వేతనాలపై వేటు! | Employment staff salaries stops jupally Krishna Rao | Sakshi
Sakshi News home page

వేతనాలపై వేటు!

Published Mon, Jun 6 2016 2:52 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

వేతనాలపై వేటు! - Sakshi

వేతనాలపై వేటు!

ఉపాధి సిబ్బందికి జీతాలు నిలిపేసిన యంత్రాంగం
లక్ష్యసాధనలో వెనుకబాటుకు ఫలితం
దాదాపు 200 మంది ఉద్యోగులకు నిలిచిన చెల్లింపులు
ఇకపై నెలవారీ లక్ష్యాల ఆధారంగానే జీతభత్యాలు

మంత్రి సూచనలు, ఆదేశాలను జిల్లా యంత్రాంగం ఆచరణలో పెట్టింది. నెలవారీ లక్ష్యాలు సాధించని ఉద్యోగులపై కొరడా ఝళిపిస్తోంది. ఇందులో భాగంగా తొలుత వేతనాలు నిలిపివేసింది. క్రమంగా వారి పరితీరును విశ్లేషిస్తూ చర్యలు తీవ్రతరం చేసేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ అడుగులు వేస్తోంది.

ఉపాధి హామీ పథకంలో పనితీరు ఆధారంగానే ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. వారికి నిర్దేశించిన లక్ష్యాలు.. సాధించిన పురోగతినే పరిగణనలోకి తీసుకుంటాం. నెలవారీ లక్ష్యాలు సాధించకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయి. అలాంటి ఉద్యోగులను ఉపేక్షించేది లేదు.
- గత నెలలో జరిగిన జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరువు నేపథ్యంలో ప్రతి కూలీకి పని కల్పించేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ఉద్యోగులకు లక్ష్యాలను నిర్దేశించింది. కూలీలకు అవగాహన కల్పించడంతో పాటు వారికి సకాలంలో పని కల్పించాలని ఆదేశించిన ఆ శాఖ.. లక్ష్యసాధనలో వెనుకబడిన వారికి తాజాగా షాక్ ఇచ్చింది. మే నెలకు సంబంధించి వేతనాలు నిలిపివేసింది. సాధారణంగా ఒకటో తేదీన ఉద్యోగుల ఖాతాల్లో వేతన డబ్బులు జమ కావాల్సి ఉండగా.. ప్రస్తుతం ఏడో తేదీ కావస్తున్నా వారి ఖాతాల్లో నిధులు జమకాకపోవడం గమనార్హం.

 పని కల్పించడంలో అలసత్వం..
కూలీలకు వందరోజుల పని కల్పించేందుకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. కరువు నేపథ్యంలో ఇందుకు అదనంగా మరో 50రోజుల పనిదినాలు కల్పించేందుకు కేంద్రం సైతం నిబంధనలు సడలించింది. వానాకాలంలోపు లక్ష్యాలు అధిగమించాలని నిర్దేశించినప్పటికీ జిల్లాలోని పలు మండలాల్లో సాధన వెనకబడింది. అదేవిధంగా హరితహారం పథకం కింద మొక్కల పెంపకానికి సంబంధించి నిర్వహణ చెల్లింపుల్లో సిబ్బంది అలసత్వం తోడైంది. దీంతో ఆయా మండలాల్లోని సాంకేతిక సహాయకులు, కంప్యూటర్ ఆపరేటర్లు, ప్లాంటింగ్ సూపర్‌వైజర్ల వేతనాలకు బ్రేక్ పడింది.

మే నెలలో నిర్దేశించిన పని దినాలను వందశాతం పూర్తి చేయాల్సి ఉంది. జిల్లా వ్యాప్తంగా 57.19లక్షల పని దినాలకు కూలీలకు కల్పించాల్సి ఉండగా.. నెలాఖరు నాటికి కేవలం 49.32లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు. నిర్దేశించిన లక్ష్యంలో 86.25శాతం పురోగతి నమోదైంది. కొన్ని మండలాల్లో వందకంటే ఎక్కువ స్థాయిలో పనిదినాలు కల్పించడంతో పురోగతి మెరుగ్గా ఉంది. కానీ వందశాతం పురోగతి లేని మండలాల్లోని సిబ్బంది వేతనాలపై వేటుపడింది. చేవెళ్ల, దోమ, గండీడ్, హయత్‌నగర్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కుల్కచర్ల, మహేశ్వరం, పూడూరు, షాబాద్, శంకర్‌పల్లి, తాండూరు, యాచారం మండలాల్లో పురోగతి 60శాతం కంటే తక్కువగా ఉంది.

 అనుసంధానం కాలేదని...
జాబ్‌కార్డు పొందిన ప్రతి కూలీ ఆధార్ వివరాలను ఈజీఎస్ సాఫ్ట్‌వేర్‌లో అనుసంధానం చేయాల్సి ఉంది. దాదాపు రెండు నెలలుగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నప్పటికీ జిల్లాలో ఆశించినస్థాయిలో పురోగతి లేదు. జిల్లావ్యాప్తంగా జాబ్‌కార్డ్ పొందిన వారు 4,07,623 మంది ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 52,809 మంది ఆధార్ వివరాలు మాత్రమే ఆన్‌లైన్‌లో అనుసంధానం చేశారు. నిర్దేశిత లక్ష్యంలో కేవలం 12.96శాతం మాత్రమే సాధ న కనిపిస్తుంది. జిల్లా సగటు కంటే తక్కువగా ధారూర్, కందుకూరు, కుల్చచర్ల, పూడూరు, వికారాబాద్, యాలాల మండలాల్లో ఆధార్ నమోదు జరిగింది. ఈ మండలాల్లో పదిశాతం కంటే తక్కువగా సీడింగ్ జరగడంతో ఈ మండలాల్లోని సహాయ ప్రాజెక్టు అధికారులకు వేతనాలు నిలిపివేశారు. అయితే వేతనాలు నిలిపివేసిన ఉద్యోగులకు మరో అవకాశం కల్పించాలని యంత్రాంగం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రెండు రోజుల్లో వారికి వేతనాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement