కడుపు నింపని ఉపాధి పనులు
- పట్టించుకోని అధికారులు
- 3నెలలుగా కూలిడబ్బులు చెల్లించకపోవడంతో
- ఇబ్బందుల్లో కూలీలు
మెదక్‌రూరల్: రెండేళ్లుగా వర్షాలు లేకపోవడంతో ఏర్పడిన తీవ్ర కరువు పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించినప్పటికీ సకాలంలో కూలి డబ్బులు అందక పస్తులుండక తప్పడం లేదు. వర్షాలు కురియక వేసిన పంటలు ఎండిపోయి కొంతమంది బతుకు దెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లారు. మరికొంతమంది గ్రామాల్లో ఉండగా, వారికి ప్రభుత్వం ఉపాధి కల్పిస్తోంది కానీ సకాలంలో బిల్లులు మాత్రం చెల్లించడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఉపాధిహామీ పథకంలో పనులు చేసి నెలలు గడుస్తున్నా కూలి డబ్బులు చెల్లించడంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మెదక్ మండలంలోని 25 గ్రామ పంచాయతీలకుపైగా వేలాది మంది కూలీలు ఉపాధి పనులు చేపట్టినప్పటికీ సకాలంలో కూలి డబ్బులు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని కూలీలు ఆరోపిస్తున్నారు. మెదక్ మండలం పాతూర్ గ్రామంలోని ప్రజలు 30 గ్రూపులుగా ఏర్పడిన సుమారు 300 మంది ఉపాధిహామీ పథకంలో కూలి పనులు చేశారు. మూడు నెలల క్రితం రెండు వారాలపాటు కొంతమంది కూలీలు, మూడు వారాలు మరికొంతమంది ఉపాధి పనులు చేయించారు.
కాగా పనులు చేసి మూడు నెలలు గడిచిపోతున్నా ఏ ఒక్క కూలికి కూడా డబ్బులు చెల్లించలేదు. అవసరానికి ఆదుకోని ఉపాధి పనులు చేసే బదులు...వలసవెళ్లడమే నయమని ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు.
నాలుగు నెలలు కావొస్తున్నా కూలి డబ్బులు ఇస్తలేరు:
ఉపాధి పథకంలో కూలీ పనులుచేసి 4నెలలుకావస్తున్న కూలీడబ్బులు మాత్రం ఇస్తలేరు. నాకు మూడు వారాల కూలీ డబ్బులు రావాల్సి ఉంది. ఎన్నిసార్లు అడిగినా నిధులు రాలేవంటూ సమాధానం చెబుతున్నారు.
-మేడిపల్లి ఎల్లవ్వ, పాతూరు
రెండు వారాల కూలీ డబ్బులు రావాలి:
కరువు కాలంలో తిండికిలేక ఉపాధి పథకంలో కూలీకి పోతే మూడు నెలలు గడిచినా కూలీ డబ్బులు ఇస్తలేరు. అసలే కరువుతో అలమటిస్తున్న మాకు పంటలు చేతికందక, పనులు లేక, చేసిన పనులకు కూలీడబ్బులు రాక ఆర్ధాకలితో అలమటిస్తున్నాం. అధికారులు స్పందించి వెంటనే కూలీ డబ్బులు చెల్లించాలి.
-దూరబోయిన పోచమ్మ, పాతూరు