
జెడ్పీలోకి జర్నలిస్టులకు ఎంట్రీ
♦ మీడియాపై ఆంక్షలపై కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఆగ్రహం
♦ చైర్‌పర్సన్ చొరవతో దిగివచ్చిన సీఈఓ
♦ స్థాయీ సంఘాల సమావేశాల కవరేజీకి ఆహ్వానం
సాక్షి, సంగారెడ్డి: ఎట్టకేలకు జెడ్పీ సీఈఓ వర్షిణి వెనక్కి తగ్గారు. జెడ్పీ స్థాయీ సంఘం సమావేశాలకు మీడియా రావొద్దంటూ ఆమె జారీ చేసిన ఆర్డర్‌ను జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రాజమణియాదవ్‌తోపాటు, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ప్రభాకర్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. సమస్య సమసిపోయేలా చైర్‌పర్సన్ రాజమణి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఉదయం జరిగిన పనులు స్థాయీ సంఘం సమావేశంలో జిన్నారం జెడ్పీటీసీ ప్రభాకర్.. మీడియాపై ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ నల్లకండువా ధరించి సమావేశానికి హాజరయ్యారు. స్థాయీ సంఘం సమావేశాలకు మీడియాను అనుతించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంతోకాలంగా వస్తున్న సంప్రదాయాలను కాదని మీడియాపై ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో లేని ఆంక్షలు ఇక్కడ ఎందుకంటూ అసహనం వ్యక్తం చేశారు. మీడియా ప్రతినిధులు లేకపోతే తాము సమావేశం బహిష్కరిస్తామని ప్రభాకర్ హెచ్చరించారు. ఇదే సమయంలో జెడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు మనోహర్‌గౌడ్ కలుగజేసుకుని స్థాయీ సంఘం సమావేశాల్లోకి గతంలో మాదిరిగానే మీడియాను అనుమతించాలని డిమాండ్ చేశారు. జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి స్పందిస్తూ మీడియా ప్రతినిధులపై ఆంక్షలు విధించటం సరికాదన్నారు.
చైర్‌పర్సన్ ఆదేశం మేరకు సీఈఓ వర్షిణి స్థాయీ సంఘం సమావేశానికి మీడియా కవరేజికి సమ్మతించారు. జెడ్పీ సూపరింటెండెంట్ జమ్లానాయక్ మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చి సమావేశానికి హాజరుకావాల్సిందిగా కోరడంతో సమస్య సద్దుమణిగింది. ఆ తరువాత పనులు, ఆర్థిక ప్రణాళిక సమావేశాలు నిర్వహించారు. సావిత్రిభాయి పూలే వర్థంతి సందర్భంగా చైర్‌పర్సన్ రాజమణి, సీఈఓ వర్షిణి, జెడ్పీటీసీలు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
బిల్లులు ఇవ్వకపోతే సెలవులో వెళ్లండి...
వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లుల చెల్లింపు అంశంలో తీవ్ర జాప్యం జరుగుతోందని, బిల్లులు చెల్లించని పక్షంలో సెలవులో వెళ్లాలని జెడ్పీటీసీ ప్రభాకర్ ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు స్థాయీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెల్లాపూర్, గడ్డపోతారంలో చెరువులు ఆక్రమణకు గురవుతున్నా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. విచ్చలవిడిగా ఆర్‌ఓ ప్లాంట్లు వెలుస్తున్నాయని, ఎవరూ సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించటం లేదని, తాగునీరు వృథా అవుతోందని తెలిపారు. ఆర్‌ఓ పాంట్ల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని కోరారు. సంగారెడ్డి జెడ్పీటీసీ మనోహర్‌గౌడ్ మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కారం కోసం అవసరమైన చోట బోర్లు వేయాలని కోరారు.
నిబంధనలు మారిస్తే ఎలా..?: జెడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్
జెడ్పీలో ఉన్నతాధికారులు మారినప్పుడల్లా కొత్త నిబంధనలు తీసుకువస్తే పనులు ఎలా సాగుతాయని పటాన్‌చెరు జెడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక-ప్రణాళిక స్థాయీ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్‌ఎఫ్‌సీ నిధులను రద్దు చేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చె ప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపడుతున్నందున ఎస్‌ఎఫ్‌సీ నిధులు జారీ నిలిపివేశామని సీఈఓ తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు తాము పనులు ప్రతిపాదిస్తున్నామన్నారు. నిబంధనల మేరకు ఉన్న పనులను వెంటనే నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. తాగునీటి పథకాల్లో పనిచేస్తున్న కార్మికులకు గత ఎనిమిది నెలలుగా వేతనాలు లేవని, వెంటనే చెల్లించాలని కోరారు. ప్రస్తుతం తమ వద్ద నిధులు లేవని ప్రభుత్వానికి లేఖరాశామని సీఈఓ తెలిపారు.