మాట్లాడుతున్న నర్సిరెడ్డి
– టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి
మహబూబ్‌నగర్ విద్యావిభాగం: తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి విద్యావిధానాన్ని అమలు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నర్సిరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘాన్ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్ర మహాసభలలో సామాజిక, విద్యారంగ అంశాలపై చర్చిస్తామని, జిల్లాలో అక్షరాస్యతలో వెనుకబాటుపై డాక్యుమెంటరీ రూపొందిస్తామని అన్నారు. మహాసభలు మహబూబ్‌నగర్‌లో డిసెంబర్ నెలలో చేపట్టనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఆహ్వాన సంఘం ఏర్పాటు చేసుకున్నారు. గౌరవ చైర్మన్‌గా జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్, చైర్మన్‌గా టీజేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కోశాధికారి ఎన్.కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా జంగయ్య, కోశాధికారిగా ఎన్.వెంకటేష్, టీఎస్‌యూటీఎఫ్ పూర్వనాయకులు, విద్యావేత్తలు, విద్యాభిమానులు, ప్రజాసంఘాల నాయకులు సభ్యులుగా ఉంటారని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎన్.వెంకటేష్, జంగయ్యలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యుటిఎఫ్ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.