‘ధర్మకర్తల’ నియామకానికి నోటిఫికేషన్
ఐదేళ్ల తర్వాత దేవాలయాల పాలకమండళ్లకు మోక్షం
తాండూరు: నామినేటెడ్ పదవుల కోసం ఎప్పటినుంచో నిరీక్షిస్తున్న టీఆర్‌ఎస్ నేతలకు ఇది తీపి కబురు. దేవాలయాలకు కొత్త పాలకమండళ్ల ఏర్పాటుకు సర్కారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఎట్టకేలకు ఐదేళ్ల తరువాత దేవాలయాల పాలక మండళ్లకు మోక్షం కలిగింది. ఆయా దేవాలయాల ధర్మకర్తల నియామకం కోసం తెలంగాణ ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఎన్.శివశంకర్ సోమవారం నోటీఫికేషన్ జారీ చేశారు. ఈనేపథ్యంలో ఇప్పటికే నామిటెడ్ పదవుల రేసులో ఉన్న గులాబీ శ్రేణులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేశాయి. తాండూరు నియోజకవర్గంలో శ్రీభావిగి భద్రేశ్వర్, శ్రీపోట్లీ మహారాజ్, శ్రీకాళికాదేవి, శ్రీనగరేశ్వర(తాండూరు పట్టణం), శ్రీజుంటుపల్లి రామస్వామి దేవాలయం(యాలాల మండలం), కోత్లాపూర్ శ్రీరేణుకా ఎల్లమ్మ(తాండూరు మండలం) దేవాలయాల ధర్మకర్తల నియామకం కోసం కమిషనర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ధర్మకర్తలుగా నియామకం కోసం ఆసక్తి ఉన్నవారు నోటిఫికేషన్ జారీ అయిన 20 రోజుల్లోపు కమిషనర్, సంయుక్త కమిషనర్‌లకు దరఖాస్తులు చేసుకోవాలని నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.