భోగాపురం : మరడపాలెంలో ఎయిర్‌పోర్టు నిర్మాణంపై బుధవారం నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ వేదిక పార్టీ కార్యక్రమాన్ని తలపించిందని రైతులు దాట్ల క్రాంతి, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. స్థానిక వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయం వద్ద వారు విలేకరులతో మాట్లాడుతూ సమావేశానికి అందరినీ ఆహ్వానించినట్లుగా ఆహ్వానించి మార్గమధ్యలోనే పోలీసులు అరెస్టు చేసి జామి పోలీస్ స్టేషన్‌కు తరలించడం అన్యాయం అని అన్నారు. లాండ్ అక్విజేషన్ పూర్తి స్థాయిలో అవ్వకముందే ప్రజాభిప్రాయ సేకరణ ఏవిధంగా చేశారని ప్రశ్నించారు. అధికారులు అందించిన నివేదిక ప్రకారం దానిలో పొందుపరచిన అంశాలపై శాంతియుతంగా అడిగేందుకు మాత్రమే వచ్చామని, కానీ తమను అడ్డుకున్నారని చెప్పారు.
రైతులు, ప్రజలతో సంబంధం లేకుండా వారికి నచ్చిన కొద్దిమందితో నిర్వహించిన సమావేశం చెల్లదని, దీనిపై కోర్టుకు వెళతామని చెప్పారు. పోలీసులు రైతులను బెదిరిస్తూ అతిగా ప్రవర్తిస్తున్నారని పేర్కన్నారు. డి పట్టా భూములకు పరిహారం విషయంలో అధికార పార్టీ నాయకులు బ్రోకర్లుగా వ్యవహరించి రైతులను భయభ్రాంతులకు గురిచేసి దందా చేస్తున్నారని విమర్శించారు. సంబంధంలేని ఎంఎల్‌ఏ, ఎంపీపీ, జెడ్‌పీటీసీలను సమావేశంలో కూర్చోబెట్టడంలో అధికారుల్లో స్వామి భక్తి ఏవిధంగా ఉందో స్పష్టమైందని చెప్పారు. కార్యక్రమంలో భైరెడ్డి ప్రభాకరరెడ్డి, ఉప్పాడ శివారెడ్డి, దాట్ల శ్రీనివాసరాజు, కొల్లి గురుమూర్తి, పట్న తాతయ్యలు, మైలపల్లి అప్పలకొండ తదితరులు పాల్గొన్నారు.
ప్రజాభిప్రాయ వేదికా ? పార్టీ కార్యక్రమమా ?
Published Thu, Jan 12 2017 4:17 AM | Last Updated on Tue, Sep 5 2017 1:01 AM
Advertisement