TSUTF
-
విద్యాభివృద్ధితోనే సామాజిక ఎదుగుదల
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అన్ని వర్గాల వారిని ప్రోత్సహించి విద్యాభివృద్ధికి కృషి చేయడం ద్వారానే జ్ఞాన సముపార్జన జరిగి సామాజిక ఎదుగుదల సాధ్యమవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జయతీఘోష్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర తృతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జయతీఘోష్ మాట్లాడుతూ.. కులం, మతం, లింగ ఆర్థిక విషయాల్లో పాలకులు ప్రజల్లో విభే దాలను సృష్టిస్తున్నారన్నారు. భిన్నత్వాన్ని నిర్వీ ర్యం చేసేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భిన్నత్వాన్ని ప్రోత్సహించే యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలపై జరుగుతున్న దాడులే దీనికి కారణమన్నారు. హైదరాబాద్ తదితర యూనివర్సిటీల్లో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం చేయిస్తున్న దాడులకు నిదర్శనమని చెప్పారు. విద్యావ్యవస్థలో భయంకర పరిస్థితి: చుక్కా రామయ్య ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ..ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో విద్యావ్యవస్థలో భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. మనసులోని మాటను కూడా చెప్పలేని స్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఛాందస భావాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలన్నీ బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులంతా విద్యా వ్యవస్థను మెరుగుపర్చేలా పోరాడాలని కోరారు. ప్రతీ విద్యార్థిలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలని, అందుకు తగిన విధంగా ఉపాధ్యాయుల బోధనలు ఉండాలని సూచించారు. రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు: ప్రొఫెసర్ నాగేశ్వర్, హరగోపాల్ ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ..రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అదే రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ..పాఠశాలల్లో ఆట స్థలాలే ఏర్పాటు చేయని దేశంలో కామన్వెల్త్ గేమ్స్ నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, చావా రవి, ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని, బి.నర్సింహారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలి
అనంతగిరి : ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీలతో వికారాబాద్ జిల్లాలో ఏర్పడిన ఖాళీలను పదోన్నతులతో, కొత్త నియామకాలతో భర్తీ చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకట్రత్నం అన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బదిలీలతో వికారాబాద్ జిల్లాలో 1370 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఏర్పడినట్లు చెప్పారు. 2012 నుంచి ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతోనే వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇటీవల నిర్వహించిన బదిలీలతో వికారాబాద్ లాంటి గ్రామీణ ప్రాంత జిల్లాలో ఖాళీల సంఖ్య మరింతగా ఉందన్నారు. కనీసం విద్యావలంటీర్లు దొరకని మండలాలు ఉన్నాయని, ఈ కారణంగా పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై నమ్మకం పోతుందన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే ఉద్దేశంఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు. వేసవి సెలవుల్లో నిర్వహించాల్సిన బదిలీలను జూలైలో నిర్వహించడంతో విద్యార్థుల చేరికల్లో తీవ్ర ప్రభావం చూపిందన్నారు. జిల్లాలో చాలా బడు ల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభత్వం స్పందించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ప్రస్తుత ఉపాధ్యాయులకు ఉద్యోగన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్‌పై బదిలీలు చేసుకున్న వాటిని వెంటనే రద్దు చేయాలన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు ఒప్పుకున్నాకనే జూనియర్ ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నా అధికారులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ విషయంపైఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా> జిల్లా ప్రధాన కార్యదర్శి టి. పవన్‌కుమార్, జిల్లా సభ్యులు మాణిక్యం, పరమేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
సార్లే.. సారథులు..
సుజాతనగర్ : సమాజంలో తల్లిదండ్రుల తర్వాత ఆ స్థానం గురువులది.. విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసేది వారి భాషణాలే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు సర్కార్ బడుల పరిరక్షణలోనూ మేము సైతం అంటున్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి నిర్వహించే ఉద్యమాల్లో పాల్గొంటూ.. ఉపాధ్యాయ సంఘాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. ఆయా సంఘాల్లో రాష్ట్రస్థాయిలో కీలక పదవుల్లో ఉంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకత్వ పటిమను నలుదిశలా చాటిచెబుతున్నారు. రాందాస్, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఇల్లెందు మండలం చెన్నంగులగడ్డ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న బానోత్ రాందాస్ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగుతున్నారు. గతంలో రాందాస్ వీఆర్‌పురం, బయ్యారం, సింగరేణి, మండలాల్లో పనిచేశారు. 2016లో మహబూబ్‌నగర్‌లో జరిగిన టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యదర్శిగా ఆయన ఎన్నికయ్యారు. ‘‘ఇదివరకు ఉన్న అప్రెంటిస్ వ్యవస్థ రద్దు కోసం సుమారు 16 సంవత్సరాల పాటు మా సంఘం ఆధ్వర్యంలో పోరాటాలు చేశాం. ఆ వ్యవస్థను రద్దు చేయించగలిగాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ అట్టడుగు అన్ట్రెయిన్డ్ ఉపాధ్యాయుల రెగ్యులర్ కోసం పోరాడి సాధించాం. సీపీఎస్ రద్దు కోసం గత ఏడాది ఢిల్లీలోని పార్లమెంట్ ముందు 15 వేల మంది ఉపాధ్యాయులతో ధర్నా నిర్వహించాం. విజయం సాధించే వరకూ పోరాడుతూనే ఉంటాం.’’ అని రాందాస్ అన్నారు. లక్ష్మణ్‌నాయక్, టీఎస్‌టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు టేకులపల్లి మండలానికి చెందిన ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్స్ ఫెడరేషన్(గతంలో ఈ యూనియన్ టీటీటీఎఫ్గా ఉండేది) రాష్ట్ర అధ్యక్షుడిగా 2013 నుంచి కొనసాగుతున్నారు. ‘‘ఏజెన్సీ పాఠశాలల్లో జీఓ నెం 3 ప్రకారం నూరు శాతం ఉద్యోగాలు గిరిజన ఉపాధ్యాయులతోనే భర్తీ చేయాలని పోరాడాం. సాధించాం. పీఆర్సీలో రావాల్సిన ఏహెచ్‌ఆర్‌ఏ అలవెన్సులు వచ్చేలా ఉద్యమించాం. ఏజెన్సీలో పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులను మైదాన ప్రాంతాలలోకి వెళ్లడానికి సహకరించాం. ముంపు ఉపాధ్యాయులను మన జిల్లాకు వచ్చేందుకు పోరాటం చేశాం. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయులకు 342జీఓ ద్వారా ఉన్నత విద్య(ఎంఈడీ లేదా పీజీ) అవకాశం కల్పించాలని పోరాటాలు చేస్తున్నాం. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ (ఓపీఎస్) స్కీంనే కొనసాగించాలని కొన్నేళ్లుగా పోరాటం చేస్తున్నాం.’’ అని లక్ష్మణ్ నాయక్ అన్నారు. సీహెచ్ రవి, టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్వంచకు చెందిన చావా రవి ఖమ్మంలోని నయాబజార్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తూ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం 2014 జూన్ 2 నుంచి టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఉమ్మడి రాష్టంలో 2006 నుంచి ‘ఐక్య ఉపాధ్యాయ’అనే మాస పత్రికకు ప్రధాన సంపాదకుడిగా పనిచేశారు. 1997 నుంచి 2006 ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ‘‘ఎస్సీ, ఎస్టీ, బీసీ బ్యాక్లాగ్ అన్ట్రెయిన్డ్ ఉపాధ్యాయులను స్పెషల్ విద్యావలంటీర్లుగా గుర్తించి వారికి అన్ని వసతులు కల్పించడానికి పోరాటం చేసి విజయం సాధించాం. సీపీఎస్ వ్యతిరేక ఉద్యమంలో మా సంఘం కీలక భూమిక పోషిస్తోంది. నాణ్యమైన విద్యాభోదన అందాలంటే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.’’ అని రవి పేర్కొన్నారు. కేఎస్సీ చౌదరి, పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కొత్తగూడేనికి చెందిన కె.