పైకి గాంభీర్యం..
వరంగల్ ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనంటూ కాంగ్రెస్ నేతలు పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. లోలోపల మాత్రం ఫలితం ఎలా ఉంటుందా అన్న చర్చ పార్టీ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది. ఈ నియోజకవర్గంతో సంబంధం లేని నాయకుడిని అభ్యర్థిగా బరిలో నిలిపినందున దాని ప్రభావం ఏ స్థాయిలో, ఏ మేరకు పడుతుందనే దానిపై తర్జనభర్జనలు పడుతున్నారు. జాతీయ స్థాయిలోని పార్టీ ముఖ్య నేతలు అందులో ఎస్సీ వర్గానికి చెందిన అగ్రనేతలను, పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేందుకు కృషి చేసిన నేతలను ప్రచార రంగంలోకి దించినా ఫలితం ఎలా ఉండబోతుందా అని టెన్షన్ పడుతున్నారట!
గట్టి అభ్యర్థిగా ఉన్న మాజీ ఎంపీ అనూహ్య పరిస్థితుల్లో వైదొలగడం, జిల్లా పార్టీలో ముఖ్యనేతగా ఉన్న నాయకుడు, పార్టీ డమ్మీ అభ్యర్థిగా ఉన్న వ్యక్తి కూడా పార్టీకి రాజీనామా చేయడం, ఇతరత్రా ప్రతికూల పరిస్థితులు అనేకం ఉన్నాయని కొందరు నేతలు చెవులు కొరుక్కుంటున్నారట. చివరకు కాంగ్రెస్ అభ్యర్థికి ఏ స్థానం దక్కుతుందో, ఎన్ని ఓట్లు వస్తాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిందని అంతర్గత చర్చల్లో హైరానపడుతున్నారట.