పెరిగిన నేర చరితులు! | Increased criminal records | Sakshi
Sakshi News home page

పెరిగిన నేర చరితులు!

Published Sun, Nov 26 2023 5:21 AM | Last Updated on Sun, Nov 26 2023 5:11 PM

Increased criminal records - Sakshi

సాక్షి, హైదరాబాద్‌/సాక్షి, న్యూఢిల్లీ: గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో నేర చరితులు పెరిగారు. నేర చరిత్ర, పెండింగ్‌ కేసులు ఉన్న వారికి ఎన్నికల్లో సీట్లు కేటాయించవద్దని సుప్రీంకోర్టు సూచించినప్పటికీ రాజకీయ పార్టీలు అది పాటించక పోవడం గమనార్హం. మొత్తం 2,290 మంది అభ్యర్థుల్లో 23 శాతం మంది తమపై క్రిమినల్‌ కేసులు ఉన్నట్టుగా అఫిడవిట్లలో పేర్కొన్నారని అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఏడీఆర్‌) వెల్లడించింది.

2018 ఎన్నికలలో 1,777 మంది అభ్యర్థులకు గాను 21 శాతం (368) మంది అభ్యర్థులపై క్రిమినల్‌ కేసులు ఉండగా, ఈ ఎన్నికల్లో క్రిమినల్‌ కేసులు ఉన్నవారు 521 మంది ఉన్నారని ఏడీఆర్‌ వివరించింది. 353 మంది అభ్యర్థులపై సీరియస్‌ క్రిమినల్‌ కేసులు (5 ఏళ్లు అంతకు మించి శిక్షపడే కేసులు) ఉండగా, ఈ సంఖ్య 2018లో 321గా ఉన్నట్టు తెలిపింది. ఈ నెల 30న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.

కాగా అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించి వారిపై పెండింగ్‌ కేసులు, విద్యార్హతలు, ఆర్థిక స్థితిగతులు, వయసులు, మహిళలు, పురుషుల సంఖ్య వంటి వివరాలతో నివేదిక రూపొందించినట్టు ఏడీఆర్‌ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్లు రాకేశ్‌ దుబ్బుడు, వై.రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు.
 
కాంగ్రెస్‌లో ఎక్కువ.. 
అన్ని ప్రధాన పార్టీలు క్రిమినల్‌ కేసులు ఉన్న అభ్యర్థులకు టికెట్లు (14% నుంచి 72% వరకు) ఇచ్చాయి. అత్యధికంగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి 85 (72%) మంది, బీజేపీ నుంచి 79 (71%) మంది, అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 57 (48%) మంది, బీఎస్పీ నుంచి 40 (37%) మంది, సీపీఐ(ఎం) నుంచి 12 (63%) మంది, ఏఐఎంఐఎం నుంచి ఐదుగురు (56%), ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి 10 (24%) మంది క్రిమినల్‌ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారని ఏడీఆర్, తెలంగాణ ఎలక్షన్‌ వాచ్‌ సంస్థలు వెల్లడించాయి.  

కోటీశ్వరులూ పెరిగారు 
గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థుల్లో కోటీశ్వరుల సంఖ్య పెరిగింది. మొత్తం అభ్యర్థుల్లో 25 శాతంమంది కోటీశ్వరులు కాగా, రూ.10 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు 41.48% ఉన్నారు. ఇక ముగ్గురుకు మించి అభ్యర్థులపై క్రిమినల్‌ కేసు లు ఉన్నట్లయితే అటువంటి నియోజకవర్గాలను రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలుగా గుర్తించారు.

2018లో రెడ్‌ అలర్ట్‌ నియోజకవర్గాలు 78 ఉండ గా, ప్రస్తుత (2023) ఎన్నికల్లో ఇవి 96కు పెరిగాయి. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మహిళలకు ఆయా పార్టీలు ఇచ్చే సీట్ల సంఖ్య పెరిగే అవ కాశం ఉంటుందని అంచనా వేసినా అది జరగ లేదు. అన్ని పార్టీల్లో కలిపి పోటీలో ఉన్న (2,290 మంది) అభ్యర్థుల్లో 10% మంది మా త్రమే మహిళా అభ్యర్థులు కావడం గమనార్హం.  

ప్రధాన పార్టీలదే హవా 
ప్రదాన పార్టీలన్నీ సంపన్న అభ్యర్థులకే అత్యధికంగా సీట్లు కేటాయించాయి. 2,290 మంది అభ్యర్థులలో 580 (25%) మంది కోటీశ్వరులు ఉన్నారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 114 (96%) మంది, కాంగ్రెస్‌కు చెందిన 111 (94%) మంది, బీజేపీకి చెందిన 93 (84%)మంది రూ. కోటి కంటే ఎక్కువ ఆస్తులను ప్రకటించారు. 25 మంది తమకు ఒక్క రూపాయి కూడా ఆస్తి లేదని ప్రకటించడం గమనార్హం. 

అస్తుల్లో వివేక్‌ ఫస్ట్‌ 
చెన్నూరు కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం వివేకానంద్‌ తన ఆస్తుల విలువ రూ.606+ కోట్లుగా ప్రకటించి తొలి స్థానంలో నిలిచారు. రూ.458+ కోట్లతో మునుగోడు కాంగ్రెస్‌ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి, రూ.433 కోట్లతో పాలేరు కాంగ్రెస్‌ అభ్యర్థి పొంగులేటి రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. సీఎం కేసీఆర్‌ తన సంపద రూ.58+ కోట్లుగా, ఈటల, కేటీఆర్‌లు రూ.53+ కోట్లుగా, రేవంత్‌రెడ్డి రూ.30+ కోట్లుగా ప్రకటించారు. కాగా, 979 (43%) మంది తమ విద్యార్హతలను 5 నుంచి 12వ తరగతి మధ్య ఉన్నట్లు ప్రకటించగా, 1,143 (50%) మంది డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హత కలిగి ఉన్నట్లు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement