
పేదరికంపై విజయం
♦ ఆర్డీటీ సహకారంతో ఉన్నత విద్యసాకారం
♦ నిరుపేద కుటుంబాల్లో ఉపాధి వెలుగులు
రాజ్యాంగం కల్పించిన కనీస హక్కులను సైతం ప్రభుత్వాలు కల్పించలేకపోతున్నాయి. విద్య, వైద్య రంగాల నుంచి ఏనాడో తప్పుకున్న ప్రభుత్వాలు తాజాగా ఉపాధి కల్పనలోనూ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజు రియంబర్స్‌మెంట్ సౌకర్యాన్ని అందబాటులోకి తీసుకువచ్చి నిరుపేదల పిల్లలు సైతం ఉన్నత విద్యను అభ్యసించేలా చేసిన మహానేత డాక్టర్ వైఎస్‌ఆర్ ఆశయాన్ని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నీరుగారుస్తోంది. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం చేయలేని పనిని ఓ సంస్థ తన భుజస్కంధాలపై వేసుకుంది. ఉపాధి కల్పనతో పాటు నిరుపేద పిల్లల ఉన్నత విద్యాభ్యాసానికి ఇతోధికంగా సహకరిస్తోంది. అదే రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ). ఓ మహోన్నత ఆశయంతో నిరుపేద కుటుంబాల్లో ఉపాధి వెలుగులు నింపుతోంది. సంస్థ ద్వారా పలువురు ఆర్థిక సాయం పొంది ఆర్థికాభివద్ధి సాధించడమే కాదు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. ఆ సక్సెస్ స్టోరీస్ ఏమిటో తెలుసుకుందాం రండి...
గంపలు అల్లుతూ...
ఈ ఫొటోలో కనిపిస్తున్నది గుంతకల్లు మండలంలోని ఇమాంపురం గ్రామానికి చెందిన ఎరికల దుర్గయ్య, శివమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు. వరుస పంట నష్టాలతో తమకున్న మూడు ఎకరాల పొలంలో పంట సాగు చేపట్టలేని స్థితిలో ఉన్న దుర్గయ్య దంపతులకు గంపలు అల్లకం, బిందెల వ్యాపారానికి ఆర్డీటీ సంస్థ ఆర్థిక సాయాన్ని అందజేసింది. వీరి పెద్దకుమారుడు శ్రీనివాసులు, పదో తరగతి (2013లో) 8.0 పాయింట్లతో ఉత్తీర్ణుడయ్యాడు. వచ్చే అరకొర ఆదాయంతో కుమారుడిని ఇంటర్మీడియట్‌లో చేర్పించడం దుర్గయ్యకు భారమైంది. ప్రవేశ పరీక్షల ద్వారా ఉత్తమ ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి వారి ఉన్నత చదువులకయ్యే మొత్తం ఖర్చును ఆర్డీటీ సంస్థ భరిస్తున్న విషయం తెలుసుకుని శ్రీనివాసులు ఆ దిశగా అడుగు ముందుకేశాడు. ప్రవేశ పరీక్ష రాసి, ఉత్తమ ఫలితాలు సాధించాడు ఫలితంగా శ్రీకాళహస్తిలోని ట్రైబల్ వెల్‌ఫేర్ ఇంటర్ కాలేజీలో అతనికి సీటు దక్కింది. బైపీసీలో 944 మార్కులతో ఉత్తీర్ణుడైన అతను ఎంసెట్‌లో ర్యాంక్ తక్కువగా రావడంతో ఎంబీబీఎస్‌లో సీటు దక్కలేదు. అనంతరం ఆర్డీటీ ప్రోత్సాహంతో ఏడాదిపాటు కోచింగ్ తీసుకుని రెండవ సారి ఎంసెట్ రాశాడు. ఈ సారి 9,495 ర్యాంక్ సాధించి ఎంబీబీఎస్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం వైఎస్‌ఆర్ జిల్లా కడపలోని రిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్నాడు.
చదువు మధ్యలోనే ఆగిపోయేది
మాకు సొంతంగా ఇల్లు కూడా లేదు. వరుస పంటనష్టాలు మా కుటుంబాన్ని అప్పుల్లోకి నెట్టేశాయి. కుటుంబం కూడా గడవని స్థితిలో ఉన్నప్పుడు ఆర్డీటీ ఆర్థిక సహాయం అందించి వ్యాపారం చేసుకునేలా పోత్సహించింది. పదో తరగతితోనే ఆగిపోవాల్సిన నా చదువు ఈ రోజు ఎంబీబీఎస్ దాకా వచ్చిందంటే అది ఆర్డీటీ చలవే. కార్డియాలజీ పూర్తి చేసి పేదలకు సేవ చేయాలని ఉంది.
– శ్రీనివాసులు, మెడికో
కష్టాలను ఎదిరించి..
ఈ చిత్రంలో కనిపిస్తున్నది గుంతకల్లు మండలంలోని కదిరిపల్లికి చెందిన రమావత్ నరసింహులు నాయక్, చంద్రమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. ఐదు ఎకరాల పొలంలో పంట సాగు చేపట్టి వరస నష్టాలతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన నరసింహులు నాయక్‌కు కుటంబపోషణ భారమైంది. ఇలాంటి తరుణంలో ఆర్డీటీ సంస్థ అందించిన ఆర్థిక సాయంతో ఎనుముల పెంపకం చేపట్టి పాడితో కుటుంబాన్ని పోషించుకోసాగాడు. వీరి రెండవ కుమార్తె ఉమాదేవికి చదువుకోవాలనే ఆకాంక్ష బలంగా ఉంది. ఆర్డీటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేసవి శిబిరంలో శిక్షణ పొందిన రమాదేవి ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి కర్నూలులోని ఏపీ రెసిడెన్సియల్ స్కూల్‌లో సీటు దక్కించుకుంది. అక్కడే 2014లో పదో తరగతిలో 9.5 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. అదే సమయంలో మరోసారీ ఆర్డీటీ సంస్థ నిర్వహించిన ప్రవేశ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించి విజయవాడలోని ఓ కార్పొరేట్ స్కూల్‌లో బైపీసీ పూర్తి చేసింది. ఈ ఏడాది నిర్వహించిన ఎంసెట్‌లో 10.098 ర్యాంక్ సాధించి ప్రస్తుతం కడపలోని రిమ్స్ మెడికల్ కళాశాలలో వైద్య విద్యనభ్యసిస్తోంది.
ఆర్డీటీ స్ఫూరితో...
ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మా కుటుంబానికి చేయూతనందించిన ఆర్డీటీ సంస్థ అడుగడుగునా నన్ను ప్రోత్సహిస్తూ వచ్చింది. సంస్థ ఆశయం నాలో స్ఫూర్తిని నింపింది. అందుకే పేదలకు సాయం చేయాలనే లక్ష్యంతో వైద్య వత్తిని ఎంచుకున్నారు. భవిష్యత్తులో సంస్థ సేవా మార్గాన్ని అనుసరిస్తాను.
– ఉమాదేవి, మెడికో