సురేష్ చంద్ర చౌదరి పాత కొత్తగూడెంలోని తెలంగాణ ప్రభుత్వ ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో హెచ్ఎంగా పనిచేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ‘‘గిరిజన ఉపాధ్యాయులకు ఇంక్రిమెంట్ల విషయంలో పోరాటం చేసి సాధించాం. గతంలో ఉన్న హెచ్ఆర్ఏను 14.5 శాతానికి పెంచడానికి సుదీర్ఘంగా ఉద్యమించాం. మహిళా ఉపాధ్యాయులకు 5 అదనపు క్యాజువల్ లీవులకోసం పోరాడి సాధించుకున్నాం’’ అని చౌదరి అన్నారు. జయబాబు, ఏటీఏ రాష్ట్ర అధ్యక్షుడు భద్రాచలం పట్టణానికి చెందిన కల్లూరి జయబాబు చర్ల మండలంలోని లెనిన్ కాలనీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్(ఏటీఏ) రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈ సంఘానికి ఆయన 2012 నుంచి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ‘‘ఏజెన్సీలో ఏరియాలో నూరు శాతం ఉద్యోగాలు, పదోన్నతులు జీఓ నెం 03 ప్రకారం భర్తీ చేయాలని నిర్విరామంగా పోరాటాలు చేస్తున్నాం. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులను మైదాన ప్రాంతానికి పంపడానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాం. 2015 పీఆర్సీలో ఏజెన్సీ ప్రాంతంలో ఏహెచ్‌ఆర్‌ఏ జీఓ అమలు కోసం ఉద్యమించి విజయం సాధించాం.’’ అని జయబాబు వివరించారు. పూర్ణచందర్రావు, టీపీటీఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇల్లెందు మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన సాధినేని పూర్ణచందర్రావు తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 1983 నుంచి పూర్ణచందర్రావు టీపీటీఎఫ్లో కొనసాగుతున్నారు. గతంలో ఏపీటీఫ్గా ఉన్నప్పుడు 1983 నుంచి 2007 దాకా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ‘‘ఐటీడీఏలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 1974 నుంచి 1986 దాకా స ర్వీస్ రెగ్యులైజేషన్ లేదు. ఆ సమస్యను ఐటీడీఏ పీఓ దృష్టి్టకి తీసుకెళ్లి రెగ్యులైజేషన్ సాధించాం.’’ అని పూర్ణచందర్రావు చెప్పారు. -
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాములు
విద్యారణ్యపురి: తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్ (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడిగా సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలం లింగాపురం ప్రాథమిక పాఠశాల హెచ్ఎం సీహెచ్.రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హన్మకొండలో జరిగిన తెలంగాణ యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ముగిశాయి. ఇప్పటివరకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న ఎ.నర్సిరెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకోవడంతో ఆయన స్థానంలో సీహెచ్.రాములును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం డీసీ తండాకు చెందిన ఉపాధ్యాయుడు సోమశేఖర్‌ను కూడా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
కవులు, రచయితలకు పోటీలు
మహబూబ్‌నగర్ విద్యావిభాగం : టీఎస్ యూటీఎఫ్ రెండో రాష్ట్ర మహాసభలను పురస్కరించుకుని కవులు, రచయితలకు పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.జంగయ్య, సాహిత్య, సంస్కృతిక కన్వీనర్ ఆర్.నర్సింహులు తెలిపారు. కార్యక్రమ నిర్వహణ రచయితల కమిటీని ఆదివారం ఏర్పాటు చేశారు. జిల్లా కన్వీనర్‌గా ఆర్.నర్సిములు, కో కన్వీనర్‌గా వి.జనార్దన, 13మంది సభ్యులను ఎన్నుకున్నారు. కథలు, కవితలు, వ్యాసాలు, పాటలు, నాటికలు, బుర్రకథలు, పల్లెసుద్దులు, పద్యసంకలనము, బాలసాహిత్యము, విద్య, అక్షరాస్యత, మూఢనమ్మకాలు–శాస్త్రీయ ఆలోచన, అభివృద్ధి–అవినీతి, పేదరికం–వలసలు, దేశ సమైక్యత, మహిళలు–బాలికల సమస్యలు, ప్రపంచీకరణ– సమాజంపై ప్రభావము తదితర అంశాలపై పోటీలు ఉంటాయని తెలిపారు. తాలూకాస్థాయిలో 21, 22 తేదీలో సమావేశం నిర్వహిస్తామని, రచనలకు అక్టోబర్ 5 చివరితేదీగా నిర్ణయించామని, ఉత్తమ రచనలకు నగదు పురస్కారం అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కవులు జనార్దన, కృష్ణయ్య, లక్ష్మణమూర్తి, వెంకటయ్య, సత్యం పాల్గొన్నారు. -
కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ను రద్దు చేయాలి
టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ విద్యారణ్యపురి : ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు నష్టపరిచే కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్)ను రద్దు పరిచి పాత పెన్షన్ పథకాన్నే వర్తింప చేయాలనే డిమాండ్‌తో తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) జిల్లాశాఖ ఆధ్వర్యంలోఆదివారం హన్మకొండలోని పబ్లిక్ గార్డెన్ నుంచి ఏకశిల పార్కువరకు ర్యాలీ నిర్వహిచారు. అనంతరం ఏకశిల పార్కు వద్ద జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు కె.సోమశేఖర్ మాట్లాడుతూ ఉద్యోగ, కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభించడంలో యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఒకేరీతిగా వ్యవహరించారని అందులో భాగంగానే సీపీఎస్ పథకంను తీసుకొచ్చారన్నారు. ఇటీవల రిటైర్డ్ అయిన మృతి చెందిన సీపీఎస్ ఉద్యోగులకు నామమాత్ర పెన్షన్ కూడా రావడం లేదన్నారు. జిల్లాప్రధాన కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి మాట్లాడుతూ పీఎఫ్ఆర్డీఏ చట్టాన్ని రద్దు చేసి పెన్షన్ నిధులు ప్రైవేటుపరం కాకుండా చూడాలన్నారు. ర్యాలీలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ఎం.సదాశివరెడ్డి, సీనియర్ నాయకులు కె రంజిత్‌కుమార్, కార్యదర్శులు సీహెచ్.రవీందర్‌రాజు, ఆర్.వాసుదేవరెడ్డి, పెండెం రాజు, ఎ.రాజారాం, ఎన్.శ్రీనివాస్, డి.కిరణ్‌కుమార్, లింగారావు, రాజేంద్రప్రసాద్, కుమారస్వామి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కరువు భత్యం విడుదల చేయాలి
టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి విద్యారణ్యపురి : ఈ ఏడాది జనవ రి నుంచి బకాయి ఉన్న కరువు భత్యం వెంటనే విడుదల చేయాల ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యా య ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హన్మకొండలోని లష్కర్‌బజార్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన టీఎస్‌యూటీఎఫ్ జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రప్రభుత్వం జనవరి 16 నుంచి 6 శాతం డీఏ ప్రకటించటమే కాకుండా 7వ వేతన సవరణ సంఘం సిఫారసుల మేరకు నూతన వేతనాలను అమలు చేయాలన్నారు. డీఏని తటస్థం చేసినందున రాష్ట్ర ప్రభుత్వం డీఏ సూత్రాన్ని మార్చి అందుకు అనుగుణంగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పండిట్, పీఈటీల అప్‌గ్రెడేషన్ ప్రక్రియ, ఉమ్మడి సర్వీస్‌రూల్స్ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరారు. సమావేశంలో ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.సదానంద్, జిల్లా అధ్యక్షు డు సోమశేఖర్, ప్రధాన కార్యదర్శి బద్దం వెంకటరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అవారి శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్.మల్లారెడ్డి, కోశాధికారి ఎం.సదాశివరెడ్డి, జిల్లా కార్యదర్శు లు ఎం.రాజేందర్, ఎం.అన్నాదేవి, పెండం రాజు, సీహెచ్.వీందర్‌రాజు, ఎ.మురళీకృష్ణ, డి.కిరణ్‌కుమార్, ఎన్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
12న కలెక్టరేట్ ఎదుట ధర్నా
హత్నూర: కంట్రిబ్యూషనరీ పింఛన్ విధానాన్ని రద్దు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ పాత పింఛన్ విధానాన్నే అమలు చేయాలని కోరుతూ ఈ నెల 12న సంగారెడ్డిలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా నాయకుడు శ్రీనివాస్‌రావు అన్నారు. బుధవారం దౌల్తాబాద్‌లో ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని పలుమార్లు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు. సీపీఎస్ రద్దు కోసం దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో దశలవారీగా కార్యక్రమాలకు ఎస్టీఎఫ్ఐ పిలుపునిచ్చిందన్నారు. -
సీపీఎస్ రద్దు చేసే వరకు పోరాటం
