భూమి విక్రయంపై విచారణ
Published Thu, Sep 1 2016 9:15 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
కోరుట్ల : లే–అవుట్ నిబంధనలు పాటించకుండా భూముల అమ్మకాలు జరిపారని మున్సిపల్ చైర్మన్ శీలం వేణుపై హైకోర్టులో దాఖలైన ఫిర్యాదు మేరకు కోర్టు ఆదేశాలతో గురువారం మున్సిపల్ ఆర్‌డీ జాన్ శాంసన్, టౌన్ ప్లానింగ్ ఆర్‌డీ చంద్రిక గురువారం విచారణ జరిపారు. పట్టణంలోని 735, 756(ఈ) సర్వే నంబర్లలోని స్థలంలో లేఅవుట్ లేకుండా భూమి విక్రయించారని ఏడాదిక్రితం కోరుట్లకు చెందిన కటుకం దివాకర్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిపై సెప్టెంబర్ 9వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని మున్సిపల్ డీఎంఏను హైకోర్టు ఆదేశించింది. మున్సిపల్ కార్యాలయానికి మున్సిపల్ ఆర్‌డీ జాన్ శాంసన్, టౌన్‌ప్లానింగ్ ఆర్‌డీ చంద్రిక వచ్చారు. ఫిర్యాదుదారు దివాకర్‌ను విచారించిన అనంతరం భూమిని పరిశీలించారు. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు చైర్మన్ లేఖ ఇచ్చారని అధికారులు తెలిపారు. శుక్రవారం మరోమారు చైర్మన్‌ను విచారిస్తామని అనంతరం నివేదికను హైకోర్టుకు పంపుతామని చెప్పారు. అనంతరం ఆర్‌డీ చంద్రిక విలేకరులతో మాట్లాడుతూ లేఅవుట్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కలిగి ఉంటే మేలు జరుగుతుందన్నారు. నిబంధనలు పాటించకుంటే ప్రజలపై భారం పడుతుందన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వాణిరెడ్డి పాల్గొన్నారు.
Advertisement
Advertisement