టీఎస్‌యూటీఎఫ్ మహాసభలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ జయతీ ఘోష్. చిత్రంలో ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అన్ని వర్గాల వారిని ప్రోత్సహించి విద్యాభివృద్ధికి కృషి చేయడం ద్వారానే జ్ఞాన సముపార్జన జరిగి సామాజిక ఎదుగుదల సాధ్యమవుతుందని ప్రముఖ ఆర్థికవేత్త ప్రొఫెసర్ జయతీఘోష్ అన్నారు. ఆదివారం ఖమ్మంలో తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య (టీఎస్‌యూటీఎఫ్) రాష్ట్ర తృతీయ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ సభలకు ముఖ్య అతిథిగా హాజరైన జయతీఘోష్ మాట్లాడుతూ.. కులం, మతం, లింగ ఆర్థిక విషయాల్లో పాలకులు ప్రజల్లో విభే దాలను సృష్టిస్తున్నారన్నారు. భిన్నత్వాన్ని నిర్వీ ర్యం చేసేందుకు కేంద్రంలో మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. భిన్నత్వాన్ని ప్రోత్సహించే యూనివర్సిటీలు, ఉన్నత విద్యాసంస్థలపై జరుగుతున్న దాడులే దీనికి కారణమన్నారు. హైదరాబాద్ తదితర యూనివర్సిటీల్లో జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం చేయిస్తున్న దాడులకు నిదర్శనమని చెప్పారు.
విద్యావ్యవస్థలో భయంకర పరిస్థితి: చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య మాట్లాడుతూ..ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో విద్యావ్యవస్థలో భయంకర పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. మనసులోని మాటను కూడా చెప్పలేని స్థితి రాష్ట్రంలో ఉందన్నారు. ఛాందస భావాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గురుకులాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలన్నీ బలోపేతం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులంతా విద్యా వ్యవస్థను మెరుగుపర్చేలా పోరాడాలని కోరారు. ప్రతీ విద్యార్థిలో ప్రశ్నించే తత్వాన్ని ప్రోత్సహించాలని, అందుకు తగిన విధంగా ఉపాధ్యాయుల బోధనలు ఉండాలని సూచించారు.
రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు: ప్రొఫెసర్ నాగేశ్వర్, హరగోపాల్
ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ..రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు అదే రాజ్యాంగ లక్ష్యాలకు తూట్లు పొడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ..పాఠశాలల్లో ఆట స్థలాలే ఏర్పాటు చేయని దేశంలో కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు శ్రీరాములు, చావా రవి, ఉపాధ్యక్షురాలు దుర్గాభవాని, బి.నర్సింహారావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగమల్లేశ్వరరావు, వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment