‘ఉపాధి’ని రద్దు చేసే యత్నం
♦ కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం
♦ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాల్సిందే
♦ కాంగ్రెస్ యువనేత స్పష్టీకరణ
♦ పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చాం: మన్మోహన్ సింగ్
♦ అనంతపురం జిల్లాలో ‘ఉపాధి కూలీలకు భరోసా సభ’
బండ్లపల్లి నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఈ పథకం అమల్లో వచ్చి పదేళ్లు అవుతున్న సందర్భంగా అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం ఉపాధి కూలీలకు భరోసా సభ నిర్వహించారు. రాహుల్ గాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, పలువురు కేంద్ర మాజీ మంత్రులు ఈ సభకు హాజయ్యారు.
కూలీలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారు
పేదలకు స్థానికంగా పనులు కల్పించి, వారిని ఆర్థికంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో యూపీఏ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని రాహుల్‌గాంధీ చెప్పారు. ఆయన బండ్లపల్లిలో ఉపాధి కూలీల భరోసా సభలో మాట్లాడారు. ఉపాధి హామీ పథకంతో ఎందరో కూలీలు ఆర్థికంగా నిలదొక్కుకున్నారని తెలిపారు. సామాన్యులు సైతం మోటార్ సైకిల్ కొనుక్కోగలిగారని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి, ఆర్థిక నిపుణులు సైతం ప్రశంసించిన ఈ పథకాన్ని రద్దు చేసి, పేదల కడుపు కొట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం ఎంతో బాగుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల పొగిడారని తెలిపారు. పథకం ప్రయోజనాలు అందరికీ అర్థమైనా ప్రధాని మోదీకి మాత్రం అర్థం కాలేదని విమర్శించారు. పథకాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం దేశంలో 4 లక్షల గ్రామాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని గుర్తుచేశారు.
ఆ ఖాతాల్లో జీరో బ్యాలెన్స్
జన్‌ధన్ యోజన ద్వారా పేదల పేరిట బ్యాం కు ఖాతా తెరిచి, అందులో రూ.15 లక్షలు వేస్తామని ప్రధాని మోదీ చెప్పారని, ప్రస్తుతం ఆ ఖాతాల్లో చూస్తే జీరో బ్యాలెన్స్ ఉందని రా హుల్‌గాంధీ ఎద్దేవా చేశారు. కేవలం బ్యాంకు ఖాతాలు తెరిచినంత మాత్రాన రైతు కూలీల కుటుంబాలు అభివృద్ధి చెందవని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉపాధి హామీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేస్తూనే ఆరోగ్య హక్కు కల్పిస్తామన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్యకు పాల్పడితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా ఆ విద్యార్థి దళితుడు కాదనే రీతిలో కేంద్ర మంత్రులు మాట్లాడటం సరి కాదన్నారు.
ప్రభుత్వం కళ్లు తెరిచేలా పోరాడాలి
ఉపాధి హామీ పథకం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వేగవంతం కావడానికి ఉపయోపడిందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చెప్పారు. పథకం ద్వారా పేదలకు ఆర్థిక భరోసా ఇచ్చామన్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం బీజేపీ ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆరోపించారు. పేదల పథకానికి తూట్లు పొడుస్తున్న ప్రభుత్వం కళ్లు తెరిచేలా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేత మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర నాయకులు పల్లంరాజు, జేడీ శీలం, సి.రామచంద్రయ్య, అంబికా సోనీ, మీరా కుమార్, ఆనంద్ శర్మ, మణిశంకర్ అయ్యర్, టి.సుబ్బరామిరెడ్డి, కేవీపీ రామచంద్రరావు, నాదెండ్ల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.