భూ నిర్వాసితులకు ఉపాధి చూపాలి
ఎన్‌పీకుంట : మండలంలో ఏర్పాటు చేస్తున్న అల్ట్రా మెగా సోలార్ పవర్ ప్రాజెక్టుతో భూములు కోల్పోయిన రైతులకు తగిన పరిహారంతో పాటు వారి కుటుంబాలకు ఉపాధి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక వైఎస్సార్ సీపీ నాయకుడు, డీసీఎంఎస్ డైరెక్టర్ టి.జగదీశ్వర్‌రెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కొన్నేళ్లుగా బీళ్లుగా ఉన్న రాసుపల్లి భూముల్ని పచ్చని పొలాలుగా మార్చేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హంద్రీ–నీవా కాలువకు శ్రీకారం చుట్టారన్నారు. అలాంటి కాలువకు ఇరువైపులా ఉన్న 7,600 ఎకరాల భూముల్ని సోలార్ ప్లాంట్ కోసం కారుచౌకగా రైతుల నుంచి తీసుకుని వారికి ఉపాధి చూపడంలో అలసత్వం వహించడం సరికాదన్నారు. ఎంత మందికి పరిహారం అందాలి, అర్హుల జాబితాలో పేర్లు లేని రైతుల వివరాలతో జాబితా తయారు చేయాలని స్థానిక నాయకుడు జగదీశ్వర్‌రెడ్డికి సూచించానన్నారు. ఈ వివరాలతో విద్యుత్ శాఖమంత్రిని కలిసి చర్చించడంతో పాటు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చేలా చూస్తానన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీనీవా ద్వారా కుప్పంకు నీరు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రధాన కాలువను పూర్తి చేస్తున్నారు తప్ప డిస్ట్రిబ్యూటరీలు చేయడంలో చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్రభాస్కర్‌రెడ్డి, మండల కన్వీనర్ పాలగిరి ఫకృద్ధీన్, డైరెక్టర్ గంగిరెడ్డి, రిటైర్డు వీఆర్వో ఓబుల్‌రెడ్డి, ఎస్సీ సెల్ యువజన విభాగం నాయకుడు అంజి, పుల్లారెడ్డి పాల్గొన్నారు.