దండేపల్లి : కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం(సీపీఎస్) రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఆగాచారి తెలిపారు. టీఎస్‌యూటీఎఫ్ సభ్యత్వ నమోదులో భాగంగా సోమవారం ఆయన దండేపల్లికి వచ్చారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులతో సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగులు సీపీఎస్ విధానంతో అనేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీనిని రద్దు చేయాలని సంఘం ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టినట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో ర్యాలీలు, అక్టోబర్‌లో ఢిల్లీలో ఆందోళన చేపడతామని తెలిపారు. సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు కందుల తిరుపతి, జిల్లా నాయకులు గోళ్ల రామన్న, రమేశ్, రాజేశం, బాలశౌరి, మండల అధ్యక్ష, కార్యదర్శులు చంద్రమౌళి, తిరుపతి పాల్గొన్నారు. -
ఉమ్మడి విద్యావిధానాన్ని అమలు చేయాలి
– టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి విద్యావిధానాన్ని అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర మహాసభలలో సామాజిక, విద్యారంగ అంశాలపై చర్చిస్తామని, జిల్లాలో అక్షరాస్యతలో వెనుకబాటుపై డాక్యుమెంటరీ రూపొందిస్తామని అన్నారు. మహాసభలు మహబూబ్‌నగర్‌లో డిసెంబర్ నెలలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసుకున్నారు. గౌరవ చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, చైర్మన్‌గా టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా జంగయ్య, కోశాధికారిగా ఎన్.వెంకటేష్, టీఎస్‌యూటీఎఫ్ పూర్వనాయకులు, విద్యావేత్తలు, విద్యాభిమానులు, ప్రజాసంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వెంకటేష్, జంగయ్యలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యుటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేయాలి
నల్లగొండ టూటౌన్ : ఉపాధ్యాయులను సంబంధించిన అక్రమ డిప్యూటేషన్లు వెంటనే రద్దు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్.రాములు డిమాండ్ చేశారు. ఆదివారం యూటీఎఫ్ భవన్లో జరిగిన ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేతనం తీసుకున్న చోటే పనిచేయాల్సి ఉన్నా ఈ మధ్య కాలంలో విద్యార్థుల అవసరాల దృష్ట్యా కాకుండా ఉపాధ్యాయుల సౌకర్యార్థం ఇతర మండలాలకు ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తున్నారని తెలిపారు. సూర్యాపేట నుంచి భువనగిరికి, తుంగతుర్తికి అక్రమంగా సర్దుబాటు చేశారని విమర్శించారు. ప్రజా ప్రతినిధుల వద్ద ముగ్గురు ఉపాధ్యాయులు పీఏలుగా పనిచేస్తున్నారని వెంటనే వారి డిప్యూటేషన్ రద్దు చేయాలన్నారు. సమావేశంలో యూటీఎప్ జిల్లా అధ్యక్షుడు ఎం.రాజశేఖర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎడ్ల సైదులు, పేరుమాళ్ల వెంకటేశం, యాదయ్య, అరుణ, రామలింగయ్య, సైదులు, సయ్యద్, నాగమణి తదితరులు పాల్గొన్నారు. -
‘ముంపు’ టీచర్లకు సూపర్ న్యూమరరీ పోస్టులు
* టీఎస్‌యూటీఎఫ్‌కు కమల్‌నాథన్ హామీ సాక్షి, హైదరాబాద్: పోలవరం ముంపు ప్రాంత ఉపాధ్యాయులు, ఉద్యోగులకు తెలంగాణలో సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి, సర్దుబాటు చేస్తామని ఉద్యోగుల విభజన సలహా కమిటీ చైర్మన్ కమల్‌నాథన్ హామీ ఇచ్చారని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్) నాయకులు అలుగుబెల్లి నర్సిరెడ్డి, చావ రవి, ఎం.ఎ.కె. దత్తు తెలిపారు వీరు సోమవారం సచివాలయంలో కమల్నాథన్ను కలసి వినతిపత్రం సమర్పించారు. ముంపు ప్రాంత ఉద్యోగులను ఖమ్మం జిల్లాలోనే సర్దుబాటు చేసేందుకు అనుమతివ్వాలని కోరారు. దీనిపై కమల్‌నాథన్ స్పందిస్తూ ముంపు ప్రాంత ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఆప్షన్లు ఇవ్వాలని నిర్ణయించామని, అయితే తెలంగాణలోకి వచ్చే వారికోసం సూపర్ న్యూమరరీ పోస్టులను సృష్టించాలని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలను పంపి అనుమతి తీసుకోవాలని కమల్‌నాథన్ చెప్పారని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు తెలిపారు. 17న నిర్వహించే కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారని వారు తెలిపారు.