కిడ్నాప్ హైడ్రామా..!
ఇంజినీరింగ్ విద్యార్థిని కిడ్నాప్ కలకలం
3 గంటల్లోనే కేసును చేధించిన పోలీసులు
పోలీస్‌స్టేషన్‌లో ఉండి పర్యవేక్షించిన సీపీ
స్నేహితుడే కిడ్నాపర్‌గా గుర్తింపు
అబిడ్స్: ఇంజనీరింగ్ విద్యార్ధిని కిడ్నాప్ నగరంలో కలకలంరేపింది. కాలేజీకి వెళ్లిన విద్యార్ధిని రాత్రి వరకు ఇంటికి రాకపోగా ఆమె ఫోన్‌తోనే రూ.30 లక్షలు ఇవ్వకపోతే మీ అమ్మాయిని చంపుతామంటూ బెదిరింపు కాల్ రావడంతో నగర పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించింది. దీంతో నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి షాహినాయత్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లోనే మకాం వేసి కిడ్నాప్ కేసును చేధించారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. షాహినాయత్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని బేగంబజార్ బేదర్‌వాడికి చెందిన విద్యార్ధిని(20), శాలిబండ ప్రాంతానికి చెందిన అభిషేక్(20) బండ్లగూడ మహవీర్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. సోమవారం ఉదయం కాలేజీకి వెళ్లిన విద్యార్ధిని రాత్రి 10 గంటల దాటినా ఇంటికి చేరుకోలేదు. అదే సమయంలో ఆమె ఫోన్ నుంచి కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశానని, వెంటనే రూ.30 లక్షలు ఇవ్వాలని, లేనిచో చంపేస్తానంటూ ఫోన్‌లో బెదిరింపులకు పాల్పడ్డాడు.
అంతేగాక కాలేజీలో గాని, పోలీస్‌స్టేషన్‌లో గానీ ఫిర్యాదు చేస్తే అంతు చూస్తానంటూ బెదిరించాడు. దీంతో విద్యార్ధిని తండ్రి, బాబాయి షాహినాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీనిపై సమాచారం అందడంతో నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి రాత్రి 11 గంటల సమయంలో షాహినాయత్ గంజ్ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి దర్యాప్తును పర్యవేక్షించారు. వెస్ట్‌జోన్ డీసీపీ వెంకటేశ్వర్‌రావు, టాస్క్‌ఫోర్స్ అధికారులు, సిబ్బంది కిడ్నాపర్ ఆచూకీ కోసం 3 గంటల పాటు శ్రమించారు. మంగళవారం తెల్లవారుజామున కిడ్నాపర్ ఫోన్ నెంబర్ ఆధారంగా అతను శాలిబండ సమీపంలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు నిందితుడు అభిషేక్‌తో పాటు విద్యార్ధినిని కూడా అదుపులోకి తీసుకున్నారు. విద్యార్ధిని స్నేహితుడే కిడ్నాపర్ కావడం పోలీసులను విస్మయానికి గురిచేసింది.
ఉరుకులు పెట్టించిన ఫోన్ నెంబర్...
కిడ్నాపర్ అభిషేక్ ముందుగా సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జిలో సాయంత్రం గదిని అద్దెకు తీసుకోవడంతో పోలీసులు ఫోన్ నెంబర్ ఆధారంగా అక్కడికి చేరుకున్నారు. అక్కడ 3 గంటల పాటు ఉండి అభిషేక్, ఆ విద్యార్ధినితో లాడ్జ్ ఖాళీ చేసి మెహిదీపట్నం చేరుకున్నాడు.
మెహిదీపట్నంలో ఫోన్ నెంబర్ ఆధారంగా టాస్క్‌ఫోర్స్, ఇతర పోలీసులు అక్కడకు వెళ్లగా వారి ఆచూకీ లభించకపోవడంతో అక్కడి నుంచి చార్మినార్ వెళ్లారు. చార్మినార్ సమీపంలోని శాలిబండ వద్ద పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కిడ్నాప్ డ్రామా నడిపిన విద్యార్ధి అభిషేక్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.