అజ్ఞాతంలో విద్యుత్ ఎస్‌ఈ
– సెలువు పేరుతో రెండు రోజులుగా కార్యాలయానికి దూరం
– బదిలీలపై విమర్శలు, ఆరోపణలే కారణం?
కర్నూలు (రాజ్‌విహార్): విద్యుత్ శాఖ ఏపీ ఎస్‌పీడీసీఎల్ కర్నూలు సర్కిల్ ఆపరేషన్స్ ఎస్‌ఈ జి.భార్గవ రాముడు అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇటీవలే చేపట్టిన బదిలీలే అందుకు కారణమని స్పష్టంగా తెలుస్తోంది. ఆయన ఇచ్చిన ఉత్తర్వుల్లో అవకతవకలు జరిగాయని ఒకవైపు ఉద్యోగ, కార్మిక సంఘాలు, అసోసియేషన్లు ఆరోపిస్తుంటే తమకు అన్యాయం జరిగిందని మహిళా ఉద్యోగిణులు మండిపడుతున్నారు. ఈ రెండు వర్గాల నుంచి వస్తున్న ఒత్తిళ్లను తట్టుకోలేక సెలువు పేరుతో రెండు రోజులుగా ఆయన కార్యాలయానికి దూరంగా ఉంటున్నారు. ఇటు ఆయన తన అధికారిక సెల్ ఫోన్ 94408 13316 నంబర్‌ను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.
సెలవుల వెనుక ఇదీ కథ:
సాధారణ బదిలీలు నెల రోజుల నుంచి ఎస్‌పీడీసీఎల్‌లో వేడి పుట్టించాయి. కోరుకున్న పోస్టింగ్ కోసం కొందరు పైరవీలు చేయగా మరికొందరు ప్రలోభాలకు తెరలేపారు. అధికారు పార్టీ నేతలు, ఉత్తర్వులు ఇచ్చే అధికారి ఇంటి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆశీస్సులు పొందినట్లు తెలుస్తోంది. జరగుతున్న వ్యవహారం అంతా ఈనెల 24న ‘సాక్షి’లో ప్రచురితమైన విషయం తెలిసిందే. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఈనెల 24లోపు బదిలీ ప్రభావితం అయిన వారికి ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. దీనిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తూ కథనం వచ్చింది. అయితే అధికారులు బదిలీ అయిన వారికి 26న ఉత్తర్వులు ఇచ్చారు. వీటిపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి.
రాజకీయ నాయకుల అండ, చేతులు తడిపిన కొందరికి దీర్ఘకాలికంగా పనిచేస్తున్నా కేవలం సీటు మార్చారు తప్ప దూర ప్రాంతాలకు వేయలేదని ఆరోపించడంతోపాటు వాటిని మార్చాలని ఎస్‌ఈ బహిరంగంగా సూచించారు. సిఫార్సులు, పైరవీకారులకు పెద్ద పీట వేశారు తప్ప మిగిలిన వారికి న్యాయం చేయలేదని విమర్శించారు. ఇటు బదిలీకి అర్హులైన మహిళా ఉద్యోగుల్లో 50శాతం మందిని జిల్లా స్థానికంగానే ఉంచాల్సి ఉండగా ఆళ్లగడ్డ, నంద్యాల తదితర దూర ప్రాంతాలకు బదిలీ చేయడంతో మహిళలు ఆగ్రహించారు. అదే రోజు రాత్రి 10:30గంటల వరకు నిర్బంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో సీఎండీ సైతం ఎస్‌ఈకి క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఇరువర్గాల ఆరోపణలు, రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేక ఉత్తర్వుల్లో మార్పులు చేస్తానని ప్రకటించిన ఆయన వాటిలో సవరణలు చేశారు. సంతకాలు పెట్టి సెలువుపై వెళ్తున్నట్లు చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది.
శాంతించని ఇరు వర్గాలు:
బదిలీల విషయంలో నెలకొన్న చిచ్చు ఇంకా చల్లారలేదు. రెండు వార్గాలు శాంతించలేదు. ఆయన వచ్చాక తాడో పేడో తేల్చుకోవాలని ఎదురు చూస్తున్నారు. బదిలీల్లో జరిగిన అవకతవకలపై ప్రశ్నించేందుకు ఫోన్ ద్వారా ప్రయత్నిస్తుండగా మూడు రోజులగా స్విచ్ ఆఫ్ అని వస్తోందని ఉద్యోగ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు.
గతంలోనూ ఇలాంటి తంతే..!
బదిలీల విషయంలో గతంలోనూ ఇలాంటి తంతే జరిగింది. ఎస్‌ఈ ఇచ్చిన ఉత్తర్వుల్లో అవకతవకలు జరిగాయంటూ ఆరోపిస్తూ గతంలో పనిచేసిన సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌ను నిర్బంధించి మధ్యాహ్నం భోజనానికి కూడా పంపలేదు. దీంతో ఆయనకు షుగర్ డౌన్ అయి కళ్లు తిరిగి పడిపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించిన ఘటన సంచలనంగా మారింది.
సెల్‌ఫోనూ స్విచ్ ఆఫ్..
ఎస్‌ఈ భార్గవ రాముడు తన అధికారిక సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. వినియోగదారులతో ముడిపడిన ఆపరేషన్స్ పోస్టు కావడంతో సమస్య వచ్చినప్పుడు వినియోగదారులు, పారిశ్రామిక వేత్తలు ప్రజా ప్రతినిధులతోపాటు జిల్లా కలెక్టర్, డైరెక్టర్లు, సీఎండీ ఇలా అన్ని వర్గాల నుంచి కాల్స్ వస్తుంటాయి. అయితే మూడు రోజులుగా స్విచ్ ఆఫ్ చేసుకోవడం సరైంది కాదని, అధికారి సెలవుల్లో వెళితే ఇన్‌చార్జీగా వేరే ఒకరిని నియమించాలని కార్యాలయ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఓ యూనియన్ పేర్కొంది.