‘మాధ్యమిక ’ మాఫియా
‘మాధ్యమిక ’ మాఫియా
Published Sun, May 7 2017 11:25 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
విద్యా విధానంలో మార్పు రావాలి
మాజీ ఎంపీ హర్షకుమార్
కంబాలచెరువు (రాజమహేంద్రవరంసిటీ) : ఇంటర్మీడియెట్ విద్య ఒక మాఫియాలా తయారైందని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ అన్నారు. స్థానిక రాజీవ్‌గాంధీ డిగ్రీ కళాశాలలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుస్తెలు సైతం తాకట్టుపెట్టుకుని తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జూన్ ఒకటి నుంచి కళాశాలల్లో ప్రవేశాలు కల్పించాలి, అయితే ఫలితాలు వచ్చిన రోజే ఆయా కళాశాలల్లో సీట్లు అయిపోయాయని చెబుతున్నారని, ఎక్కడా రిజ్వేషన్ అమలు చేయడం లేదున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు రూ.2,300 వరకు అయితే ఒకో విద్యార్థి నుంచి రూ.లక్షల్లో గుంజడం మాఫియాను తలపిస్తోందన్నారు. కళాశాలలన్నింటికీ ఒకే ఫీజు విధానం అమలు చేయాలన్నారు. పేద విద్యార్థుల్లో మంచి మార్కులు వచ్చిన వారిని తీసి, వారికి కార్పొరేట్ విద్యాసంస్థల్లో రూ.70 వేల వరకు ప్రభుత్వమే ïఫీజు కట్టడం ఎంత దారుణమో తెలుస్తుందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కళాశాలలు నడుచుకోకపోతే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం ఇంటర్ బోర్డు ఆర్‌ఐవోకు ఉందన్నారు. బలహీన వర్గాలకు చెందిన 12 వేలమందికి పైగా విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు నోచుకోలేదన్నారు. ఇంటర్ విద్యలో తయారైన మాఫియాను ప్రభుత్వం వెంటనే అరికట్టాలని ఆయన కోరారు. పది ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానం సాధించడం ఆనందదాయకమన్నారు.
Advertisement