బంజారాహిల్స్: అధికార బీఆర్‌ఎస్‌కు చెందిన కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఆయన అనుచరులపై బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో క్రిమినల్ కేసు నమోదైంది. ఓ భూవిక్రయం విషయంలో ఎమ్మెల్యే, మరికొందరు తనపై భౌతిక దాడికి పాల్పడటంతోపాటు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సామ ఇంద్రపాల్‌రెడ్డి అనే వ్యక్తి ఇచ్చి న ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.
ఎమ్మెల్యే ద్వారా స్థలం కొని...
బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం... రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పరపల్లి నాయుడు కాలనీకి చెందిన సామ ఇంద్రపాల్‌రెడ్డి అదే ప్రాంతంలో స్థలం కొనేందుకు 2018లో ప్రయత్నాలు సాగించాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డితోపాటు రాకేశ్‌రెడ్డి మధ్యవర్తులుగా ఆయనకు పరిచయమయ్యారు. వారు ఆయనకు ఉప్పర్‌పల్లిలోని భూయజమానులను పరిచయం చేశారు. స్థలం కొనుగోలుకు అంగీకరించిన ఇంద్రపాల్‌రెడ్డి... ఎమ్మెల్యేతోపాటు ఆయన అనుచరులకు కమిషన్‌తో కలుపుకొని రూ. 3.65 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు.
భూయజమానులకు రూ. 90 లక్షలను అడ్వాన్స్ కింద చెల్లించడంతోపాటు రూ. 2.75 కోట్లకు ఖాళీ చెక్కులను ఎమ్మెల్యే వద్ద ష్యూరిటీగా ఉంచాడు. ఆ తర్వాత మిగిలిన మొత్తాన్ని యజమానులకు చెల్లించి భూమి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఇంద్రపాల్‌రెడ్డి... ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, ఆయన అనుచరుడు రాకేశ్‌రెడ్డికి చెరో రూ. 20 లక్షల చొప్పున కమీషన్ చెల్లించాడు. అయినప్పటికీ వారు ఖాళీ చెక్కులను ఇవ్వకపోగా మరో రూ. 60 లక్షలు డిమాండ్ చేశారు.
ఇందుకోసం ఆయన రుణానికి ప్రయత్నించగా లభించలేదు. దీంతో నాటి నుంచి తరచూ వేధింపులకు గురిచేస్తూ వచ్చిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు 2022 జూన్‌లో ఇంద్రపాల్‌రెడ్డిని బంజారాహిల్స్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు పిలిపించి తీవ్రంగా కొట్టడంతోపాటు చంపుతామని బెదిరించారు. అక్కడి నుంచి ఎలాగొలా తప్పించుకున్న ఇంద్రపాల్‌రెడ్డి దీనిపై 2022 జూన్ 26న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేయలేదు.
నిందితులపై చర్యలు తీసుకోవాలని వెస్ట్‌జోన్ డీసీపీని కోరినా స్పందించలేదు. దీంతో కోర్టును ఆశ్రయించగా ఎమ్మెల్యే, ఇతరులపై కేసు నమోదుకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే, మరికొందరిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఫిలింనగర్‌లో జరగడంతో కేసును ఫిలింనగర్ పీఎస్‌కు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment