చిపోయిన టీడీపీ నాయకులు
► చిత్తూరులో 64%, పలమనేరులో 80% పోలింగ్, రేపు ఓట్ల లెక్కింపు
► పోలీసుల అదుపులో ఎమ్మెల్యేలు చెవిరెడ్డి, నారాయణస్వామి
చేతిలో అధికారం ఉంటే ఎలాంటి పనులు చేయొచ్చు.. అధికారులను ఎలా ఉపయోగించుకోవాలి.. అడ్డు చెప్పిన వాళ్ల నోళ్లు ఎలా మూయించాలని టీడీపీ నాయకులు మరోమారు ప్రత్యక్షంగా చూపించారు. జిల్లాలోని చిత్తూరు, పలమనేరు మున్సిపాలిటీల్లోని రెండు డివిజన్లకు ఆదివారం జరిగిన ఉప ఎన్నికలు ఇందుకు సాక్ష్యంగా నిలిచాయి. పోలింగ్ కేంద్రం వద్ద తిరుగుతున్న టీడీపీ ప్రజాప్రతినిధులను పట్టించుకోకుండా పోలింగ్ కేంద్రం వైపు వెళ్లకపోయినప్పటికీ నగరంలో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణస్వామిలను అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు: చిత్తూరు నగరంలోని 38వ డివిజన్ కు, పలమనేరులోని 23వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులు చనిపోతే కనీస రాజకీయ ధర్మం పాటించి ఏకగ్రీవం చేయాల్సిన వార్డుల్లో నిస్సిగ్గుగా తమ అభ్యర్థుల్ని పోటీలోకి దించిన తెలుగుదేశం పార్టీ నాయకులు పోలింగ్ రోజున బరి తెగించారు. పోలీసుల్ని తమ వైపు తిప్పుకున్న ఆ పార్టీ నాయకులు తాము చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తించారు.
చిత్తూరులో పోలీసుల ఎదుటే కొందరు దొంగఓట్లు వేయగా.. మరి కొంతమందిని పోలీసులు అడ్డుకున్నారు. అప్పటికీ ఇతర వార్డుల నుంచి వరసుగా దొంగ ఓట్లు వేయడానికి వస్తున్న వాళ్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పోలింగ్ తీరును ఎస్పీ శ్రీనివాస్ రెండుమార్లు పరిశీలించారు. పలమనేరులో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి గీసిన గీతను పోలీసులు దాటలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని బెదిరించడం, ఓటర్లు ఎవరికి ఓట్లు వేయడానికి వస్తున్నారో తెలుసుకుని వైఎస్సార్‌సీపీ సానుభూతి పరులను అడ్డుకోవడం, స్టేషన్లకు తరలించడం లాంటి పనులు పోలీసులు చేయడం సర్వత్రా విమర్శలకు దారితీసింది.
పోలింగ్ ఇలా...
చిత్తూరు నగరంలో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రాంరభమైంది. ఉదయాన్నే ఓటర్లు పెద్ద సంఖ్యలో రావడంతో 38వ డివిజన్ కు ఏర్పాటుచేసిన మూడు పోలింగ్ స్టేషన్లు కిటకిటలాడాయి. ఇక్కడ మొత్తం 3,594 మంది ఓటర్లు ఉండగా సాయంత్రం 5 గంటలకు 2,317 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 64.46 శాతం పోలింగ్ నమోదయ్యింది.
చిత్తూరు ఆర్డీవో కోదండరామిరెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ బాలసుబ్రమణ్యంలు ఎన్నికల తీరును పరిశీలించారు. పలమనేరులోని 23వ వార్డులో 80.05 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ మొత్తం 1,397 మంది ఓటర్లు ఉండగా.. 1,125 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. కమిషనర్ రామచంద్రరావు పోలింగ్‌ను పర్యవేక్షించారు.
రేపు లెక్కింపు
రెండు వార్డుల్లో జరిగిన ఉప ఎన్నికలకు సంబం ధించి మంగళవారం ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆదివారం సాయంత్రం పోలింగ్ పూర్తవడంతో చిత్తూరుకు సంబంధించిన మూడు ఈవీఎంలను స్థానిక పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తరలించారు. ఇక్కడున్న స్ట్రాంగ్ రూమ్‌లో వీటిని భద్రపరచారు. అలాగే పలమనేరుకు చెందిన రెండు ఈవీఎంలను మున్సిపల్ కార్యాలయంలో భద్ర పరిచారు.
ఓట్ల లెక్కింపును ఈనెల 11న చిత్తూరులో పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో, పలమనేరు ఓట్లను స్థానిక మున్సిపల్ కార్యాలయంలో ఉదయం 8 గంటలకు లెక్కించి గంటలో ఫలితాలను ప్రకటిస్తారు. కాగా చిత్తూరులో ఈనెల 15న జరిగే ప్రత్యేక సమావేశంలో కలెక్టర్ సమక్షంలో పరోక్ష పద్ధతిలో మేయర్‌ను ఎన్నుకుంటారు.