సమావేశంలో మాట్లాడుతున్న ఆగాచారి
దండేపల్లి : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆగాచారి తెలిపారు. టీఎస్‌యూటీఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా సోమవారం ఆయన దండేపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులతో సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగులు సీపీఎస్ విధానంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీనిని రద్దు చేయాలని సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో ర్యాలీలు, అక్టోబర్‌లో ఢిల్లీలో ఆందోళన చేపడతామని తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు కందుల తిరుపతి, జిల్లా నాయకులు గోళ్ల రామన్న, రమేశ్, రాజేశం, బాలశౌరి, మండల అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమౌళి, తిరుపతి పాల్గొన్నారు.