సమావేశంలో మాట్లాడుతున్న వెంకటరత్నం
అనంతగిరి : ఇటీవల నిర్వహించిన ఉపాధ్యాయ బదిలీలతో వికారాబాద్ జిల్లాలో ఏర్పడిన ఖాళీలను పదోన్నతులతో, కొత్త నియామకాలతో భర్తీ చేయాలని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రత్నం అన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బదిలీలతో వికారాబాద్ జిల్లాలో 1370 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలు ఏర్పడినట్లు చెప్పారు.
2012 నుంచి ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకపోవడంతోనే వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇటీవల నిర్వహించిన బదిలీలతో వికారాబాద్ లాంటి గ్రామీణ ప్రాంత జిల్లాలో ఖాళీల సంఖ్య మరింతగా ఉందన్నారు. కనీసం విద్యావలంటీర్లు దొరకని మండలాలు ఉన్నాయని, ఈ కారణంగా పిల్లల తల్లిదండ్రులకు ప్రభుత్వ బడులపై నమ్మకం పోతుందన్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేయాలనే ఉద్దేశంఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదన్నారు.
వేసవి సెలవుల్లో నిర్వహించాల్సిన బదిలీలను జూలైలో నిర్వహించడంతో విద్యార్థుల చేరికల్లో తీవ్ర ప్రభావం చూపిందన్నారు. జిల్లాలో చాలా బడు ల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. ఇప్పటికైనా ప్రభత్వం స్పందించి ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ప్రస్తుత ఉపాధ్యాయులకు ఉద్యోగన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్‌పై బదిలీలు చేసుకున్న వాటిని వెంటనే రద్దు చేయాలన్నారు.
సీనియర్ ఉపాధ్యాయులు ఒప్పుకున్నాకనే జూనియర్ ఉపాధ్యాయులకు డిప్యూటేషన్ ఇవ్వాలనే నిబంధన ఉన్నా అధికారులు పట్టించుకోక పోవడం దారుణమన్నారు. ఈ విషయంపైఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా> జిల్లా ప్రధాన కార్యదర్శి టి. పవన్‌కుమార్, జిల్లా సభ్యులు మాణిక్యం, పరమేష్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment